సామెతల ఊట -సునందమ్మ నోట: - వురిమళ్ల భోగోజు సునందా ఉపేందర్ రావు

 సామెత-146; అన్నయిన తర్వాత అగ్గి వైద్యం"
*****
"అవ్వా!   వొదలకుండ పడిశం బట్టిందంట,ఖళ్ళు,ఖళ్ళు మనుకుంట ముసలోళ్ళు దగ్గినట్టు ఒకటే దగ్గుడు. అసలే సంటి పోరడాయె బరెంక బొక్కలు నొత్తున్నయని గీ గీ అన్కుంట ఏడిశినోడు ఏడిశినట్టే ఉండేటోడు. శానా మంది పిల్లగాండ్ల డాకటర్ల తానకి  తోల్కొని బోయిండ్రంట. ఏలకేలు ఖర్సయిందంట. మందు టానీకులు.ఇండీషన్లు ఆడుతుండ్రంట". 
"ఇంతకీ ఎవలి గురించి శెల్లే! గా జాన్కమ్మక్క మన్వడి గురించేనా నువ్వు శెప్పేది."
 "అవునవ్వా! గా పోరడు ఎంత అవత్త పడ్డడు. గా శిన్న పానం గట్ల గిలగిల్లాడుతుంటే సూల్లేకపోయిన."
 "అవును శెల్లె! గాడు సర్దిల, నీళ్ళ గాబు తాన పొద్దత్తమానం గా నీళ్ళల ఆడుతుంటే సూస్కుంట ఉండ్రుగని పొల్లగాడికి నెమ్ము జేత్తదన్న సోయే లేదాయె. గాడు తడ్పుకున్న బట్టలు గట్లనే ఒంటిమీద ఉంచుతరా ఎవలైన? గదేందంటే ఎంతకని ఇడ్వాలె,తొడగాలె అనబట్టిరి. గిప్పుడు సూడు పొల్లగాని పానం మీదకొచ్చె. "గోటితో బొయ్యే దాన్ని గొడ్డలి దనుక" తెచ్చిండ్రు. ముందే శద్ద జేత్తే గింత దనుక వొచ్చేది గాదు. ఇంగ నయ్యం తీ పోరడు ఒడ్డున బడ్డడు."
 "అవునవ్వా! నేను సుత శానా సార్లు సూశి చెప్పిన.శెవిన బెట్టలే.గాడు మంచిగ నీళ్ళల్ల ఆడుకుంటుంటే నీకేం నొప్పి అన్నట్టు మాట్టాడిండ్రు. నాకెందుకొచ్చిన గోల అన్కొని ఊకున్నవ్వా!"
 "డాకటరు వాళ్ళని శెడామడా తిట్టిండంట. పిలగాన్ని ఆగం జేస్కోబాకుండ్రి ఇచ్చిన మందులు సరింగ ఆడుండ్రి అని శెప్పిండంట."
"అవునటవ్వా! గిప్పటికి సుత గాళ్ళల్ల మార్పు రాలే.  గా మందులన్ని ఆడనైతె ఆడిండ్రు గని ఎవలో శెప్పిండ్రంట పొల్లగానికి బొడ్డు సుట్టు బుజాల మీద అగ్గి సురకలేత్తే ఎప్పుడో తగ్గిపొయ్యేది. మళ్ల మళ్ల రాకుండ ఎయ్యుండ్రని శెప్పిండ్రంట అవ్వా!"
 "అయ్యో! ఏశిండ్రా ఏంది?"
"అవునవ్వా!"నిన్నెవలో ఎన్కటామెను తోల్కొచ్చి సూది గాల్చి బొడ్డు సుట్టు బుజాల మీద అగ్గి సురకలు ఏయించిండ్రు. గాడికి గిప్పుడు గిప్పుడే నెమ్ము,దగ్గు తగ్గు మొకం బట్టి పిలగాడు కొంచెం తేజుగైతుండు అంటే మల్ల గివేయించిండ్రవ్వా! పిలగాడు గా అగ్గి  వాతలకి కిందుమీదు జేసిండంట. మళ్ల డాకటరు తానకి తోల్కొని బోయిండ్రంట."
 గాల్లు మడుసులేనా? శెల్లె "అన్నయిన తర్వాత అగ్గి వైద్యం" అన్కుంట జేయించి పొల్లగాడి పానం మీదకి తెచ్చిండ్రా! అయ్యో! గా సంటోడు ఎట్ల తట్టుకుంటడు."
 ఎన్కట తెల్వనితనం వైజ్గం అందబాట్ల లేకపోవుడుతో జొరం గిరం వొత్తె అగ్గి వైజ్గంతో పోతుందని గట్ల సూది గాల్చి సురుకులు ఏశేటోళ్ళు. గిప్పుడు అన్ని అందుబాట్ల కొచ్చినంక గస్మంటి మోటు వైజ్గం ఎవలన్న జేత్తరా? మూర్ఖత్తం గాకపోతే! అన్ని మందుల మీద ఎట్లయిన తగ్గుద్ది.గని గీళ్ళు శివరాకరికి సేశిన అగ్గి వైజ్గంతోనే తగ్గుద్దని నమ్మకం బెట్కొని గిట్ల శేత్తుండ్రు.కొంచమైన ఇశారం జెయ్యొద్దా?"
ఆళ్ళు గీపాటికి వొచ్చినాలె అవ్వా! పొయ్యి సూశొత్త."
 "నేను సుత సూడ్డానికి వత్త పా శెల్లె! గాళ్ళని నాలుగు దులిపొత్త పా!"
ఇద్దరూ జాన్కమ్మ ఇంటికి బయలు దేరిండ్రు.
గదండీ సంగతి! "అన్నయిన తర్వాత అగ్గి వైద్యం" అని ఇంకా పల్లె,పట్నాలని తేడా లేకుండా కొంతమంది మూర్ఖంగా గిస్మంటి సురకలు,వాతల అగ్గి వైద్యం జేయిస్తనే ఉండ్రు.
కామెంట్‌లు