సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల భోగోజు సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 సామెత -153: ఆడివిల్ల పెళ్లి అడుగు దొరకని బాయి అంతం చూసేవే
****
ఏమో అవ్వా! ఉన్నొక్క ఆడివిల్లకు మంచి లగ్గం జెయ్యాలని మీ మర్ది ఎ న్ని సంబందాలు జూషిండో తెల్సుగద!"
"అవును శెల్లె! కాళ్ళకి శెప్పులర్గితేంది మాంచి ఉన్న సంవందమే పట్కొచ్చిండు గద.ఊల్లె అందరూ ఒక్క తీర్గ అనుడు గాదు.అరికిశను మామూలోడు గాదె. తాహతుకు మించి దెచ్చిండన్నరు.'' గది మామూలు యిష్యం గాదె శెల్లే"
 "అవునుగని అవ్వా! పెద్దోళ్ళు ఊకెనే అన్లే. "కయ్యానికైనా,వియ్యానికైన సమ ఉజ్జీ కావాలనీ".
ఏమైంది శెల్లే?"
 గట్లనే మొదట్ల మస్తు సంబురపడ్డం"
గా తర్వాత గాల్ల కోర్కెల శిట్టా యిన్నంక మూర్శబోయినంత పనైందన్కో. "
 "అవునా శెల్లె! ఏమైందేమైంది!"
"గాల్ల అంతెత్తుకు దగ్గట్లు బంగారం నగలు బెట్టాలె. గయ్యి సుత ఎన్కటి తరీకయి గాదు.గిప్పటి పిలగాండ్లు గాదే అవ్వా! బంగారు దుకణపోల్ల దగ్గర ఆడివిల్లల బొమ్మలు గాల్ల సుట్టు జేర్న అమ్మలక్కలు జిగేల్ జిగేల్ మనే నగలు దిగేస్కోవడం,గా నడ్మల పొల్లకి అమ్మనో నాయిన్నో,అన్నో వచ్చి పల్పు తాడు లెక్క కుడుముక్కుడుమున్న నగొకటి బెట్టుడు.గజ్జూసి  అందరూ మస్తుందన్నదని మెచ్చుకోడం సూశి మేం సుత  గట్ల పెట్టాలంటే తప్పలే.ఎల్లి గస్మంటి నగ గొని అన్కున్నం మల్ల మల్ల  పెట్టబొయ్యి పెడ్తమా ఏంది?  అన్కుంట తుత్తి చెందినం.
  "అవునా శెల్లె! ఇంకేం గావాలె. పిల్ల లగ్గం అయితే అయ్యింది గద."
 "ఆఁ అయ్యిందవ్వా! ఇజ్జత్ కే సవాల్ గయ్యింది.‌మీ మర్ది ఏడ దిర్గిండో ఏమో గనీ పెండ్లి ఖర్సంత తడిసి మోపెడయ్యిందవ్వా!"
ఆస్సలీ దినాంల పెండ్లంటెనే   ఖర్సుతో కూడింది.అందునా ఆడవిల్ల పెళ్ళంటే అమ్మ నాయీనోళ్ళ పరిత్తితి ఎంత లాచారైద్దో శెప్పనక్కర్లలేదవ్వా!  లగ్గమైనంక వొచ్చిన పండైగలకీ మనొతికె సలిమిడి జేసి పంపుడు గాదంట. బిడ్డ పచ్ఛంగుండాలని పచ్చ పచ్చని బంగారొత్తువేదో బెట్టి బంపాల్నంటవ్వా?"
 వామ్మో! బాగనే ఉంది కత. అందుకే అంటరు శెల్లె "ఆడవిల్ల పెళ్లి అడుగు దొరకని బాయి  అంతం జూశేవే" అంటే ఏమో అన్కున్న గని గిప్పుడు నిన్ను సూశినంక తెలిసొచ్చింది.
 అడుగు దొరకని బాయి అంటేందవ్వా?"
ఒక్క సారి గా బాయిల ఏదైనా బడ్డదా ఇంగ దొర్కదు పో! గది తెచ్చుకోనీకి దిగినమా! అడుగున లోతెంతో తెల్వక అయోమయంల పడుడే".
 ఇంగ కొంతమందిరైతే నెత్తిన గుడ్డేస్కుని అప్పు దీర్సలేక ఇల్లాకిలి అమ్ముకున్నోళ్ళు సుత ఉండ్రు శెల్లె! గందుకని గస్మంటి తితి తెచ్చుకోక గిప్పన్నించి మీకు శాత గాంది పెడ్తనని అస్సలు మాటియ్యకుండ్రి."
 " మన బలీనత గని పొల్లని ఇంటికి బంపనని బెదిరిత్తరా కానియ్యమని శెప్పుండ్రి ఎక్కడున్నా సుఖంగుంటే సాల్గదా?  "నెమలి కంటికి నీర్గారితే ఏటగాడికి ముద్దాని" మీ బాద గాల్లకేం బడ్తది. గందుకే దైర్నంగ ఉండుండ్రి."
 "మర్ది అరికిశన్ కు సుత జెప్పు.పొల్ల సంసారం గురించి రంది పడొద్దు,ఫికర్ జెయ్యొద్దని శెప్పు.ఏదన్నుంటే నేను మాట్లాడ్త శెల్లె "
 "అనంగనే అవ్వా ! నీ కడ్పు సల్లగుండ నీ మాటల్కి ఎయ్యేన్గుల బలమొచ్చింది " వొర కట్నాలు బొయ్యిన గానీ ఇంగువ కట్టిన గుడ్డ లెక్క గిట్ల జేత్తనే ఉన్నయి.పొయ్యొత్తవ్వా!  మీ మర్దినో పాలి నీ కాడికి తోల్కొత్త అన్కుంట బోయింది నాంచారమ్మ."
 గదండీ సంగతి "ఆడివిల్లని కనాలె సద్వు సందె శెప్పించాలె. సమానంగా ఉజ్జోగం జేసినా అమ్మగారింట్లె నుంచి అన్నీ బరాబర్ లాగాలే. గదేందంటే ఆడవిల్లోల్లు గామాత్తరం పెట్టువోతలు బెట్టక వోతె ఎట్ల అంటరు. గిస్మంటి ఆశారాం కొంత బొయ్యింది ఇంకా బోవాలె. గప్పుడే గీ సామెత "ఆడపిల్ల పెళ్లి అడుగు దొరకని బాయి అంతం చూసేవే" అన్న భయం బోతుంది.

కామెంట్‌లు