సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!
 విరాట పర్వము చతుర్థాశ్వాసము- 187* వ రోజు*
అర్జునుడు యుద్ధానికి సిద్ధం అగుట
అర్జునుడు " ఉత్తరకుమారా! నీవు రధమును జమ్మిచెట్టుకు ప్రదక్షిణ చేయించి ముందుకు పొమ్ము ఇప్పటికే ఆలస్యం అయినది. పశువులు చాలా దూరం వెళ్ళి ఉంటాయి " అన్నాడు. ఉత్తరుడు రథం మరల్చగానే అర్జునుడు దేవదత్తం పూరించాడు. ఆ ధ్వని భూన భోనాంతరాలలో వ్యాపించింది. రథమునకు కట్టిన గుర్రాలు మూర్చిల్లాయి. అర్జునుడు గుర్రాలను నిమిరి వాటికి చైతన్యం కలిగించి " కుమారా! యుద్ధసమయంలో ఇది సహజం కలత చెందకు " అన్నాడు. ఉత్తరుడు " అర్జునా! యుద్ధ సమయంలో అనేక శంఖారావాల విన్నాను. కాని ఈ శభ్దానికి నా గుండెలు అవిసి పోయాయి, దిక్కులు తిరిగి పోయాయి, చెవులు బద్దలయ్యాయి నా మనసు నీరు కారింది. ఈ కపిధ్వజాన్ని చూస్తుంటేనే నా కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. నీ తేజము చూసి నేను వివశుడిని అయ్యాను " అన్నాడు.
భీష్ముడు వాదోపవాదాలను నివారించుట
అర్జునుడు నవ్వి మరలా శఖాన్నిపూరించాడు. ద్రోణుడు " సుయోధనా! ఆ ధ్వని విన్నావా. ఆ ధనుష్టంకారం గాండీవం కాదూ, వచ్చేది అర్జునుడు కాదూ, ఉజ్వలంగా ప్రకాశిస్తున్న ఆ కిరీటం అర్జునికి ఇంద్రుడు ప్రసాదించినది కదూ, సమరోత్సాహంతో అర్జునుడు కాక మరెవ్వరు. అతనిని ఎదుర్కోడానికి సన్నాహాలు చెయ్యండి " అంటూ కృపాచార్య అశ్వద్దామలను చూసి ముందు మనం రారాజు సుయోధనుని పంపుదాము. ఆ వెనుక గో సమూహాలను పంపుదాం. ఆ వెనుక మనం ఉంటాము. అర్జునుడు వచ్చిన అతనితో మనం యుద్ధం చేస్తాము " అన్నాడు. ఆ మాటలు విన్న సుయోధనుడు భీష్మ, కర్ణ, వికర్ణుల వంక చూసి నేను మీకు ఇదివరకే చెప్పాను. పాండవులు జూదంలో ఓడి పోయి పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాత వాసం ఒప్పందం చేసుకూన్నారు. ఇంకా ఆ సమయం పూర్తి కాకుండా పార్ధుడు భయట పడ్డాడు కనుక పాండవులు అరణ్య, అజ్ఞాత వాసములు చేయాలి. ఈ విషయం మనం మోహంతో కాని పాండవులు లోభంతో కాని గమనించ లేదు. తాత భీష్ముడే దానిని నిర్ణయించటానికి అర్హులు " అన్నాడు. " వచ్చునది ఉత్తర కుమారుడు కాకుండా గాండీవి అయితే మన పని సఫలం అయినట్లే. అసలు సుశర్మ దక్షిణ దిక్కుగా మనం ఉత్తర దిక్కుగా గోవులను పట్టుకోవడానికి వచ్చింది మత్స్యదేశంలో ఉన్న పాండవులను బయట పెట్టడానికే గదా. ఆ వచ్చిన వాడు అర్జునుడైతేనేమి దేవతలైతేనేమి మనం గోవులను పట్టుకున్నాం. వాటి కోసం యుద్ధం చేస్తాము కాని వెరువనేల కనుక ముందు మనమే యుద్ధం చేస్తాము. అయినా అర్జునుడు ఒక్కడే ఇంత పెద్ద కురు సైన్యాలతో ఎలా యుద్ధం చేస్తాడు. విన్న వారు నవ్వుతారని కూడా అనుకోకుండా శత్రువును నందుల వలె పొగడుట ఈ ద్రోణునికి తగునా. అయినా ఆచార్యుల వారు దూరంగా నిలిచి పర్యవేక్షిస్తుంటారు. భోజన సమయాలలో, విద్యగరిపే సమయాలలో, నీతిని భోదించే సమయాలలో గురువులను సంప్రదించాలి కాని యుద్ధ విషయాలు వారికేం తెలుస్తాయి అడగటానికి. అయినా వారు యుద్ధం చేయరు వెనుక ఉండి మన విజయం కాంక్షిస్తుంటారు " అన్నాడు సుయోధనుడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు