అమ్మ యాదిలో….: - -ఎస్. వి.రమణా చార్య
 అమ్మ గతించిదన్న బాధలో
ఉగాది వచ్చిందన్న యాదే లేదు
అమ్మ అంటే ఆత్మకదా
పేగు బంధంతో ముడిపడ్డ ప్రేమకదా
కొట్టి చెప్పినా, తిట్టి చెప్పినా
నా అమ్మకదా ఎట్లా మరతు
బిడ్డా చిన్నోడివి చూసి మెదులుకోరా
కోపానికి రాకు బిడ్డా
యాష్ట పడకు బిడ్డా
అందరూ ఒకలా వుండరు బిడ్డా
చూసి మెదులుకోరా
కాలం ఎప్పటికీ ఒకలా ఉండదు కొడుకా
పడ్డోడు చెడ్డోడు కాడు బిడ్డా
ఓపిక ఉండాలి కొడుకా
అంటూ ఎప్పుడు అమ్మ అంటున్న మాటలే
యాదికొస్తున్నాయి…
ఇప్పుడు ఆ మాటలే
నా గుండె చప్పుడు అవుతున్నాయి
నడకలో జారిపోతే
అవి నన్ను నిలబెడుతున్నాయి
అమ్మా…
నీ ఒడిలో నేర్చుకున్న జీవితం
ఇప్పుడు ఒంటరిగా సాగించాల్సి వస్తోంది
నీ నీడ పోయినా
నీ నీతి మాత్రం వెంట నడుస్తోంది
ఉగాది ఉదయం వెలుగొచ్చింది…
కానీ ఇంట్లో వెలుగు లేదు
నువ్వు వెలిగించిన దీపం
ఇప్పుడో జ్ఞాపకంగా మిగిలింది
పచ్చడి రుచి నోటికి తగిలింది
కానీ గుండెకు తగిలింది నీ లోటే
చేదు రుచి ఎక్కువైందమ్మా
తీపి జ్ఞాపకాలు కన్నీటిలో కలిశాయి
“పడ్డోడు చెడ్డోడు కాడు” అన్నావు
అదే మాట ఇప్పుడు
నన్ను నాలో నిలబెడుతోంది
ప్రతి ఓటమి తర్వాత
నీ స్వరం నన్ను మళ్లీ లేపుతోంది
ఎవరూ ఒకలా ఉండరని చెప్పినావు
అందుకే నేర్చుకున్నాను
మనసు పెద్దది చేసుకోవాలని
కానీ అమ్మా…
నీలా ఉండే మనసు మాత్రం
ఎవరికి రాలేదు
నీవు లేకపోయినా
నీ మాటలే నాకు తోడుగా...
నీ జ్ఞాపకాలే నాకు దారిగా....
ఈ జీవితం సాగుతోంది
ప్రతి పండుగకు ముందు
నీ చిరునవ్వు గుర్తొస్తుంది
ప్రతి కష్టంలో
నీ ఓదార్పు వినిపిస్తుంది
అమ్మా…
నీ కోసం కన్నీళ్లు కార్చడం కాదు
నీలా నిలబడటం నేర్చుకుంటున్నా
నీ ఆశీస్సులే నాకు ఆయుధం
నీ జ్ఞాపకాలే నా ఆస్తి
నీ మాటలే నా మార్గం
నువ్వు లేవని ప్రపంచం చెబుతుంది
కానీ నా గుండె చెబుతోంది
“అమ్మ ఎప్పటికీ దూరం కాదని”'
నీవు ఆకాశమై ఉన్నా
నేను నేలపై ఉన్నా
మన బంధం మాత్రం
శాశ్వతంగా ఒకటే…
ఉగాది మారుతుంది… సంవత్సరాలు మారుతాయి…
కానీ
అమ్మ జ్ఞాపకం మాత్రం
కాలం చెరపలేని శాసనం…
అమ్మా…
నీ పేరు పలికితేనే
గుండె కొట్టుకోవడం పెరుగుతుంది
నీ జ్ఞాపకం తలుచుకుంటేనే
జీవితం ముందుకు నడుస్తుంది 

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
అమ్మ తర్వాతే అవని జగమంతా