సుప్రభాత కవిత : - బృంద
లోయల దారుల సాగే 
పాయల ఉనికి కైనా 
హాయిగా తేలుతు నింగిని 
ఊయల ఊగే  మబ్బులకైనా....

చిటారు  కొమ్మను కొత్తగా 
కన్నులు తెరచే చిన్ని 
మిసిమిసి మెరుపుల
ఎర్రని చివురాకు కైనా.....

గిరులను తరులను 
కలుపుతూ  హాయిగా 
కబురులు మోసుకు వచ్చే 
మలయానిలపు తెమ్మెరకైనా..

దట్టపు అడవిలో దవ్వున 
చిట్టి తీగను విరిసి మురిసి 
తీపి తేనెను రేకుల మధ్య 
దాచి ఉంచిన బుల్లి పువ్వుకైనా..

కొమ్మల మధ్యన  గూడులోన 
అమ్మ ఒడిలో ఒదిగి 
కమ్మగా నిదురించే 
బుజ్జి గువ్వ పిట్టకైనా..

అవని అణువణువున 
అలౌకిక ఆనందమిచ్చు 
అపురూపమైన అనుభూతి 
అందించు ఆదిత్యునికి 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు