అన్నదమ్ములకు అత్యున్నతపట్టాల అందజేత

 విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ 91వ, 92వ కన్వకేషన్ వేదికపై ఒక అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. హాజరైన సభాసదులు మురిసిపోయే కన్నుల పంట ఆ దృశ్యం. అన్నదమ్ములిద్దరూ ఒకేసారి అత్యున్నతమైన పట్టాలను స్వీకరించిన ఘనమైన వేడుక. వివరాల్లోకెళితే విశాఖపట్నం షీలానగర్ ప్రాంతంలో నివసిస్తున్న కుదమ గోపి, లత అను దంపతులకు విద్యావ్యవస్థ అంటే అమితమైన ఇష్టం. విజ్ఞానానికి సంబంధించిన అంశాలకు నిరంతరం ప్రాధాన్యమిస్తుంటారు. వీరు సాధారణ మధ్య తరగతి కుటుంబమైనా శక్తికి మించి, వీరి ఇద్దరి కుమారులనూ చదివించారు. కాబట్టే ఈ దంపతులు నేడు ఎందరికో ఆదర్శప్రాయమైనారు. అమ్మానాన్నల ఆశయాన్ని గౌరవిస్తూ, కుదమ మణికంఠ సాయి శ్రీనివాస్, కుదమ సాయి చరణ్ లనే ఆ సోదర ద్వయం గొప్ప విద్యార్హతలు సాధించి నేడు అందరి ప్రశంసలు పొందారు. 

పెద్ద కుమారుడు మణికంఠ సాయి శ్రీనివాస్ ఆంధ్రా యూనివర్సిటీలో బి.టెక్, ఆంధ్రా యూనివర్సిటీలోనే ఎం.టెక్ ను ఎలక్ట్రానిక్ ఇ.సి.ఇ.విభాగంలో పూర్తి చేసి, ప్రస్తుతం బెంగుళూరు పారస్ డిఫెన్స్ ప్రయివేట్ లిమిటెడ్ లో ఉద్యోగిగా సేవలందిస్తున్నారు. రెండో కుమారుడు సాయి చరణ్ ఆంధ్రా యూనివర్సిటీలో బి.టెక్ చదివి, రూర్కెలా నిట్ లో ఎం.టెక్ ను పెట్రో కెమికల్ విభాగంలో పూర్తి చేసి, హైదరాబాద్ ఐ.ఐ.టీ.లో పి.హెచ్.డి. ద్వితీయ సంవత్సరం  పూర్తి చేయనున్నారు. వీరిద్దరికీ నేడు విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో 91వ, 92వ కన్వకేషన్ సందర్భంగా వైస్ ఛాన్సలర్ చేతులమీదుగా సదరు విద్యార్హతల పట్టాలను ప్రదానం గావించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, విద్యా శాఖా మంత్రివర్యులు నారా లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరుకాగా, వారి సమక్షంలో ఈ గౌరవ సత్కారం స్వీకరించిన అన్నదమ్ములిద్దరూ, అందరిచే మిక్కిలి అభినందనలు పొందారు. పెద్ద కుమారుడు మణికంఠ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ భవిష్యత్తులో సైంటిస్ట్ గా దేశానికి, ప్రపంచానికి సేవలనందిస్తానని అన్నారు. అలాగే రెండవ కుమారుడు సాయి చరణ్ మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రొఫెసర్ గా పనిచేసి విద్యార్థులను  విజ్ఞానులుగా తీర్చిదిద్ది దేశానికి అందిస్తానని అన్నారు.

కుదమ గోపి, లత దంపతులను, కుమారులిద్దరినీ వారి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు హర్షం వ్యక్తం చేస్తూ, శుభాకాంక్షలు తెలిపారు.

కామెంట్‌లు