బాలలు సృజనాత్మకమైన రచనలు చేయాలి : ఆడేపు కరుణాకర్

 బాలసాహిత్యంతో బాలల సృజన దోహద పడుతుందని, పాఠశాల విద్యార్థులే రచనలు చేయడం సంతోషమని మెదక్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ (ACGE) ఆడేపు కరుణాకర్ అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాద్ వారు శాంతా వసంతా ట్రస్ట్ హైదరాబాద్ వారి సౌజన్యంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళి ఘణపూర్ నందు సృజనాత్మక బాలసాహిత్య కార్యశాల జరిగింది.  ఈ సందర్భంగా కరుణాకర్ మాట్లాడుతూ ప్రకృతితో పాటుగా జంతువులతో మాట్లాడించే శక్తి బాలసాహిత్యానికి ఉందని, బాలల లోకానికి నిచ్చెనలేసి, ఊహల ఆలోచనలకు రెక్కలు కట్టి, విహరించే బాలసాహిత్యం నేటి బాలలకు ఎంతో అవసరమన్నారు. మండల విద్యాధికారి మధుమోహన్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి గ్రంధాలయాల ద్వారా ఉన్నతులుగా ఎదిగేందుకు గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలని, గ్రంథాలయాల్లో ఉన్న మహనీయుల చరిత్ర, కథలు చదివి జీవిత తత్వానికి అనుగుణంగా నడవాలన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్ శాశ్వత సభ్యులు గరిపల్లి అశోక్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో అనేక పాఠశాలలో బాలసాహిత్య సృజన సాగుతుందని, అనేక ప్రక్రియల్లో విద్యార్థులు రచనలు చేసి జీవిత గమనంలో నడవాలన్నారు. యంజేపి ప్రిన్సిపల్ సృజన మాట్లాడుతూ పాఠశాల స్థాయిలోనే ఉన్నతంగా ఆలోచించి, రచనలు చేస్తూ మాతృభాషను రక్షించాలన్నారు. రచయితలు ఉండ్రాళ్ళ రాజేశం, గిర్ని అంజాగౌడ్, ఎండి ఉస్మాన్, నల్ల అశోక్, బుర్ర సంతోష్, ఎల్లమ్మలు కథలు ఎలా రాయాలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఇట్టి కార్యక్రమంలో హవేలి ఘనపూర్, బూర్గుపల్లి, రాజ్ పల్లి, ఎం జె పి హవేలిఘనపూర్ విద్యార్థులు, ఉపాధ్యాయులు శ్యామల, చల్ల రవీందర్, దేవులా,  శ్రీలత, సరిత, కనకరాజు, మధుమోహన్, ప్రతిభ, పర్శరాములు ఛాత్రోపాధ్యాయులు ప్రభాకర్, సుభాష్, భరత్, సమ్రీన్, మౌనిక, సంధ్య తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు