'కాంప్లెక్స్ హెచ్ఎం సునీతకు ఘన సన్మానం'

 శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామపంచాయతీలోని ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శ్రీరాంపూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు నరెడ్ల సునీతను పాఠశాల హెచ్ఎం ఈర్ల సమ్మయ్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు  ఘనంగా సన్మానించారు. విధి నిర్వహణలో భాగంగా పాఠశాల సందర్శన, తరగతుల పరిశీలన నిమిత్తం గురువారం ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన ఆమెను అక్కడి ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు శాలువాగప్పి ఘన సన్మానం చేశారు. ఈ నెలాకరున కాంప్లెక్స్ హెచ్ఎం సునీత పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలుగా ప్రమోషన్ పై శ్రీరాంపూర్ జడ్పీ హైస్కూల్ కు వచ్చిన నరెడ్ల సునీత రెండున్నరేళ్ల కాలంలో  పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు. సౌమ్యులు, మృదుభాషి అయిన ఆమె అనతి కాలంలోనే అందరి మన్ననలు పొందారని ఆయన అన్నారు. పదవీ విరమణ అనంతరం ఆమె పేద పిల్లల విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేయాలని కోరారు. విద్యారంగంలో విశేష సేవలు అందించిన హెచ్ఎం సునీత భావి జీవితం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని  ఈర్ల సమ్మయ్య ఆకాంక్షించారు. ఆమెకు పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఊషన్నపల్లి పాఠశాల, ఉపాధ్యాయులతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. దీనికంటే ముందు హెచ్ఎం ఈర్ల సమ్మయ్య మూడవ తరగతి తెలుగు పాఠం బోధిస్తుండగా, అతని బోధనా తీరుతిన్నులను పరిశీలించి నమోదు చేసుకున్నారు. పిల్లల సాధన పుస్తకాలను పరిశీలించారు. బాగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలని హెచ్ఎం పిల్లలకు సూచించారు. పాఠశాలను చక్కగా నడుపుతూ, పిల్లల్ని అన్ని అంశాల్లో ఉన్నతంగా, అద్భుతంగా తీర్చిదిద్దుతున్న ఊషన్నపల్లి పాఠశాల ఉపాధ్యాయులను ఆమె అభినందించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్, ఎడ్ల స్రవంతి, సుప్రియ, సిఆర్పి కుంట కుమారస్వామి,  పిల్లలు, పైడిపల్లి సతీష్, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు