ఆ ఊరి పేరు మాధాపురం. చిన్న గ్రామం, చుట్టూ పచ్చని పొలాలు, మధ్యలో ఒక చిన్న పాఠశాల.ఆ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు గారు,అందరూ వెంకన్న సారు అని పిలుస్తారు. ఆయనకు వయసు యాభైఐదేళ్లు దాటింది కానీ, ఆయన మాటల్లో తెలుగు మాధుర్యం ఇంకా తగ్గలేదు. పిల్లలకు తెలుగు పాఠాలు చెప్పేటప్పుడు ఆయన కళ్లు మెరిసిపోతాయి. "మాతృభాష మన తల్లి పాలలాంటిది . అది మనల్ని పోషిస్తుంది, మన ఆత్మను బలపరుస్తుంది" అని చెప్పేవాడు.
ఆయన మనవరాలు ఆద్విత ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆరవ తరగతి చదువుతున్నది. ఇంట్లో కూడా తాతయ్యతో ఇంగ్లీష్‌లోనే మాట్లాడేది. "తాతయ్యా, టుడే ఐ గాట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ మ్యాథ్స్!" అంటుంది గర్వంగా. వెంకటేశ్వర్లు సార్ నవ్వేవాడు. "బాగుంది కానీ, తెలుగులో చెప్పు ఆద్విత. నీ మాటలు తెలుగులో వినాలనిపిస్తుంది."
ఆద్వితకి అది ఇబ్బందిగా అనిపించేది. "తాతయ్యా, ఇంగ్లీష్ తెలిస్తేనే ఫ్యూచర్ బాగుంటుంది. తెలుగు ఎక్కడికి వెళ్తుంది?" అనేది. వెంకటేశ్వర్లు గారు మౌనంగా ఉండేవాడు. కానీ ఆయన హృదయంలో ఒక నిశ్శబ్ద బాధ.
ఒకరోజు ఫిబ్రవరి 21 వచ్చింది. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. వెంకటేశ్వర్లు గారు పాఠశాలలో చిన్న కార్యక్రమం ఏర్పాటు చేశారు. పిల్లలు తమ మాతృభాషలో చిన్న చిన్న కథలు, పాటలు, మాటలు చెప్పాలి. ఆద్వితను కూడా పిలిచారు. "నువ్వు కూడా రా తల్లీ, నీ తాతయ్య కోసం ఒక్క మాట తెలుగులో చెప్పు."
ఆద్విత మొదట నో చెప్పింది, కానీ తాతయ్య కళ్లలో ఆ ఆశ చూసి, ఒప్పుకుంది. ఇంటికి వచ్చి రాత్రంతా ఆలోచించింది. తాతయ్య రాసిన ఒక చిన్న పుస్తకం తీసుకున్నది – "మాతృభాష మహిమ". దాన్ని తెరిచి చదవడం మొదలుపెట్టింది, ఆ
పుస్తకంలో ఒక కథ ఉంది. బంగ్లాదేశ్‌లో 1952లో భాష కోసం రక్తం చిందిన విద్యార్థుల గురించి. "భాష కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్లు ఉన్నారు, మనం కనీసం దాన్ని మరచిపోకూడదు" అని రాసి ఉంది. ఆద్విత కళ్లు చెమ్మగిల్లాయి. తాతయ్య ఎందుకు ఇంతగా తెలుగుని ప్రేమిస్తారో అర్థమైంది.
మరుసటి రోజు పాఠశాలలో కార్యక్రమం. ఆద్విత వేదిక మీదకి చేతిలో ఒక చిన్న కాగితంతో వచ్చింది, గట్టిగా శ్వాస పీల్చి మాట్లాడడం మొదలు పెట్టింది
"నా తాతయ్య గారు... ఆయన నాకు తెలుగు నేర్పారు. కానీ నేను మరచిపోయాను. ఈ రోజు నేను గుర్తుచేసుకున్నాను – మాతృభాష అంటే మన గుర్తింపు. మన సంస్కృతి. మన భావాలు. దాన్ని కోల్పోతే మనం ఎవరో మరచిపోతాం.
తాతయ్యా... నువ్వు చెప్పినట్లు – 'తెలుగు నా తల్లి. తెలుగు నా శ్వాస.' ఇక నుంచి నేను తెలుగులోనే మాట్లాడతాను. తెలుగులోనే ఆలోచిస్తాను.
ఫిబ్రవరి 21... ఈ రోజు నాకు కొత్త జన్మ ఇచ్చింది. ధన్యవాదాలు తాతయ్యా!"
ఆ మాటలు వినగానే వెంకటేశ్వర్లు గారి కళ్లలో ఆనంద బాష్పాలు. ఆయన లేచి ఆద్వితను గట్టిగా కౌగిలించుకున్నారు. పిల్లలంతా చప్పట్లు కొట్టారు. ఆ రోజు ఆ ఊరంతా తెలుగు మాటలతో నిండిపోయింది.
అప్పటి నుంచి ఆద్విత తన తాతయ్యతో తెలుగులోనే మాట్లాడేది. తెలుగు పుస్తకాలు చదివేది. చిట్టి కవితలు రాసేది. మాతృభాష ప్రాముఖ్యతను తన స్నేహితులకు చెప్పేది.
ఒక రోజు వెంకటేశ్వర్లు గారు ఆద్వితతో అన్నారు, "అమ్మా, నువ్వు నా కథను పూర్తి చేశావు. మాతృభాష అమరమైంది. దాన్ని మనసులో ఉంచుకున్న వారు అమరులు."
అలా... ఆ చిన్న గ్రామంలో ఒక చిన్న బాలిక మనసులో మాతృభాష మళ్లీ మొలకెత్తింది. ఫిబ్రవరి 21 – ఆ రోజు అతనికి కేవలం దినోత్సవం కాదు... ఒక కొత్త ఆరంభం అయింది.
_____
మాతృభాష - మళ్ళీ మొలకెత్తింది: - సాधNa- సాధన.తేరాల,ఖమ్మం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి