శివుడు తమోగుణ ప్రధానుడు, అనంత కళ్యాణ గుణములు కలవాడు. ఈ చరాచర సృష్టికి ఈశ్వరుడే ప్రథముడు 'శివ' శబ్దానికి శుభం, క్షేమం, మంగళం అని అర్థాలు జాగ్రత్, స్వప్న, సుషుప్తి అవస్థలకు అతీతమైన ధాన్యావస్థలో గోచరించే తురీయ తత్త్వమే శివుడు. అన్నింటినీ ప్రకాశవంతం చేసే మూల చైతన్యమే శివతత్త్వం, సమస్తాన్నీ తన వశంలో ఉంచుకున్న సర్వేశ్వరుడు. అతడే ఇచ్ఛాశక్తి, జ్ఞాన శక్తి, క్రియాశక్తులతో కూడిన ఈశ్వరుడు. నమాశివాయ -బీజాక్షరాలు నుండి ఈ సమస్త జగత్తు పుట్టిందని శాస్త్రం.
సకల జీవకోటికి పరమేశ్వరుడు అధిపతి సృష్టి, స్థితి, లయ కారుడైన పరమేశ్వరుని పవిత్ర జన్మదినమే మహాశివరాత్రి, నిరాకార దైవరూపమైన లింగంలో చరాచర సృష్టి తత్త్వము ఇమిడిఉంది. అగోచరత్తత్వానికి ప్రతీక శివలింగం. భూమి పీఠంగా, ఆకాశం లింగంగా భూమ్యా కాశాలలో నిండి ఉన్న బ్రహ్మాండమే శివలింగం, 'లింగం' అంటే తెలియని విషయాల్ని తెలియచేసేది. మనకు ముక్కోటి దేవతలున్నా అందరూ అర్చనామూర్తి రూపంలోనే పూజలందుతారు. ఒక్క పరమేశ్వరుడు మాత్రమే మూర్తి రూపంలో కాకుండా లింగ రూపంలో పూజలందుతాడు. ఇదే సృష్టి తత్త్వంలోని విచిత్రం.
మహాశిరాత్రి సర్వపాపనాశనము, భక్తి, ముక్తి ప్రదాయకము, మహాశివరాత్రిని ప్రదోషవ్యాపినిగను. అర్ధరాత్రి చతుర్దశీ వ్యాపినిగను చెప్పబడింది. మాఘబహుళక చతుర్దశి నాటి అర్థరాత్రి పన్నెండు గంటల సమయంలో శివుడు బృహలింగ రూపంలో ఆవిర్భవించిన పవిత్ర కాలాన్ని లింగోద్భవ కాలమనీ, ఈ లింగోద్భవ కాలంలో శివున్ని ధ్యానిస్తూ, పంచామృతాలతో శాస్త్రోక్తంగా లఘున్యాస, మహాన్యాస పూర్వకంగా రుద్రాభిషేకం చేస్తారు. దీనికీ మహా శివరాత్రి అని పేరు. ఇది శివునకు సంబంధించిన రాత్రి
సమయంలో చేయవలసిన ధార్మిక భక్తి సరళిగలది. చతుర్దశి శివునకు ప్రీతి పాత్రమైనది.
మహాశివరాత్రి వ్రతము, ఉపవాసము, జాగరణ, శివనామ స్మరణ అనే నాల్గు అంశాలతో కూడి ఉంటుంది. శివరాత్రి రోజున ఉపవాసం పాటిస్తూ శివనామ స్మరణ గావిస్తూ ఏకదశ రుద్రాభిషేకం, అంట్ నమక, చమకాలు పూర్తయ్యేదాక జపించి శివలింగముపై బిల్వ దళాలను పెట్టి అభిషేకం చేయాలి. నమకచమకాలతో శివాభిషేకం చేస్తే అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది.
నమకంలో పదకొండు అనువాకాలు ఉంటాయి. నమకాన్ని ఒకసారి పూర్తిగా జపించాక, చమకంలోని ఒక అనువాకాన్ని జపించాలి. మొదటి అనువాకములో శివుడు ప్రళయ రౌద్రరూపాన్ని రెండవ అనువాకం నుంచి తొమ్మిదవ అనువాకము వరకు శివుడే సృష్టి అంతా నిండి ఉన్నాడని, వది, పదకొండు అనువాకములలో 'అభయం' ప్రసాదించమని వేడుకోవడం జరుగుతుంది. పదకొండు ఏకాదశ రుద్రాలు చేస్తే ఒక 'లఘురుద్రం' అవుతుంది. పదకొండు లఘురుద్రాలు చేస్తే ఒక 'మహారుద్రం' అవుతుంది. ఇలా వీలును బట్టి ఋత్వికులచే ఉషః కాలం వరకు రుద్రాభిషేకం చేస్తూ మారేడు, బిల్వ పత్రాలు శివలింగంపై ఉంచడం వల్ల జన్మాంతర పాపాలు నశించి, విశిష్టమైన పుణ్యం సంప్రాప్తిస్తుంది.
మానవుడు తన జీవితకాలంలో కనీసం ఒక్క శివరాత్రినాడైనా ఇంద్రియ నిగ్రహము చేసి, ఉపవాస దీక్షతో, శివతత్త్వమును నెరుగుటకై రాత్రి జాగరణ చేస్తే శివుడు కరుణించి జాగరణకు సిరిసంపదలనిస్తాడని ప్రతీతి. చతుర్దశి నాటి రాత్రి లింగోద్భవ కాలంలో లింగ దర్శనం కానప్పుడు ఒక్క మారేడు, లేదా బిల్వదళం చేత పట్టుకుంటే చాలట ఆ ఫలితం దక్కుతుంది. శివరాత్రిన జాగరణ చేయలేనివారికి లింగోద్భవ కాలంలో 'ఓం నమశ్శివాయ' పంచాక్షరీ మంత్రాన్ని స్మరించిన సర్వపాపహరమగును.
మహాశివరాత్రి పర్వదినాన పరమేశ్వరున్ని స్మరిస్తూ, సుఖ, శాంతులతో, సౌభాగ్య, భోగాలతో సర్వులూ సుఖజీవనము నొందురుగాక! ఓం నమశ్శివాయః
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి