ఓ మిత్రమా..! నీ పరుపు…
నీ పరువును గంగలో కలిపేలోపే
నీ బద్ధకాన్ని బద్దలు కొట్టు…
అలసత్వం అనే చీకటి దుప్పటి
నిన్ను నిశ్శబ్దంగా కప్పేస్తుంది జాగ్రత్త…!
రోజూ అద్దంలోకి తొంగిచూసే నీవు...
"నేను అందగాడినని…
"అందాల రాముడినని
"నందమూరి చందమామనని…”
"ముసిముసి నవ్వులతో మురిసేవు..!
ఓ మిత్రమా..!ఆ అద్దం వెనుక దాగిననిజం
నీ అంతరంగం అంధకారమయమని...
నీ మనసు…అరిషడ్వర్గాల అగ్నిగుండమని..!
కామ క్రోధ లోభ మోహ
మద మాత్సర్యాలు నిన్ను
నిశ్శబ్దంగా దగ్ధంచేసే నిప్పుకణాలని...
అవి రగలకముందే...నీ బుద్ధిని
గంగాజలంతో శుద్ధి చేసుకోమని…!
ఓ మిత్రమా..! నీ అద్దం
నీతో యుద్ధం చేయకముందే...
నీ నీడ నీతో విడిపోకముందే...
స్వార్థం...సోమరితనమనే...
సంకెళ్ల నుంచి బయటపడు…!
నిశీధి నీలోకి జారకముందే...
నిప్పుకణికై నిన్ను కాల్చకముందే...
వెన్నెల రేఖలా వెలుగులోకి వచ్చెయ్...
నీ ముందుజీవితాన్ని దీప్తిమంతం చేసుకో..!
ఓ మిత్రమా..!
కష్టాలు కత్తులై కోసినా...
కాలం గునపాలు గుచ్చినా...
కన్నీటి వరదలు ముంచెత్తినా...
భయపడకు…వెనుకడుగు వేయకు…!
నీ చెమట చుక్కలను
ముత్యాలుగా మార్చుకో...
నీ శ్రమను శిల్పంలా చెక్కి
రక్తం మరిగే సంకల్పంతో
నీ జీవితమనే బృహత్ గ్రంథంలో
విజయ గాథలను లిఖించుకో…!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి