" కాలం రంగులపై కవితా సాక్ష్యం..!": - ఎస్. అమ్మూ బమ్మిడి,-మహిళా పోలీస్

 పుస్తకం : వర్ణం (కవిత్వం)
రచయిత: గణేష్ బోణం

తెలుగు ఆధునిక కవిత్వంలో సమాజ స్పందనకు అద్దం పట్టే రచనలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి అరుదైన ప్రయత్నాలలో ‘వర్ణం’ ఒకటి. జర్నలిస్టుగా సమాజాన్ని నిత్యం గమనించే గణేష్ బోణం గారు.. ఆ అనుభవాలను కవిత్వంగా మలిచి ఈ సంకలనాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. ఇది కేవలం భావోద్వేగాల వ్యక్తీకరణ మాత్రమే కాదు, ఒక కాలానికి చెందిన సామాజిక అంశాలతో కలానికి అద్దిన రంగులు. 
‘వర్ణం’ అనే శీర్షికే ఈ పుస్తక ఆత్మను తెలియజేస్తుంది. జీవితం ఒక్క రంగులో ఉండదు. ప్రేమ, పోరాటం, ఆశ, నిరాశ, రాజకీయం, చైతన్యం, మానవీయత, బాధ్యత, మోసం, కష్టం, దుఃఖం.. ఈ అన్ని రంగుల సమ్మేళనమే ఈ కవితా సంకలనం..!
* సమాజం మధ్యలో నిలబడి మాట్లాడే కవిత్వం:
ఈ సంకలనంలోని కవితలు వ్యక్తిగత అనుభూతులకు, అనుభవాలకే పరిమితం కావు. రచయిత చూపు నిరంతరం సమాజం వైపే నిలుస్తుంది. ప్రజాస్వామ్యం, ఓటు విలువ, బాధ్యతాయుత పౌరుడి పాత్ర వంటి అంశాలు కవిత్వంగా మారతాయి. ఒక కవితలో ఆయన ఇలా అంటారు...
“ఒక్క ఓటు ఏమి చేస్తుంది అనుకోవద్దు.
ఆ ఒక్క ఓటుతో ఏమి కాదు అని వదిలేయొద్దు…”!
ఈ రెండు లైన్స్.. ఏవో నినాదంగా కాదు, పౌరుడిని ఆలోచనలోకి నెట్టే ప్రశ్నలు. నేటి రాజకీయాలకు కేంద్ర బిందువులా నిలిచే అంశాలు.
* వ్యక్తిగతం నుంచి మానవీయత వరకు:
*‘వర్ణం’*లో ప్రేమ కవితలు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఇవి కేవలం వ్యక్తికి వ్యక్తికీ మధ్య ప్రేమకే పరిమితం కావు. అవి విశ్వ వ్యాప్తంగా విస్తరించి మానవీయ ప్రేమగా మారతాయి. ఓసారి ఈ రెండు లైన్స్ చూడండి...
“నా హృదయ లోతులో ప్రేమ..
ఒకరికి మాత్రమే కాదు..
అది అందరికీ చెందింది..!"
 ఇక్కడ ప్రేమ స్వార్థం కాదు. కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగే భావాన్వేషణ కాదు. అది సమాజంతో ఒకరికి ఒకరు ఇచ్చుకునే విలువగా మారుతుంది.
* స్పష్టమైన భాష, శైలి
ఈ పుస్తకంలో ప్రధాన బలం భాష. అలంకారాల భారమూ, క్లిష్టమైన ప్రతీకలూ లేకుండా, సూటిగా చెప్పే పదజాలం కనిపిస్తుంది. జర్నలిస్టు  పదును ఉన్నా, అది ఎక్కడా కవిత్వాన్ని దెబ్బతీయలేదు. మరింత ప్రభావవంతంగా చేసింది. 
ఒక కవితలో ఆయన అంతర్మథనాన్ని ఇలా వ్యక్తం చేశారు.
 “నేను మౌనంగా లేను...
నా మౌనం కూడా ఒక అరుపే”..!
ఈ రెండు వాక్యాలు ఆధునిక మనిషి లోపలి సంఘర్షణను చాలా స్పష్టంగా చూపిస్తాయి.
* సామాజిక బాధ్యత గా రాజకీయ చైతన్యం 
సామాజిక, రాజకీయ అంశాలపై రాసిన కవితలు ఈ సంకలనానికి మరింత బలాన్నిచ్చాయి. ఇవి నేరుగా ఉపన్యాసాలు ఇవ్వవు. అనుభూతుల రూపంలో ప్రశ్నిస్తాయి.? అవమానాల నీడల్లో ఎగసిపడతాయి. మచ్చుకు రెండు లైన్లు.
“ప్రజాస్వామ్యం పుస్తకాలలో కాదు..
ప్రజల చేతుల్లో ఉండాలి”..!
అవును కదా.. ఇలా కొన్ని కవితలు సామాజిక బాధ్యతను స్పష్టం చేస్తాయి. ఇవి చదువుతున్నప్పుడు పాఠకుడు ఆలోచనలో పడతాడు. అదే కదా మంచి కవిత్వ లక్షణం..!
వ్యవస్థలపై విమర్శ ఉన్నా..  ‘వర్ణం’ నిరాశలో ఆగదు. మార్పు సాధ్యమే అన్న నమ్మకం ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. మనిషిని బాధితుడిగా కాకుండా, బాధ్యత కలిగిన పౌరుడిగా రచయిత గణేష్ చూపించారు.
“చీకటి ఎంత గాఢమైనా
 ఒక దీపం వెలిగితే చాలు..”!
ఇలా ఆశ, నిరాశ ల వెలుగు నీడల్లో అయిపోని ఒక ఆలోచనా జ్యోతిని వెలిగించారు. 
‘వర్ణం’ ఒక సాధారణ కవితా సంకలనం మాత్రమే కాదు. ఇది కాలాన్ని నమోదు చేసిన ఒక సాహిత్య సాక్ష్యం. గణేష్ బోణం తన జర్నలిస్టు అనుభవాన్ని, కవిత్వం లక్ష్యాన్ని  సమన్వయపరిచి ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. 
సాహిత్యంలో కొత్త ప్రయోగాలకన్నా, సమాజాన్ని అర్థం చేసుకోవాలనుకునే పాఠకులకు ఈ పుస్తకం ఒక నేస్తం లాంటిది. ముఖ్యంగా యువత చదవదగ్గ కవితలు.  చదవాలి, ఆలోచించాలి, స్పందించాలి..!
‘వర్ణం’ రూపంలో.. ఆధునిక తెలుగు కవిత్వంలో ఒక నిజాయితీగల, బాధ్యతాయుతమైన ప్రయత్నం చేసిన మిత్రుడు, జర్నలిజం లో మా సీనియర్ అయిన గణేష్ బోణం గారికి అభినందనలు..!
-----
సమీక్ష : ఎస్. అమ్మూ  బమ్మిడి,-మహిళా పోలీస్
------
ప్రతులకు: 9553955798.
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
మొలక నిర్వాహకులకు ధన్యవాదాలు