నిజమైన శివరాత్రి అంటే జాగరణనే...: - '' కావ్యసుధ '' హైదరాబాద్

  శివనామాల్లో ముఖ్యమైనవి 'రుద్ర, శివ' నామాలు. 'రుద్ర' అంటే రోదనం పోగొట్టే వాడు. 'శివ' అంటే మంగళకరమైనవాడు. జీవులకు రోదనము పోగొట్టి మోక్షము కలి గించేవాడు శివుడు భోళాశంకరుడు. భక్తవ త్సలుడు. 'మహదేవ' అని ముమ్మారు భగవ న్నామాన్ని భక్తిశ్రద్ధలతో ఉచ్ఛరిస్తే వారికి ఒక్క నామస్మరణకి ముక్తిని ప్రసాదించి, మిగిలిన రెండు నామాలకీ ఋణపడి ఉంటాడు. అంతేకాదు 'మాని యే మహేశస్య ధ్రువమ ప్రజ్ఞానతోపి వా తేషాం కర "తలే ముక్తిః" - ఎవరైతే పరమేశ్వరుని యొక్క నామాలు జ్ఞానం చేత కాని, అజ్ఞానం చేతకాని స్తుతిస్తూ వున్నారో వారికి ముక్తి చేతిలోనే వుంది అని వేదంలో పేర్కొ నబడింది. 
          మాఘబహుళచతుర్దశినాటి అర్ధరాత్రికాలమున పరమశివుడు కోటిసూర్యకాంతులతో లింగరూపమున ఆవిర్భవించినాడు. కనుక ఈనాటి అర్ధరాత్రి నుండి చతుర్దశి ఉన్న ప్పుడే మహాశివరాత్రి. ఈ మాఘమాస సంబంధము వలెనే ప్రతిమాసమున బహుళచతుర్దశి 'మాసశివరాత్రి' అయినది. - మహా శివముగల రాత్రి మహాశివుని యొక్క రాత్రి మహా శివరాత్రి. శివు డనగా బ్రహ్మానంద స్వరూపుడు. నిర్వికారుడు గనుక శమించియుండువాడనియు ఇతని యందు సజ్జనుల మనస్సులు ఉండుననియు, సాధువుల మనస్సులందు శయనించి యుండువాడనియు, సకల శుభములతో కూడినవాడనియు, శివ శబ్దమునకు అర్థములు. 'శివము' అనగా మంగళము, శుభము, కైవల్యము, శ్రేయస్సు. రాత్రి అనగా సుఖము నిచ్చునది. కనుక గొప్ప శుభముతో కూడినదియు, పరమసుఖమును ఇచ్చునదియు, మహాశివ స్వరూపమైన బ్రహ్మానందమును ప్రసాదించునదియు మహా శివరాత్రి  !.
      "యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వమంగళా!తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయ మంగళమ్"
మహాదేవుని నామము, రూపమూ శివమే ఆయన పత్ని జగజ్జనని శక్తి స్వరూపిణి సర్వ మంగళ. వారిరువురి స్మరణ అన్నివిధాల జయము, మంగళమును ప్రసాదిస్తాయి. ఐహిక సుఖాలు, పారమార్థిక జ్ఞానము, మోక్షము ప్రసాదించగల సాంబశివుని బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలు, వశిష్ఠ వ్యాసాది మునీంద్రులు ఆరాధించి అభీష్ట సిద్ధులను పొందినట్లుగా వేద, పురాణేతిహాసాలు  విశదీకరిస్తున్నాయి.
         మాఘబహుళ చతుర్దశినాడు జీవాత్మ-పరమాత్మ యైన శివునికి చాలా దగ్గరలో ఉంటాడు. సాధన తీవ్ర స్థాయికి వచ్చినపుడు- అమావాస్యస్థితి - అంటే శివైక్య స్థితి సిద్ధిస్తుంది. ఇట్టి శుభలగ్నమే అర్థరాత్రి శివలింగో ద్భవకాలం! ఇదే మహాశివరాత్రి. ఇలా భావించి, సాధన చేసి, ఆనందిస్తేనే శివరాత్రి పూజలూ, అభిషేకాలూ, జాగరణ సార్థకమౌతాయి.
జాగరణం :
జాగరణమన్న పదమునకు 'నిద్ర మేల్కొనుట' అన్న బాహ్యార్ధముతో సంతృప్తి చెందక, 'ఉత్తిష్ఠత! జాగ్రత! ప్రాప్యవరాన్ని భోథత,' లెండు, మేల్కొనుడు, గురువుల సేవించి యధార్ధమును గ్రహింపుడు అన్న ఉపనిషదర్థము ననుసంధించి, అజ్ఞాన నిద్రనుండి జాగరితులై స్వస్వరూప సంధానమను మహాజాగ్రద్ధశ కల్గియుండుటన్న అంతరార్ధమును గ్రహించుట. యుక్తము.
          
జాగరణము : జాగరణ మనగా ఏదో పిచ్చాపాటి మాటలతో, వినోద
కార్యక్రమములతో మేల్కొనుట కాదు. - ప్రకృతిలో నిద్రాణమైయున్న శివశక్తిని, శివపూజా భజన - లీలా శ్రవణాదులతో మేల్కొల్పి, తాను శివుడై, సర్వమును - శివస్వరూపముగా భావించి, దర్శించుటయే నిజమైన సూక్ష్మాజాగరణము. అప్పుడు శివపూజలో సాయుజ్యము, శివభజనలో సామీ ప్యము, శివభక్తులతో కూడి, శివ విష యములు ప్రసంగించుటలో సాలో క్యము. శివధ్యానములో సారూప్యము సిద్ధించుననిన ఆదిశంకరుల మాట ప్రత్యక్షర ప్రత్యక్ష సత్యమగును. చతుర్విధముక్తులును ఇహలోకముననే ఈ దేహముతోనే స్వానుభవములోనికి వచ్చును. ఈ నాల్గింటిని శివరాత్రి నాడు ప్రత్యక్షముగా సాధించుటయే శివరాత్రి జాగరణము. నాల్గు జాము  పూజలతో మనో బుద్ధి చిత్తా హంకారములు నాల్గును పరిశుద్ధములు కావలెను. ప్రపంచము అశాశ్వతమని యు, బ్రహ్మ మొక్కటే శాశ్వతమనియు గ్రహించి, మన బుద్ధిని మేల్కొల్పుటయే జాగరణము.
జాగరణమంటే మేల్కోవడం. ఆనాడు 33 కోట్ల దేవతలూ ఆ రాత్రంతా మేల్కొని, శివుణ్ణి పూజించి నందున మనమూ శివరాత్రినాడు జాగరణ చేస్తున్నాం. జాగరణమనే పేర్తో, పిచ్చాపాటి మాటలతో, వినోద కార్యక్రమాలతో మేల్కోవడం కాదు. ప్రకృతిలో నిద్రాణమై ఉన్న శివశక్తిని, శివపూజ, భజన, శివలీలలు వినడం మొదలైన కార్యక్రమాలతో మేల్కొల్పి, తాను శివుడై, సర్వాన్నీ శివస్వరూపంగా భావించి, దర్శించడమే నిజ మైన జాగరణ. అపుడు శివపూజలో సాయుజ్యం, శివ భజనలో సామీప్యం, శివభక్తులతో కూడి, శివప్రసంగాలు చేయడంతో సాలోక్యం, శివధ్యానంలో సారూప్యం కనే నాల్గువిధాలైన మోక్షాలూ - జీవించి ఉండగానే, ఒక్కడే లభిస్తాయన్న, శంకరాచార్యుల శివానందలహరి స్తోత్రవాక్యాలు ప్రత్యక్షర సత్యాలవుతాయి. ఇలా చతుర్విధ మోక్షాలను ఈ దేహంతోనే శివరాత్రి నాడు ప్రత్యక్షంగా సాధించడమే శివరాత్రి జాగరణం ! నాల్గు యామాల పూజలతో మనోబుద్ధి చిత్తాహంకారాలు, నాలుగూ పరిశుద్ధం కావాలి. ప్రపంచం అశాశ్వతమనీ, బ్రహ్మమొక్కటే శాశ్వతమనీ గ్రహించి, మన బుద్ధిని మేల్కొల్పడమే జాగరణం!
             క్షీరసాగరమథన సందర్భంలో అమృతానికంటే ముందుగా హాలాహల విషాగ్ని జ్వాలలు పుట్టి, లోకాలను దహింపజేస్తున్నాయి... అప్పుడు దేవతలందరూ శివుణ్ణి ప్రార్ధించారు. లోకరక్షణతత్పరుడైన పరమశివుడు తన యోగశక్తితో ఆ విషాన్ని ఒక గోళంగా-అంటే చిన్న గుండుబిళ్లగా మార్చుకొని, మింగి కంఠంలోనే నిల్పాడు. తెల్లనిశరీరంగల శివునికి, విషగుళిక కంఠం దగ్గర నల్ల దానాన్ని కల్గించింది. అందువల్ల శివుడు నీలకంఠుడూ, గరళకంఠుడూ అయ్యాడు. ఇంత సాహనంతో లోకానికి మహోపకారం చేసినందున ఆ రాత్రి అంతా దేవతలూ, రాక్షసులూ అందరూ మేల్కొని శివుణ్ణి పూజించడం ద్వారా తమ కృతజ్ఞతలు తెల్చుకొన్నారు. అందుకు సంకేతంగా - లోకానికి సుఖాన్నీ, శుభాన్నీ కల్గించిన శివసంబంధమైన రాత్రి కనుక- మహాశివరాత్రి అనీ, ఆ రాత్రి జాగరణ చేసి, శివుణ్ణి పూజించాలనీ, కూడా పెద్దలు సూచించారు.
       శివరాత్రినాడు తెలియక జాగరణం, ఉపవాసం చేసిన వారెందరో శివైక్యం పొందారని పురాణాలు పేర్కొ న్నాయి. ఇక తెలిసి శివరాత్రివ్రతాన్ని ఆచరిస్తే కలిగే మహానందఫలం మాటలకు అందనిది, ఆత్మకు మాత్రమే గోచరించేది అని గ్రహించాలి.
          శివరాత్రి నాడు ఉపవాసం ఉండి, రాత్రి నాల్గు జూములలో శివుణ్ణి అభిషేకించి, పూజించి, ఆరాత్రంతా శివకైంకర్యాలతో, స్తోత్రపఠనంతో, శివతత్త్వానుసంధా నంతో జాగరణ చేసి, మరునాడు ఉదయం శివుణ్ణి పూజించి, మహానైవేద్యం చేసి, ఆ ప్రసాదాన్ని స్వీకరిం చాలి. మరునాడు పగలు నిద్రిస్తే, ముందునాడు చేసిన జాగరణ ఫలం వృథా అవుతుంది.
          "ఉపవాసమంటే", భగవంతునికి సమీపంలో, సన్నిధిలో ఉండడం. నిరాహారియై ఉండటమనేది సామా న్యార్థం కనుక శరీరధర్మాన్నీ, ఆరోగ్యాన్నీ బట్టి పూర్తిగా నిరాహారంతో ఉండలేనివారు పండ్లూ, పాలూ తీసుకో వచ్చు. సాత్త్వికాహారం పరిమితంగా స్వీకరించవచ్చు. ఆహారంకంటే కూడా, ఇంద్రియాలనూ, మనస్సునూ భగవత్సన్నిధిలో స్థిరంగా, ఏకాగ్రతతో ఉంచటమే నిజ మైన ఉపవాసం! మనస్సూ, ప్రాణాలూ, ఇంద్రియాలూ, ఆత్మ సన్నిధిలో చేరి, ఆనందించడమే నిజమైన శివరాత్రి.
     " ఆధ్యాత్మిక సాహిత్య సామ్రాట్"
" ఆధ్యాత్మిక సాహితీ వ్యాస భూషణ్ "
               " సాహితీ శిరోమణి "
                   '' కావ్యసుధ '' హైదరాబాద్

కామెంట్‌లు