సుప్రభాత కవిత : - బృంద
పాతాళంలో మొదలై 
భూమండలం గుండా సాగుతూ 
నభోవీధి వరకూ పయనించి
ఎక్కడమొదలయ్యావో
ఎక్కడ ఆగావో తెలియని
అంతర్యామివి నువ్వు 🙏

సమస్త చరాచర జీవరాశులకు 
తండ్రి గా  దాతగా  రక్షకుడిగా 
వైద్యుడిగా జ్ఞాన ప్రదాతగా 
రుద్రుడిగా  దండిస్తూ 
శివుడిగా అక్కున చేర్చుకునే
భగవత్ తత్వానివి  నువ్వు 🙏

దాసోహం అన్న జనులకు 
నేనున్నా అనే ధైర్యం....
ఆపదలో ఆర్తిగా పిలిచే వారికి 
వద్దకొచ్చి ఆదుకుని
దిక్కు తోచని వేళ తోడు వచ్చి
సరియైన త్రోవ నడిపే
మార్గదర్శివి నువ్వు 🙏

క్షణం ఆగక పయనించే 
కాల చక్రమై 
కంటికి కనిపించని లోకాలలో 
కూడా వ్యాపించి 
ప్రతి జీవి దేహంలో ప్రాణమై 
నివసించి 
పట్ట పగటి వెలుగు లాగా
ప్రపంచమంతా వెలిగించు
జ్యోతి రూపం నువ్వు 🙏

తలచినంతనే హృదయం
తృప్తి తో నిండిపోయే.....
సమస్య నీతో చెప్పుకుంటే 
సగం బరువు తీరిపోయే....
నీవే తప్ప ఇతరము ఎరుగనని 
శరణం కోరితే
నీవే నేరుగా వచ్చి నిలబెట్టే 
మహాదేవుడివి నువ్వే 🙏

నమస్కరించిన చాలు 
నామస్మరణ చేసినా చాలు 
తడిసిన రెప్పల చూపుల
అభిషేకించినా చాలు
అవ్యక్త ఆనంద సీమల తేలించి
ఆపదలు అవలీలగా దాటించు
మహేశ్వరుడివి నువ్వు 🙏

నీవుండ నాకండగా 
భయమేల ఇంక

ఓం నమః శివాయ

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు