మారని మనిషి ఆరని ధనదాహం..!: కవి రత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్, హైదరాబాద్
భాగం – 1 :
"ఎన్నికల ఎర”

ఈ కరెన్సీ కట్టలే కదా
చిట్టిపొట్టను నింపే
ఆపదలో ప్రాణాలు కాపాడే
ఆక్సిజన్ సిలిండర్‌లు…

ఈ ధనంతోనే కదా
ఎన్నికల్లో నాయకులు
ఓట్ల పంట కోసం
కోట్ల పెట్టుబడి పెట్టేది?
ఎన్నికల పొలంలో
విత్తనాల్లా చల్లేది...

మత్స్యకారుల్లా
అమాయకపు ఓట్ల
చేపలకు ఎర వేసేది...
బంగారు నగలిచ్చేది...
పట్టుచీరలు పంచేది...
ఆశల గాలం విసిరేది...

ఈ ధనమే కదా
నీ అధికారానికి
నీ అహంకారానికి
నీ అవినీతికి
నీ దాతృత్వానికి
నీ దైవత్వపు...
విగ్రహానికి పెట్టిన కిరీటం...

భాగం – 2 :
ధనం “మత్తులో మాయలో”

ఈ ధనం కోసమే కదా
వర్షం కోసం
ఎదురు చూసే రైతులా...
వసంతం కోసం
ఎదురు చూసే వనంలా...
నీవు పడిగాపులు కాసేది...

ఈ ధనమే కదా...
నిత్యం నీ వెంట నీడలా
తిరిగి నిన్ను ముద్దాడి
మురిపించే మాయలేడి...?

ఈ ధనమే కదా...
నీ కరెన్సీకట్టల సింహాసనం...
నీ తలపై కిక్కి తైతక్కలాడి
నిన్ను కోటీశ్వరున్ని చేసేది
కొండలపై కూర్చోబెట్టే కొలిచేది...

ఈ ధనమే కదా...
“నాది నాది” అనిపించి
ఎడారిలో ఎండమావిలా
నిన్ను మోసం చేసి నీవు
కన్నుమూసి కాటికెళ్లగానే
చేతిలోని ఇసుక రేణువులా
చేజారి మాయమై పోయేది...

ఈ ధనమే కదా...
గాలిపటంలా నీవు
విచ్చలవిడిగా తిరిగేవేళ
విలాసాలకు మరిగి విర్రవీగేవేళ
మంచుతుఫానులా ముంచెత్తేది
నిన్నొక దుష్టునిగా భ్రష్టునిగా ముద్రవేసేది..

భాగం...3
మారని మనిషి...ఆరని ధనదాహం..!

ఈ ధనమే కదా...
నిన్ను అప్పుల నిప్పుల్లో
కాల్చే అందమైన అగ్గిపుల్ల
నీ సద్గుణాన్ని దుర్గుణంగా మార్చే
పాలలో పడిన విషపు చుక్క…
నీవు దోచుకొని స్విస్ బ్యాంకుల్లో
మంచుకొండల్లో దాచిన రహస్యనిధి...

ఈ ధనమే కదా...
భూగోళం పట్టనంతగా ఆర్జించినా
వర్షంలో తడిసిన దీపంలా…
నీ ఆరోగ్యాన్ని కొనలేనిది...
నీ కిష్టమైన బిడ్డను కనలేనిది...

ఈ ధనమే కదా
మనిషిని మనీషిగా
దానవున్ని మాధవునిగా మార్చి
నిన్ను పరలోకానికి చేర్చే మంత్రశక్తి...

ఈ ధనమే కదా
నీ పతనానికి తొలిఅడుగు
నీ దుష్ట సంస్కృతికి విత్తనం
నీ దుఃఖానికి దూరపు బంధువు...

ఈ ధనమే కదా...
నీకు ఖండాంతర ఖ్యాతిని తెచ్చేది
నిన్ను ఆరని అఖండజ్యోతిగా నిలిపేది.



కామెంట్‌లు