అక్షరగీతం : - గుండ్శ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
అక్షరగీతం రాయాలని ఉన్నది —
మనసుల తట్టే
భావాల మ్రోగింపుని
పల్లవిగా మలచాలని ఉన్నది.

అక్షరపాట పాడాలని ఉన్నది —
అమ్మభాష ఒడిలో
లయల్ని ఊపిరిగా చేసుకుని
హృదయాలకు హితబోధ చేయాలని ఉన్నది.

అక్షరస్వరాలు వినిపించాలని ఉన్నది —
నిశ్శబ్దపు నాడుల్లోకి
నాదమై ప్రవహించి,
భావాల రక్తధారల్లో లయను నింపాలని ఉన్నది.

అక్షరవీణ వాయించాలని ఉన్నది —
ప్రేమ తంతుల్ని తాకుతూ
వేదనల్ని రాగాలుగా మలచి
శ్రోతలకు శాంతి రుచి చూపించాలని ఉన్నది.

అక్షరసన్నాయి ఊదాలని ఉన్నది —
పండుగ గాలుల్లో
తెలుగుతనం పరిమళిస్తూ
ఆనందాల పిలుపునివ్వాలని ఉన్నది.

అక్షరనృత్యం చేయాలని ఉన్నది —
అర్థాల అడుగుల్ని
లయల చేతుల్లో పెట్టి
భావాల శిల్పంగా మలచాలని ఉన్నది.

అక్షరజాతర చేయాలని ఉన్నది —
అ ఆ ల నుంచి
క్ష ఱ వరకు
అక్షరాల్ని అల్లరి పిల్లలుగా పరుగెత్తించాలని ఉన్నది.

అక్షరామృతం తాగించాలని ఉన్నది —
కవిత అనే కలశంలో
తెలుగుభాష తియ్యందనాలు పోసి
అనంతానందంలో ముంచాలని ఉన్నది.

అక్షరాలే నా శ్వాస,
అక్షరాలే నా సంగీతం,
అక్షరాలే నా పూజ,
అక్షరాలే నా పరమార్థం.

నేను —
అక్షరాలు నడిపించే
భావ యాత్రికుడిని, 
సామాన్య సాధకుడిని.


కామెంట్‌లు