శివశక్తి...అర్థనారీశ్వర తత్వం..!: - కవి రత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
శ్లోకం:
చాంపేయ గౌరార్ధ శరీరకాయై
కర్పూర గౌరార్ధ శరీరకాయ |
ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః 
శివాయై చ నమః శివాయ ||

శివుడు సగము...శక్తి సగము -
మేఘమున మెరుపు దాగియున్నట్లు...

జడలు కొన్ని...ముడులు కొన్ని -
నదిలో అలలు సుడులు తిరిగినట్లు...

నొసట కన్ను...నొసట తిలకము -
నిప్పులో వెన్నెల కాంతి కలిసినట్లు...

గరళమొకటి...అమృతమొకటి - 
సముద్రమున విషము సుధ పుట్టినట్లు...

పులితోలు ఒకటి...పట్టుచీర ఒకటి - 
బండరాయిపై పూలతీగ పాకినట్లు...

రుద్రాక్ష హారము...ముత్యాల హారము - 
మట్టిలో మాణిక్యము మెరిసినట్లు...

శ్మశానవాసము...కైలాసవాసము -
చీకటిలో వెలుగురేఖ ఉదయించినట్లు...

యోగము ఒకటి...భోగము ఒకటి - 
కాయలో తీపి పండినట్లు...

పురుష రూపము...ప్రకృతి రూపము - 
బీజమున వృక్షము దాగియున్నట్లు...

అద్వైతమూర్తి అర్ధనారీశ్వరుడు - 
ఆత్మలో పరమాత్మ లీనమైనట్లు...

భక్తులను బ్రోచే ఓ బోళా శంకరా...
సకల శుభములనొసగే ఓ సదాశివా... 
మీ నామం పరమ పావనం... 
మీ రూపం మాకు కార్తీకదీపం...
మీ చరణమే మాకు శరణము....
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ...
ఓం శంభో శంకర హర హర మహాదేవ...

శ్లోకం:
ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయై 
సమస్త సంహారక తాండవాయ |
జగజ్జనన్యై జగదేకపిత్రే నమః 
శివాయై చ నమః శివాయ ||

(అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు)



కామెంట్‌లు