తెలుగు ఉగాది ఉత్సవ గీతం..!:- కవి రత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
నేటి ఉగాది ఉషస్సు
తూర్పు తల్లి ముఖాన
విరిసిన పసిడి చిరునవ్వు...

శ్రీ పరాభవ నామ సంవత్సర
తెలుగు ఉగాది పర్వదినం
కాలం తలుపు తట్టిన
వసంతమాసపు ఆత్మీయ అతిథి...
పచ్చని ఆకుల మామిడి తోరణాలు
ఇంటివాకిలిపై వేలాడే వసంత హారాలు...
ఊరించే ఊరంతా పంచే ఉగాది పచ్చడి
షడ్రుచులతో అల్లుకున్న నవజీవన గీతం..

తీపి – ఆనందాల తేనెతుట్టె
చేదు – అనుభవాల ఔషధం
పులుపు – సవాళ్ల మెరుపు
కారం – ధైర్య సాహసాల జ్వాల...
ఉప్పు – స్నేహ సముద్రపు అల...
వగరు – వలపు చూపుల వల...
ఈ రుచుల సమ్మేళనమే మన జీవితం

పూజారి వినిపించే పంచాంగ శ్రవణం
త్రికాలాలకు దిశను to చూపే దీపస్తంభం
కవి సమ్మేళనాల్లో  కవికోకిలలు
కమ్మగా ఆలపించే కవితాగానాలు
విరితోటలో గుభాళించే గులాబీలు...

ఓ పరాభవ నామ సంవత్సరమా..!
మేం నిన్ను కోరేదొక్కటే…ప్రపంచ
గగనాన గర్జించే నిప్పులు కురిపించే
యుద్ధ మేఘాలు చెదిరి పోవాలని...

రాజ్య కాంక్షతో రక్తపాతాలు
సృష్టిస్తూ ఉగ్రరూపం దాల్చిన
అగ్రరాజ్యాధి నేతలు యుద్ధం మాని
ఆత్మీయ ఆలింగనాలకు సిద్ధం కావాలని

ప్రేమ అందరిలో ప్రవహించాలని...
అందరు శాంతి స్వరూపులై
శాంతి మంత్రాలు జపించాలని...
శాంతి కపోతాలను ఎగుర వేయాలని...

శాంతి ఒప్పందాలు జరిగి శాశ్వతశాంతి
భూమిపై వసంత వర్షమై కురవాలని...
శాంతి నిండిన అందరి హృదయక్షేత్రాల్లో
మానవత్వపు విత్తనాలు మొలకెత్తాలని…

ఓ పరాభవ నామ సంవత్సరమా..!
నీకు స్వాగతం..! సుస్వాగతం..!
మేం నిన్ను కోరేదొక్కటే ప్రసాదిస్తే చాలు
మా ఇళ్ళల్లో శాంతిని...
మా కళ్ళల్లో కాంతిని...
మా గుండెల్లో ప్రేమను...
మా జీవితాల్లో త్యాగాన్ని...

++++++++++++++++++++++++



కామెంట్‌లు