పుడమిపై వారికి పునర్జన్మే..!: - కవి రత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
ఆ వృద్ధ జంట బ్రతికుండగానే…
ఒక "ప్రేమపూర్వక పలకరింపు"
వారికి ప్రాణవాయువై చేరుతుంది…
ఒక "ఆత్మీయ ఆలింగనం"
వారికి స్వర్గస్పర్శను అందిస్తుంది…!

ప్రక్కనే కూర్చొని...
చేతిలో చెయ్యేసి...
కళ్లలో కళ్లుపెట్టి...
నవ్వుతూ నమ్మకంగా
మనసారా మాట్లాడితే...
"పుడమిపై అది వారికి పునర్జన్మే"…!

ఏ ఆధారంలేక నడవలేని...
వినలేని...కోరింది కొనలేని...
తినలేని...కంటిచూపు ఆనని...
కాటికి కాళ్ళు చాపుకున్న ఆ వృద్ధులు
"రెక్కలు విరిగిన పక్షులే"...
"ఎండిన పండుటాకులే"...!

మీ ప్రేమ కోసం
కొండంత ఆశతో ఎదురుచూస్తూ
ఏదో ఒక రోజు నిశ్శబ్దంగా
నింగిలోకి నిశీధిలోకి నిష్క్రమిస్తారు
మాట్లాడుతూనే అలా మాయమౌతారు...

కన్నుమూసిన తర్వాత కార్చే ఆ
"కన్నీటిబొట్లు" వారి కళ్ళకు కనిపించవు..!
“ఆత్మశాంతి కలుగుగాక” అన్న ఆ కన్నీటి
"ప్రార్థనలు వారి చెవులకు వినిపించవు…!

బ్రతికుండగా పిల్లలు పంచే
స్వచ్ఛమైన ప్రేమను ఆస్వాదిస్తూ
అస్తమించడం ఒక అదృష్టమే...!

తల్లిదండ్రులను ఆదరించడం
ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం
మనిషితనానికి మానవత్వానికి
మంచితనానికి ప్రతిబింబం…!

ఓ కన్నబిడ్డలారా…!
ఒక్క క్షణం ఆలోచించండి…!
"అమ్మానాన్నలే ప్రత్యక్ష దైవాలన్నది"
ఒక పచ్చి నిజం...మరువకండి..!




కామెంట్‌లు