సంపూర్ణ మహాభారతము*సరళ వ్యావహారిక భాషలో...!
 వన పర్వము షష్టమాశ్వాసము- 141 వ రోజు
ఇలా ఉండగా అయోధ్యలో నారాయణుడు ఆదిశేషునితో సహా అన్నదమ్ములుగా దశరధ మహారాజుకు జన్మించాడు. వారు పెరిగి పెద్దవారై వేద వేదాంగాలు చదువు కున్నారు. విలు విద్యలో నిష్ణాతులైయ్యారు. దశరధుడు వారికి వివాహాలు జరిపించాడు. శ్రీరాముని యౌవరాజ్య పట్టాభిషిక్తుని చేయాలని నిశ్చయించాడు. మంత్రులను పౌరులను సంప్రదించి ముహూర్తం నిశ్చయించాడు. ఆ సమయంలో మంధర కైకేయి వద్దకు పోయి " అమ్మా! నీ భర్త నీ పై ప్రేమ చూపించి నట్లు చూపించి నిన్ను మోసం చేసాడు. అతనికి కౌశల్య మీదనే ప్రేమ అందుకే ఆమె కుమారుడైన రామునికి పట్టాభిషేకం చేస్తున్నాడు. ఇక నీవు నీ కుమారుడు వారికి దాస్యం చేస్తూ బ్రతకండి " అన్నది. ఆమె మాటల ప్రభావానికి లొంగి పోయిన కైక దశరధునితో " ఇది వరలో మీరు నాకు మూడు వరాలు ఇస్తానని మాటిచ్చారు కదా. అవి ఇప్పుడు ఇవ్వండి " అని కోరింది. అందుకు అంగీకరించిన దశరధునితో " నా కుమారుడైన భరతునికి పట్టాభిషేకం చేసి శ్రీరాముని పదునాలుగేండ్లు అరణ్యాలకు పంపమని కోరిది " ఆ మాటలు విని దశరధుడు దినమైనా రాముని వదలలేనని చెప్పి స్పృహతప్పి పడిపోయాడు. కైకేయి వరాలు తండ్రి ఆవేదన గ్రహించిన రాముడు తండ్రి మాట నిలబెట్టడానికి అరణ్యాలకు పయన మయ్యాడు. రామునితో లక్ష్మణుడు, రాముని భార్య సీత అరణ్యాలకు పయనమయ్యాడు. స్పృహ నుండి తేరుకున్న దశరధుడు కుమారుడైన రాముడు లక్ష్మణుడు, సీతను వెంట పెట్టుకుని అడవులకు వెళ్ళటం సహించలేక మరణించాడు. కైకేయి భరతుని పిలిపించి " కుమారా! మీ తండ్రి దశరధుడు మరణించాడు. నీ అన్నలు వనవాసం వెళ్ళారు. ఈ రాజ్యానికి వారసుడివి నువ్వే కనుక రాజ్యభారాన్ని వహించు " అని చెప్పింది. భరతుడు " అమ్మా! నీవు మా సూర్యవంశానికి మచ్చ తెచ్చావు. కోరరాని కోరిక కోరి నా తండ్రి మరణానికి కారకురాలివైయ్యావు. నా అన్న రాముని, లక్ష్మనుని, వదిన సీతమ్మను అరణ్యాలకు పంపావు. నీ పాపాలకు అంతు లేదా " అని నిందించాడు.
పాదుకాపట్టాభిషేకం
భరతుడు తరువాత తండ్రికి అంత్య క్రియలు జరిపాడు. మంత్రులు, సామంతులు, ముగ్గురు తల్లులు, తమ్ముడు శత్రుజ్ఞుడితోను సకల పరివారంతో చిత్రకూటంలో ఉన్న రాముని దగ్గరకు వెళ్ళాడు. జటా వల్కములను, నార చీరలు ధరించిన రాముని చూసి ఆవేదనకు గురి అయ్యాడు. భరతుడు రామునితో " అన్నా! మన తండ్రి మరణించాడు. నీవే మాకు దిక్కు నీవు అయోధ్యకు వచ్చి పట్టాభిషేక్తుడవై మమ్మల్ని పాలించు " అని ప్రార్థించాడు. కాని రాముడు అంగీకరించక తన పాదుకలను మాత్రం ఇచ్చి భరతుని తిరిగి పంపాడు. భరతుడు రామపాదుకలను సింహాసనం మీద ఉంచి పట్టాభిషేకం జరిపించి నందిగ్రామంలో రాజప్రతినిధిగా మాత్రం రాజ్య పాలన చేస్తూ రామునిలా మునివృత్తిని అవలంభించాడు. తరువాత రాముడు శరభంగ ఆశ్రమానికి వెళ్ళాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు