పరాభవనామ ఉగాది: - వరుకోలు లక్ష్మయ్య-తెలుగు భాషోపాధ్యాయులు.
 1.ఆ.వె.
తెలుగు వత్సరాది వెలుగులు విరజిమ్మ
వచ్చుచున్నదయ్య వసుధ పైకి
నవవసంతపుసిరి నవ్యమై వెలుగంగ
నాట్య మాడవచ్చె నవ యుగాది
2.ఆ.వె.
దుష్ట జనుల మదిన కష్టమనకజేరి 
సజ్జనులుగమార్చు సత్వరముగ
అన్నదాత రైతు ఆర్తిని పోగొట్ట 
పొంగిపొరలి రమ్ము గంగలాగ
3.ఆ.వె.
ఆంగ్ల భాష మోజు అంటు రోగంబాయె
చుక్కలనడుమెక్కి వెక్కిరించె 
తెలుగు నాదరించ కలిసి ముందుకు సాగ
తెలుగు వత్సరంబు తేజరిల్లు.
4.తే.గీ.
చైత్రమాసపుటెండలు చిత్రముగను
నిప్పు రవ్వలు రాల్చుచు రొప్పుచుండె
జనులు విలవిలలాడుచు జంకుచుండ
వరుణ దేవ మా పైనను కరుణ జూపు
5.తే.గీ.
వెడలు విశ్వావసువు నీవు వేగిరముగ
రా పరాభవనామము రమ్యమొలక
శాంతి సుఖముల నివ్వుము సర్వజనుల 
ఆదుకొనవమ్మ యీవేల అందరినిట.

కామెంట్‌లు