శ్రీ తులసీదాస్ - హనుమాన్ చాలీసా: - యామిజాల జగదీశ్
 ఒకసారి, మొఘల్ చక్రవర్తి అక్బర్ శ్రీ తులసీదాస్‌ను తన ఆస్థానానికి పిలిపించి, "నువ్వు గొప్ప రామ భక్తుడివి, నువ్వు చాలా అద్భుతాలు చేస్తుంటావు అని అందరూ అంటుంటారు.  నాకు ఏదైనా ఓ అద్భుతం చూపించు" అన్నాడు.
అయితే తులసీదాస్ "నేను మాంత్రికుడిని కాదు. శ్రీ రామ భక్తుడిని మాత్రమే!" అని అన్నాడు. 
ఈ జవాబు అక్బరుకి  కోపం తెప్పించింది. తులసీదాసుని జైలులో బంధించాడు.
అయితే తులసీదాసు "ఏది జరిగినా అంతా ఆ శ్రీరాముడి సంకల్పమే..." అనుకుంటూ ఏ మాత్రం బాధపడకుండా జైలుకు వెళ్లి ప్రతిరోజూ ఆంజనేయుని స్తుతిస్తూ ఒక శ్లోకం రాశాడు. ఆ శ్లోకాలు మొత్తం నలభై. ఆ శ్లోకాలు రాసిన తర్వాత అకస్మాత్తుగా ఎక్కడి నుంచో వేలాది కోతులు రాజభవనంలోకి ప్రవేశించి ఇబ్బంది కలిగించడం ప్రారంభించాయి.
సైనికులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కోతులను తరిమికొట్టలేకపోయారు.
కొంతమంది అక్బర్ వద్దకు వెళ్లి, "రామ భక్తుడైన తులసీదాస్‌ను హింసిస్తున్నందునే ఆంజనేయుడు కోపంగా ఉన్నాడు. కాబట్టి తులసీదాసుని విడుదల చేస్తే సమస్య కొలిక్కి వస్తుంది" అని సలహా ఇచ్చారు.
దాంతో  మరో దారి లేక అక్బర్ తులసీదాసుని విడుదల చేయడమే కాకుండా చేసిన తప్పుకి బాధపడ్డాడు. తనను క్షమించమన్నాడు. అంతా ఆ రామమయం అని తులసీదాసు జైలు నుంచి బయటకు వచ్చాడు.
అంతే, ఆ క్షణంలోనే వానరదండు అదృశ్యమైంది.
శ్రీ తులసీదాస్ చెరసాలలో ఉన్నప్పుడు చెప్పిన శ్లోకాలే ‘శ్రీ హనుమాన్ చాలీసా’.
ఈ హనుమాన్ చాలీసాను రోజూ పఠిస్తే బాధలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.


కామెంట్‌లు