సాగర ఘోష : కేశరాజు వేంకట ప్రభాకర్ రావు పాతర్లపాడు ఖమ్మం -సెల్ ఫోన్ 62816 979 82
నిశ్శబ్ద విశ్వంలో 
అలల పొలపముతో
శబ్దించిన సాగరంలో 
ఉద్భవించిన ఓంకారాన్ని 
సద్భక్తి తో నిరంతరం 
ఘోషిస్తోంది సాగరం!!

చలన శీలియై హృదయంలా సదా 
చైతన్య పరుస్తుంటే 
మృత్తు సైతము హత్తుకుని 
పొత్తిలి నిండా పుట్టుకకొచ్చిన జీవరాశికి
పుట్టుకనిచ్చిన పుడమికి తోడీ కడలి !!

అందుకే!
నిత్యమై సత్యమై 
శ్రుతులై స్మృతులై 
హితమై వృతమై
దృతమై ధృతమైనదీ 
ధృత్వరి యందీసాగరం!!

బడబానలాన్ని దాచుకుని 
బడుగు జీవులను సాకినా 
భారి తిమింగలాలకు 
భూరి సంఖ్యలో జన్మనిచ్చినా !!

అలసట చెందక ఆగ్రహించక
అర్కుని ధాటికి ఆవిరియై 
అబ్దము చేరి అంబువులై
అవనిపై వర్షించి ఆహ్లాదంతో 
ఆకలిదప్పులు నిర్మూలించే 
అమృతాంబువుల అక్షయకలశంబీసాగరం!!

మానవ మనికి మన్నిక కలిగిన 
మానవత్వపు పరిమళాలను, 
విరిసిన విరులవోలె జాలు వార్చిన జలధిని
బలాత్కారం చేస్తున్న 
బడుద్ధాయిలీమానవులు!!

ఖలుడు దుశ్శాసనుడివలె
విలువల వలువలు విప్పుచు 
వారాశి ఒంటి పయిన వడచు 
మడ్డి చమురు దుడ్డు కొరకు!!

నవ నాడు లందు 
వేల టన్నుల బరువున్న 
నౌకలెన్నో తిప్పుతూ 
ఊపిరాడక ఊపి చంపు పొగను 
వదులు చుండె పైకం కొరకు!!

అయితేనేం!
మతం మత్తు మతికెక్కిన మృగాలు 
మారణ హోమం తలపెట్టి 
అణు బాంబుల తయారీ చేపట్టగా...వారి 
మరణ శాసనం రాస్తానని వేరొకరి 
భీకరమైన గర్జన తో !!

ఒకరిపై ఒకరు యుద్ధం తలపోసి 
నడి సంద్రంలో సమరం చేస్తూ 
కడలి కడుపులో మందు పాతరలు 
కంఠంలో బాంబులహారం కాలనాగులా!!

కటిపైన శతఘ్నుల వడ్డాణం 
వక్షస్థలం మీద క్రూయిజ్ క్షిపణుల భోషాణం 
చేతుల నిండా స్టెల్త్ బాంబర్లు
కళ్ళల్లో లేజర్ ఆయుధాలు కనబడకుండా!!

తలపైన ఫైటర్ జెట్ విమానాలతో 
అలంకరించబడిన సాగరం 
ఎప్పటిలాగే
వసంత రుతువులా మెరుస్తూ
ఘోషిస్తోంది ఓం కార నాదాన్ని !!

శాంతి స్వరంతో 
ఎంతో నిశ్చలంగా 
సర్వం శాంతి మయం కావాలని 
ఓంకారేశ్వర నాదాన్ని వినిపిస్తూనే ఉంది. 

కామెంట్‌లు