పరమాత్మ నామస్మరణ: - - యామిజాల జగదీశ్

 కృష్ణుడి పేరు చెప్పడంవల్ల తన కష్టాలు మరింత ఎక్కువైనా పరవాలేదు అని చెప్పిన ఓ రాజు కథ....
పురుషోత్తమ రాజు ప్రతిరోజూ కృష ఏ పని ప్రారంభించేవాడు కాదు. ఉదయం నిద్రలేచినప్పుడు, అతను "హరి హరి" అని ఏడు సార్లు అంటాడు.
రాజభవనానికి బయలుదేరే ముందు, అతను "కేశవా, కేశవా" అని అంటాడు. 
భోజనానికి ముందు, అతను "గోవిందా" అని అనేవాడు. 
నిద్రపోయే ముందు, అతను "మాధవా" అని అంటాడు. 
ఈ విధంగా, అతను ప్రతి చర్యకు ఒకటి చొప్పున, పరంధాముడి పదహారు నామాలను ఏడేసి మార్లు పఠించేవాడు.
అయితే దేవుడి నామం ఎంతలా చెప్పినా, చేసిన పాపాలకు శిక్ష అనుభవించాల్సిందే. 
అటువంటి సమయం పురుషోత్తమ రాజుకు కూడా వచ్చింది. అతను అనేక వ్యాధులతో బాధపడుతు న్నాడు. అతను తన పెద్ద కొడుకుకు పాలనా బాధ్యతలు అప్పగించాడు. అయితే ఆ స్థితిలోనూ అతను కృష్ణుడి పేరును స్మరించడం మానలేదు.
"కృష్ణా... కృష్ణా... నా జీవితాన్ని ముగించు. నన్ను నీతో తీసుకెళ్లు" అని అతను విలపిస్తుండే వాడు. 
ఒకరోజు, ఒకానొక ముని రాజభవనానికి వచ్చాడు.
పురుషోత్తముడు పరమాత్మకు నమస్కరిస్తూ "స్వామీ, ఈ వ్యాధి క్రూరత్వాన్ని నేను భరించలేకున్నాను. నేను నా జీవితాన్ని ముగించాలనుకుం టున్నాను. కానీ ఈ జీవితం నన్ను విడిచిపెట్టడానికి నిరాకరిస్తోంది" అని బాధపడ్డాడు.
అప్పుడా ముని అతన్ని ఓదార్చుతూ, "రాజా! నువ్వు అన్నదానం చేస్తున్నావా?" అని అడిగారు.
"అవును, స్వామీ! ఇప్పుడు కూడా, నా దేశంలోని సత్రాలలో విప్రులకు, పేదలకు ప్రతి రోజూ అన్నం దానం నిరాటంకంగా కొనసాగుతోంది" అని రాజు అన్నాడు.
"ఐతే ఇకపై అలా చేయకు! కడుపారా అన్నం పెట్టకు. అర్ధాకలితో పంపించేస్తే....నీ జీవితం ముగుస్తుంది" అని అన్నారు ముని.
రాజుకి ఆయన మునివర్యుల మాట అర్థంకాక "మీరు ఎందుకలా అంటున్నారు స్వామీ? అలా చేయడం వల్ల నాకు మరింత పాపం  అంటుకుంటుంది కదా? వ్యాధిని మరింత తీవ్రతరం చేస్తుంది కదా!" అని రాజు అన్నాడు
"నువ్వు నాకు అర్ధాకలితో పంపించేస్తే వాళ్ళందరూ నీమీద కోపం తెచ్చుకుని నిన్ను నానా తిట్లూ తిడిస్తారు... శపిస్తారు... వారి శాపం వల్ల నువ్వు చనిపోతావు" అని ఆ ముని అన్నారు.
ముని చేసిన సూచన నచ్చకపోయినా, రాజు అందుకు అంగీకరించి, అందరినీ అర్థాకలితో పంపించేసేలా ఆదేశించాడు. ఎవరికీ కడుపు నిండా అన్నం పెట్ట వద్దన్నాడు.  
దాంతో ఆకలి తీరక వారు రాజుని తిట్టుకున్నారు‌‌. ఈయనకేమైంది... ఇలా సగం సగం పెట్టి పంపించేస్తే ఉన్నాడేంటీ అని మండిపడి రాజుని శపించారు. కానీ అనుకున్నది ఒకటి...అయినదొక్కటి అన్నట్లుగా రాజు ప్రాణం పోలేదు.
కానీ ఆశ్చర్యం, రాజు కష్టం తీరలేదు. ఆ వ్యాధి క్రూరత్వాన్ని, శాపాన్ని కలిపి అనుభవించాల్సి వచ్చిందా రాజు. 
"స్వామీ! "నేను మీరు చెప్పినట్లుగానే చేశాను, కానీ నేను చనిపోలేదు" అని రాజు అన్నాడు.
"అన్నదానం జరుగుతున్న చోట్ల నేను  గమనించిన విషయం నీకు చెప్పాలి... నీ సేవకులు అచ్యుతా అచ్యుతా అంటూ కృష్ణుడి మరో పేరు చెబుతూ  అన్నదానం చేస్తున్నారు. నువ్వూ నిన్ను మరచి అచ్యుతా అచ్యుతా అని స్మరిస్తున్నావు. అందువల్లే నువ్వింకా ఉన్నావు" అని అన్నారు ముని.
"అచ్యుతా అనే నామం చెప్పిన వారిని ఆ పరంధాముడు విడిచిపెట్టడు. కనుక ఇక నుండి, నువ్వు ఆ పరమాత్మ పేరు చెప్పడమూ మానేయాలి..." అని అన్నారు మునివర్యులు. 
కానీ రాజు అందుకు నిరాకరించాడు.
"నేను నా కృష్ణుడి పేరు స్మరించకుండా ఉండలేను. మీ మాటను జవదాటుతున్నాను. ఇందువల్ల నాకేం జరిగినా పర్వాలేదు. నేను మరింత ఇబ్బందిపడినా సరే పరమాత్మను స్మరించడం మానలేను...నన్ను పీడిస్తున్న వ్యాధి ఇలాగే కొనసాగినా పరవాలేదు... నేను ఆయన నామస్మరణను ఎప్పటికీ ఆపను" అని రాజు అన్నాడు.
రాజు దృఢ సంకల్పాన్ని గమనించిన కృష్ణపరమాత్మ ప్రత్యక్షమై అతనిని కష్టాల నుంచి కాపాడాడు. 
పరంధాముడి పేరు ఎంత శక్తిమంతమైనదో కదూ...కనుక పరమాత్మ నామ స్మరణ ఎప్పటికీ మంచిదే తప్ప కష్టాన్నిచ్చేది కాదు.
ఆ పరంధాముడి అనుగ్రహం పొందాలన్నదే ఈ నాలుగు మాటల ఉద్దేశం.

కామెంట్‌లు