అమర వీరులకు అక్షర విస్ఫోటనం..!: - కవిరత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
1931 మార్చి 23
రక్తం రాసిన రగిలే చరిత్ర..!
చరిత్ర గుండెలో పేలిన అగ్నిగుండం..!

లాహోర్ జైలు...
ఇనుప గోడల మధ్య
మూడు శరీరాలు కాదు...
మూడు ఉరిమే మేఘాలు
మెరుపుల్ని మింగేశాయి..!

మూడు అగ్నిపర్వతాలు
ఉరితాళ్లను శివలింగాలుగా
ఆలింగనం చేసుకున్నాయి...
అది విప్లవం జన్మించిన యజ్ఞవేదిక..!

భగత్ సింగ్ 
ఒక విప్లవ జ్వాల...
ఒక జ్వాలల జాతర...
సుఖదేవ్ ఒక సంకల్ప సునామీ... 
అచంచల దీక్షకు ప్రతిరూపం
రాజ్ గురు ...ఒక రక్తతర్పణ దీపం...
చేసే రణరంగ రుద్రతాండవం..!

బ్రిటిష్ బానిసపు ఇనుప సంకెళ్లు
వారి జ్వాల ముందు తెగిన దారాలే...
వారి సాహసానికి చీలిన చీకటి తెరలే..!

మృత్యువు తలుపు తట్టకమునుపే
స్వాగతించిన వీర విస్ఫోటాలు..!
మృత్యువుకే ముక్తహాసం నేర్పిన
మృత్యుంజయ వీరులు వారు..!

వారి రక్తం...
భారత్ మట్టిలో పడిన విత్తనం కాదు
అది స్వేచ్ఛగా మొలిచిన జ్వాలావృక్షం..!
వారి ఊపిరి స్వాతంత్ర్యపు శంఖారావం.!

ప్రతి భారతీయుని గుండెగుడిలో
ఇప్పటికీ ఎప్పటికీ మండేగుప్తాగ్ని వారు..!

మన ఊపిరి....వారి ఋణం...
మన స్వేచ్ఛ.....వారి బలిదానం..
మన అడుగు...వారి అగ్నిపథం...
మన మార్గం....వారి ధర్మపథం...!

వంగి నమస్కరించడం కాదు
రగిలే అగ్ని గుండాలు వారు 
శిరస్సులు వంచడం కాదు గర్వంగా 
ఎగిరే జాతీయ జెండాలు వారు..!

ఓ అమర వీరులారా...!
మీ త్యాగం కాలానికీ కట్టుబడి లేదు
అది శాశ్వతంగా ప్రజ్వలించే జాతిజ్వాల..!

ఓ విప్లవ వీరులారా...!
కాలం మీ పేర్లను చెరపలేదు...
చరిత్ర మీ జ్వాలలను ఆర్పలేదు...
మీకు మరణంలేదు దేశం గుండెల్లో
నిత్యం జ్వాలలై రగులుతుంటారు మీరు.!

ఓ సమర సింహాల్లారా..!
అమర్ రహే..! అమర్ రహే..!
ఓ భగత్ సింగ్ అమర్ రహే..!
ఓ సుఖదేవ్ అమర్ రహే..!
ఓ రాజ్ గురు అమర్ రహే..!

జైహింద్..! జై భారత్..!


కామెంట్‌లు