సుప్రభాత కవిత : - బృంద
దారిని వచ్చే అడ్డులన్నీ 
తొలగి పోయే  తీరెను 
కాలపు తేరున వెలుగుతూ 
తరలి తరణి వచ్చేను

జలతారు జలరేఖల
అలరారు  జలదాల 
జిలుగుల వెలుగులు 
నభమున  శోభలు కూరుస్తూ..

పుడమిని తాకిన కిరణం 
కడలికి మెరుపులు అద్ది 
చిరు అలల వయ్యారపు 
నడకను సొగసుగా చేస్తూ...

తూరుపు తలుపు తీసాక 
ఎరుపే నింగిని నిండాక 
తెరపి లేక సాగుతూ 
వరమై నరులను బ్రతికిస్తూ...

ఒకే తీరున నాలుగు దిశలా 
పాకే వెలుతురు చేతులతో 
తాకే  వెచ్చని అనుగ్రహంలా 
ఇలకు దిగిన ఇనుని తేజం

కలహపు  కారణం ఏదైనా 
కదనం  ఆపే కరవాలమై 
కనుల ముందరి కష్టం తీర్చి 
కరుణను ధరణిని కాపాడాలని 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు