ఆహా…
ఇంద్రధనుస్సు
నేలపైకి దిగివచ్చినట్టు
ఈ పిట్ట పరవళ్ళుతొక్కే
రంగుల జలపాతంలా ఉంది
ప్రకృతి కట్టిన చిలకపచ్చ చీరపై
దైవం గీసిన చిత్రంలా ఉంది
దాని రెక్కలు వెలుగే వర్ణచిత్రాల విందు.
పుష్పాల మధ్య పొదిగిన రత్నంలా
దాని చూపు ఉదయ తారక వెలుగు.
కానీ…బంగారుగిన్నె
ఖాళీగా మోగినట్టు
దాని చిన్నిపొట్ట ఆకలితో నకనకలాడుతుంది.
సూర్యుడు ఉదయం
వెలిగిన దీపంలా
తూర్పున తొంగిచూస్తే
పాపం పిట్ట తిండి కోసం
ఆకలి వేట ప్రారంభించింది
గింజల కోసం గాలిలో గాలిపటంలా
నింగిలో ఎగిరి ఎగిరి తిరిగి తిరిగి
చివరికి అలసిన యాత్రికునిలా
కొమ్మపై కూర్చుంది
ఆకలితీర్చే అన్నదాతల కోసం
పాలకోసం పసిబిడ్డ తల్లివైపు
చూసినట్టు ఎదురు చూస్తోంది
అందుకే ఓ మానవా…
నీ పిడికెడు బియ్యం
చంద్రకిరణంలా జారితే
పది పిట్టల పొట్టలు
పండుగ దీపాల్లా వెలుగుతాయి.
పిల్లికి బిక్షం పెట్టని
పిసినారి హృదయం
కరగని కురవని నీలిమేఘమే...
కోట్లున్నా దానధర్మం లేని జీవితం
పువ్వులేని వసంతంలా నిర్జీవమే...
పశుపక్ష్యాదులను
ఆదరించే మనసు గంగలా పవిత్రం
గోవింద నామంలా పరమ పావనం
నేడు ఇష్టంతో ఇచ్చిన గింజ
రేపు విత్తనమై వృక్షంలా ఫలిస్తుంది
కరుణను విత్తిన చేయి కల్పవృక్షంలా
రేపు వరాల వర్షం కురిపిస్తుంది
అందుకే రండి…
మన గడప ముందర గింజలు చల్లి
మన ఎదలో దయాదీపం వెలిగిద్దాం
పిట్టల పొట్టలు నింపిన ప్రతి క్షణం
ఆ పరమాత్మ పాదారవిందాలకు
సమర్పించిన పుష్పంలా పుణ్యఫలం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి