అలసిపోయిన అమ్మానాన్నలు...!: - కవి రత్న,-సాహిత్య ధీర,-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి, హైదరాబాద్.
సమాజహితం కోరే కవి...
అలసిపోయాడు...
కులమతాలకతీతమైన
నవసమాజ నిర్మాణం కోసం
కమ్మని కావ్యాలెన్నో "రాసి రాసి" ...

చుట్టూ ఉన్న లోకం మాత్రం...
కుంభకర్ణుడిలా గాఢ నిద్రలోనే ఉంది.
ఔను నేడు కవికలం...
జేగంటలు మ్రోగిస్తోంది
సమాజాన్ని మేల్కొల్పేందుకు...

వంటగదిలో అమ్మ...
కొవ్వొత్తిలా కరిగి కరిగి
వెట్టిచాకిరి "చేసి చేసి" అలసిపోయింది.

అమ్మ కమ్మనికలలు కంటోంది తన
పిల్లలు ఉన్నతశిఖరాలను చేరుకోవాలని
ఔను అమ్మత్యాగం అద్దంలా
ముక్కలౌతోంది విముక్తిలేని వెట్టిచాకిరిలో..

కుటుంబ భారంమోసే నాన్న... 
గానుగెద్దులా 
బాధ్యతల సుడిగుండంలో 
తిరుగుతూ అలసిపోయాడు...

అప్పుల ఊబి...
సాలీడు వలలా చుట్టుకోగా
మానసికంగా కుమిలిపోతూ
నిశ్శబ్దంగా రోదిస్తున్నాడు.
ఔను నాన్న బతుకు 
నిప్పుల నావలా 
మారింది - అప్పుల భారంతో...

విద్యార్థులు, వలలో చిక్కిన చేపల్లా 
స్మార్ట్‌ఫోన్ మాయలో పడి
ప్రాణవాయువంటిచదువును
వదిలేసి అలసిపోయారు.

వారి బంగారు భవిష్యత్తు...
పగిలిన అద్దంలా ముక్కలై ఆ డిజిటల్ 
భూతానికే అంకితమైపోతోంది.
ఔను ఆ యువత ఆశలు నీటిబుడగల్లా తేలిపోతున్నాయి -సెల్ ఫోన్ మాయలో...

ప్రేయసి, వాడిపోయిన మల్లెపువ్వులా 
ప్రియుడి రాకకోసం కన్నులు కాయలు 
కాచేలా "చూసి చూసి" అలసిపోయింది.

ఆమె నిత్యనిరీక్షణ...
ఎండిన చెరువులా వెలవెలబోతూ 
మూడుముళ్ళ బంధంకోసం తపిస్తోంది.
ఔను ఆమె ప్రేమగాథ...
విధిచేతిలో చిక్కి విలవిలలాడుతోంది...

ముదిరిన బెండకాయ
కూరకు కొరగాదంటూ
ముళ్ళకంచెలా గుచ్చుకునే
కాకులైన లోకుల మాటలకూ
అమ్మా నాన్నలు అలసిపోయారు.

బిడ్డల పెళ్లి నిరీక్షణ...
తీరం చేరని నావలా
ఆ దైవం పైనే భారం మోపి
నిద్రాహారాలు మాని ఎదురుచూస్తున్నారు
ఔను ఆ తల్లిదండ్రుల ఆశ దీపశిఖలా 
వెలుగుతోంది - పెళ్లి సంబంధాల వేటలో...




కామెంట్‌లు