మీరెప్పటికీ పిల్లలే: - యామిజాల జగదీశ్
 ఓ రోజు నేను బస్సు కోసం నిల్చున్నాను. అప్పుడు ఓ గ్రామీణ మహిళ నా దగ్గరకు వచ్చారు.
ఆమె దగ్గరున్న ఫోన్ నాకు చూపిస్తూ “ఇందులో ఎలా మాట్లాడాలో చెప్తావా” అని అడిగారు.
సరేకదాని నేను ఆమెకు అర్థమయ్యే భాషలో ఇలా చెప్పాను...
“అమ్మా, పచ్చ బటన్ నొక్కితే మాట్లాడుకోవచ్చు. ఎర్ర బటన్ నొక్కితే మాట్లాడటాన్ని ఆపేయొచ్చు.... ” అని.
నేను చెప్పినవన్నీ విన్న ఆమె “ఇది మా అబ్బాయి కొనిచ్చిన కొత్త ఫోన్” అని అంటూ తన ఆనందాన్నంతా కళ్ళల్లో చూపారు. 
“నా కొడుకు విదేశాల్లో ఉన్నాడు. పది పదిహేనురోజులకోకసారి  మాట్లాడుతుంటాడు. ఈసారి రెండు నెలలైంది మాట్లాడి” అని చెప్పారు.
కొడుకు పేరు, నెంబరూ చెప్పి ఎప్పుడైనా ఫోన్ చేశాడేమో చూడమని ఫోన్ నా చేతికిచ్చారు.
చూశాను. అతను కాల్ చేయనే లేదు. అయినా ఆ నిజాన్ని చెప్పడం నాకిష్టం లేక “....ఒకసారి కాల్ చేశాడు మీరు చూసినట్టు లేదు” అని అబద్ధం చెప్పాను.
అలా చెప్పినందుకు ఆమెకెంత సంతోషమో మాటల్లో చెప్పలేను.
“అన్నం తిన్నారా” అని అడిగాను.
అప్పుడు ఆమె చెప్పిన మాట...
“నా కొడుకు తిన్నాడో లేదో తెలీలేదు....వాడు తింటే చాలు...నేను తిన్నంత ” అని చెప్పారు.
“వాడిని తలచుకుంటే చాలు అన్నం తిన్నంత ఆనందం.... ” అని అన్నారు.
నేనన్నాను “...మీరిప్పుడు బాగా తింటే కదా మీ అబ్బాయి వచ్చినప్పుడు వాడిని గట్టిగా గాఢంగా కౌగిలించుకుని మురిసిపోగలరు” అని.
అప్పుడు ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి.
“....నువ్వు చెప్పావుగా...నిజమే కదూ ...బాగా తింటేనే కదా వాడిని గట్టిగా కౌగిలించుకోగలను. వాడొచ్చినప్పుడు వాడికి నచ్చినవన్నీ వండి పెట్టగలను...వాడితో బోలెడు విషయాలు చెప్పడానికి నాకు ఓపిక వస్తుంది ” అని అన్నారామె.
ఆమె మాటలకు నాకు ఏడుపొచ్చేసింది.
విదేశంలోనో లేక వేరే రాష్ట్రాలలోనో ఉంటున్న యువకుల్లారా మీ అమ్మలతో అప్పుడుప్పుడూ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండండి.....వాళ్ళందరూ మీ గొంతు నుంచి అమ్మా అనే పిలుపు కోసం నిరీక్షిస్తుంటారు. అదే వారికి కొండంత బలం ...మానసిక స్థయిర్యం.... మీరెంత ఎదిగినా అమ్మలకు మాత్రం ఎప్పుడూ చిన్న పిల్లలేసుమా....

కామెంట్‌లు