ముక్కుల రాజకీయం (రాజకీయ వ్యంగం): - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
ముక్కోడు వచ్చాడు —
మాటలతో కాదు
ముక్కుతోనే హామీలవాసన చూపిస్తూ.

ముక్కోపి వచ్చాడు —
ఓటర్లు ప్రశ్నలు అడిగితే
ముక్కు ఎగిరేలా అరుస్తూ కరుస్తూ.

ముక్కుపచ్చలారనోడు వచ్చాడు —
పేదల కన్నీటివాసన పట్టని చిరునేతగా, 
తండ్రికి ప్రతినిధిగా వత్తాసు పలుకుతూ. 

ముక్కుతో మాట్లాడేవాడు వచ్చాడు —
నోరు తెరిస్తే నిజం జారిపోతుందనుకుని
నాసికతోనే నీతుల ఉపన్యాసం చేస్తూ.

కోటేరు ముక్కోడు వచ్చాడు —
ఐదేళ్ల పాలనను
ఐదు నిమిషాల కథలా చెప్పేస్తూ.

చీమిడి ముక్కోడు వచ్చాడు —
చీమంత తప్పుకే
దేశద్రోహం ముద్ర వేస్తూ.

ముక్కు మూసుకున్నవాడు వచ్చాడు —
అవినీతి దుర్వాసన తనదాకా రాకుండా
ముక్కుమీద వేలు వేసుకుంటూ.

ముక్కును మూసేవాడు వచ్చాడు —
ప్రజల ప్రశ్నలకు 
మౌనానికి మాస్క్ వేస్తూ.

ముక్కును పగలకొట్టేవాడు వచ్చాడు —
ఎదిరించిన ప్రతి ముక్కుపై
లాఠీల వర్షం కురిపిస్తూ.

ముక్కుకు ముక్కురాసేవాడు వచ్చాడు —
గౌరవాన్ని పథకాల పేరుతో
కాగితాలకే కట్టేస్తూ.

ముక్కును నేలపైరాసేవాడు వచ్చాడు -
పాత తప్పులకు క్షమాపణ కోరుతూ,
కొత్త నాటకానికి తెరతీస్తూ.

ఎన్నికల మేడపై
ముక్కులే నాయకులయ్యాయి,
మనుషుల అవసరాలు పాదాల కింద పడేసాయి.

చివరికి ప్రజలు అడిగారు —
“ముక్కు గెలిచింది…
కానీ మా ఊపిరి ఎప్పుడు గెలుస్తుంది? అని”


కామెంట్‌లు