"కవితల దేశం": - - యామిజాల జగదీశ్
 జపాన్ని కవితల దేశంగా సాహితీకారులు చెప్తుంటారు. అక్కడ బోలెడు మంది కవులుండేవారు. ఉన్నారుకూడా. జపాన్ కవితలను వివిధ భాషలలో అనువదించిన వారున్నారు. హైకూ కవితకు పెట్టిన పేరు జపాన్. అయితే కీ.శే. నా. ముత్తుకుమార్ కొన్ని ప్రేమకవితలను తమిళంలోకి అనువదించారు. నలభై ఎనిమిది పేజీల చిన్ని పుస్తకమిది. నలభై ఒక్క కవులు రాసిన కవితలను ముత్తుకుమారు తమిళంలో రాశారు. 2003 లో అచ్చయింది. ధర ఇరవై రూపాయలు. ప్రముఖ కవి అరివుమదికి ఈ పుస్తకాన్ని అంకితం చేశారు కృతికర్త. పేజీకి మూడు చొప్పున మొత్తం 99 కవితలున్న ఈ పుస్తకంలోంచి మచ్చుకి కొన్ని తెలుగులో రాశానిక్కడ.....
1
ఎవరికి తెలుసు?
నా హృదయపు లోతుల్లో
నా ప్రేమ
ఓ అగ్నిపక్షిగా 
పొదగబడి ఉండటం...
2
నిన్ను ప్రేమించని వ్యక్తిని
నువ్వు ఇష్టపడటమనేది
ఆలయానికి వెళ్ళి
సైతానుకి ఆరాధించడం లాంటిదే
3
అతనిని తలిచి
నిద్రపోయాను
అనంతరం వచ్చాడు
ఛ...
కలని తెలిసుంటే
మేల్కొనేదాన్ని కనసలు
4
సర్వం తెలిసినా
ఏదీ చెప్పదీ తలగడ
వసంతకాల రాత్రి 
మన కలను కొనియాడి
మాట్లాడుకుందాం
5
మన ప్రేమ
హరివిల్లులా
అందరి దృష్టికి వచ్చినా
నాకు దిగులు లేదు
నేను
నిన్ను పీల్చేస్తున్నాను
6
ఈ చెర్రీ చెట్టుకింద
నా ప్రేయసికోసం
పువ్వులు కోస్తుంటే
కింది కొమ్మల నుంచి
కారుతున్న మంచుబిందువులు
నా దేహాన్ని తడుపుతున్నాయి
7
నా వేణువు 
ఎల్లప్పుడూ ఏడుస్తోంది
సాధ్యమే
దాని శూన్యం నుంచి
నా భార్య ఆత్మ
ఏకాకిగా రావడం
8
నా చూపులిప్పుడు
మన మంచంమీది
నీ తలగడపైనే
తదేకంగా ఉన్నాయి...
9
తోటంతా
వదంతలు వ్యాపించాయి
నేనూ ఆమే
భుజాలు రాసుకుంటూ
నిద్రపోతున్నామని
10
నిన్ను కలగని
నడుస్తుంటే
నా అడుగులకెలాంటి
అలుపూ లేదు
కానీ 
ఈ బహుదూర ప్రేమను
నీ చిన్ని చూపే
పూరించగలదు
11
కలలోసైతం
నా ప్రేమ అతనికి 
తెలియడం నాకిష్టం లేదు
ఉదయం 
అద్దంలో చూసుకుంటే
నా ముఖం సిగ్గుతో 
ఎరుపెక్కి కనిపిస్తోంది
12
అవును
నేను ప్రేమిస్తున్నాను
వాళ్ళు
నా గురించి మాట్లాడుతున్నారు
ఇవన్నీ పట్టించుకోకుండానే
నేను ప్రేమలో పడ్డాను


కామెంట్‌లు