నా "తెలుగు"...
నాకు వెలుగు
జాతికి ఆరనిజ్యోతి
జగతికి రవికిరణం..!
నా "తెలుగు జాతి"...
ప్రేమకు ప్రతిరూపం..!
నా "తెలుగు నేల"...
అల్లూరి ఆవేశానికి అగ్నిజ్వాల...
పల్నాటి పౌరుషానికి ప్రతిబింబం..!
నా "తెలుగు భాష"...
తేనెలూరే తియ్యని భాష
అది 56 అక్షరాల క్షీరధార..
గలగలపారే గంగా గోదావరి క్రిష్ణా
కావేరి తుంగభద్ర సజీవ నదుల జలధార..!
నా "తెలుగు భాషా వైభవం"...
కవిత్రయ కవికోకిలల
భారత భాగవత రామాయణ
బృహత్ గ్రంధాల సుగంధ సౌరభం...
అన్నమయ్య క్షేత్రయ్య
రామదాసు కీర్తనల ప్రణవ నాదం...
శ్రీనాధ విశ్వనాథ పోతన
వేమన గిడుగు గుర్రం జాషువా
గురజాడ శ్రీ శ్రీ పద్యాల సింహ గర్జన..!
నా "తెలుగు తల్లి" ఒడి...
నా తెలుగు జాతికి బడి గుడి...
అది మన ఆత్మగౌరవ ఆశల పల్లకి
మన మాతృభాష కేవలం భాష కాదు
అది మన శ్వాస మన స్వాభిమానం..!
అందుకే..
ఏ దేశమేగినా ఎందు కాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా
పొగడరా పొగడరా
నీ "తెలుగుతల్లి" భారతిని ...
నిలపరా నిలుపరా
నీ "తెలుగుజాతి" నిండుగౌరవం...
అంటూ ముక్త కంఠంతో
తెలుగుజాతి నినదించాలి
ఆంగ్లభాషా ఐసీయూలో ఉన్న
మన మాతృభాషను పరిరక్షించుకోవాలి
జై తెలుగు...జయహో జయహో తెలుగు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి