సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 *అమ్మ కడ్పుల ఆఖర్న పుట్టడం కంటే అడవిల మానై పుట్టడం మంచిది
*****
"అవ్వా! నా జెల్మ ఏం జెల్మ శెప్పు.అందరొతికె కడ్పు నిండ తిండికి నోసుకోనయితి.ఆయిమన్న బట్టకి నోసుకోనయితి.అక్కల లగ్గాలకు అమ్మ నాయిన అడివిల కుంట బూవి లేకుంట అమ్మిన్రు.శేతిల పైస లేదు.ఒంట్లె శాతవ్వడం లేదు.
"ఏందిరా తమ్మీ!గింత పరేషాన్ గున్నవు. ఒంట్లె బాలేదా? నాల్దినాలు గా తిర్గుడాపి ఇంట్లో ఉండరాదు."
 గంత అదృట్టమా అవ్వా! పొద్దుగాల లేత్తే ఇల్లెట్ల ఎల్లదీయాలనో వైపు,ఎప్పుడొత్తదో తెల్వని ఉపద్రం లెక్క  ఏ అక్కింట్ల పంచనని పిలుపొత్తదోనని దడబుట్టి సత్తున్న.
"నిజవే తమ్మీ! మీ అమ్మ నాయిన గదే పెద్దమ్మ పెద్దయ్య మగ నలుసు కావాలె,గాడు లేకుంటే తల కొర్వి ఎవడు పెడ్తడు?పున్నామ నరకం నుండి ఎవలు తప్పిత్తరని కన్కుంటబోతే ఏడుగురి తర్వాత నువ్వు బుట్టినవు గని ఏం లాబం తమ్మీ? నువ్వు పెరిగే నాటికి పెద్దమ్మ,పెదనాయన వొయసుడిగి పోయింది.ఆత్తంత అక్కల లగ్గాలకే ఆర్తి కర్పూరం లెక్క ఆత్తంత కరిగి పోయింది.
ఏం చేత్తం తమ్మీ! కొడుకు కొడుకని నిన్ను కన్నరు గని నువ్వెదిగే నాటికి ఆత్తులూ మిగల్లే.ఆళ్ళూ మిగల్లే.
 అవునవ్వా! అందరికంటే ఆఖర్న పుట్టడం నా కర్మ."దేనికైన అదృట్టం ఉండాలె. పెట్టి పుట్టాలె" అంటరు.
"అవును తమ్మీ! గందుకే మన ఎనైకటోళ్ళు 'అమ్మ కడ్పుల ఆఖర్న పుట్టడం కంటే అడివిల మానై పుట్టడం మంచిది". అంటరు.
"అవునవ్వా!అడివిల శెట్టన్న ఆయిగ బతుకుద్ది. నాకేం సుకముంది.గింతే . సచ్చే దన్క సమస్సలతో బత్కడమే.
"గట్లనకు తమ్మీ! నీ పిల్లలిద్దరూ బుద్ధిమంతులు.ఇంకో రెండేళ్ళయితే కొడుకు సేతి కొత్తడు. నీ కట్టలన్నీ తీర్తయి. నీ మంచితనమే నీకు శీరామ రచ్చ తమ్మీ! అసలే ఎండాకాలం వొత్తుంది ఇగ్గో గీ గిలాసెడు సల్ల తాగు" అన్న అవ్వతో... 
గా ఆశతోనే బత్కుతున్నవ్వా! ఇంగ పోత.మన్సంత దుమారం లేశినట్లయి,దైర్నం శెడి నీ తానకి వొచ్చిన.గిప్పుడు మన్సు తేలికైంది.ఇంగ పోతవ్వా! "అన్కుంట బోతున్న రమణయ్య  వొంక సూత్తూ "గీని కట్టాలు తొరగ గట్టెక్కాలి"అనుకున్నది.

కామెంట్‌లు