'ఈర్ల సమ్మయ్యకు తెలంగాణ సేవారత్న పురస్కారం '

 --విద్యా, సామాజిక, సాహిత్య రంగాల్లో ఈర్ల సమ్మయ్య కృషికి దక్కిన అరుదైన గౌరవం 
 --వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్ ప్రతినిధుల చేతుల మీదుగా పురస్కారం అందజేత 
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య 2026 సంవత్సరానికి గాను వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్ వారి "తెలంగాణ సేవారత్న' జాతీయ అవార్డు" అందుకున్నారు. ఈ మేరకు ఆయన గురువారం హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును స్వీకరింరించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్ 33వ వార్షికోత్సవం సందర్భంగా ఈ అవార్డు ను అందజేశారు. వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్ ప్రతినిధులు ఈర్ల సమ్మయ్యకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం, జ్ఞాపిక, అవార్డు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఈర్ల సమ్మయ్యను వారు అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యా, సాహిత్య, సామాజిక రంగాల్లో ఈర్ల సమ్మయ్య చేస్తున్న సేవలను సంస్థ ప్రతినిధులు కొనియాడారు. ఈర్ల  సమ్మయ్య మునుముందు మరెన్నో పురస్కారాలు అందుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈర్ల సమ్మయ్య విద్యా, సామాజిక, సాహిత్య రంగాల్లో విశేషంగా సేవ చేస్తున్నందుకు గాను ఈ 'సేవారత్న అవార్డు' అందజేశామని వారు తెలియ జేశారు. ఈర్ల సమ్మయ్య పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం, తారుపల్లి గ్రామానికి చెందినవారు. ఈయన శ్రీరాంపూర్, శ్రీరాంపూర్ ఎస్సీ కాలనీ, ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసి, ఆ పాఠశాలల్లో అనేకమైన విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఆ పాఠశాలలను అత్యద్భుతంగా తీర్చిదిద్దరమే కాకుండా అక్కడి పిల్లల్ని రాష్ట్రస్థాయిలో వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచేలా తర్పీదునిచ్చారు. ప్రస్తుతం  ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ పాఠశాలను, పిల్లల్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. పిల్లల్లో శాస్త్రీయభావనలు పెంపొందించడమే కాకుండా ఉత్తమ విద్యార్థినీ, విద్యార్థులుగా తీర్చిదిద్దుతూ, అందరి మన్ననలు పొందుతున్నారు. వారి సేవలను గుర్తించిన వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్ సంస్థ ఈర్ల సమ్మయ్యను ఈ అవార్డు అందజేసి సత్కరించింది.
విద్యారంగంలో సేవలు
ఈర్ల సమ్మయ్య అంకిత భావంతో పని చేస్తూ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. విద్యా సంబంధమైన అనేక వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ పిల్లల సర్వతోముఖాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు. తాను పని చేస్తున్న పాఠశాలల గ్రామాల్లో డ్రాపవుట్స్ పిల్లలు లేకుండా చేయడమే కాకుండా, మధ్యలో బడి మానివేసిన పిల్లల్ని మోటివేషన్ చేస్తూ వారు చదువు కొనసాగించేలా చేస్తున్నారు. ఆడపిల్లలు మధ్యలో బడి మానివేయకుండా ఉండేందుకు వారిని కేజీబీవీ, మోడల్ స్కూల్, ప్రభుత్వ గురుకుల పాఠశాలల హాస్టళ్ళలో, బాలురను ప్రభుత్వ వసతి గృహాల్లో జాయిన్ చేయిస్తున్నారు. విద్యా ప్రాముఖ్యతను వివరిస్తూ పిల్లలు చదువుపై ఆసక్తిని పెంపొందించుకునేలా మోటివేషన్ చేస్తున్నారు. పిల్లల్లో ఉన్న అంతర్గత శక్తులను వెలికితీసి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు. తాను పని చేస్తున్న పాఠశాలల్లో విద్యార్థుల ప్రయోజనం కోసం ప్రభుత్వం, దాతల సహకారంతో పాఠశాలల్లో మౌలిక, భౌతిక వసతులను కల్పిస్తున్నారు. తన సొంత డబ్బులు లక్షలాది రూపాయలు పాఠశాలల అభివృద్ధికి, పిల్లల సర్వతోముకాభివృద్ధికి వెచ్చిస్తూ వాటిని అద్భుతంగా తయారు చేస్తున్నారు. పిల్లల విద్యాభివృద్ధి కోసం అదనపు సమయం కేటాయిస్తూ ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. వయోజనులను చైతన్య పరిచి ఓపెన్ స్కూల్ విధానంలో చదువుకునేలా ప్రోత్సాహస్తున్నారు. 
సాహిత్య రంగంలో సేవలు
ఈర్ల సమ్మయ్య సాహిత్య రంగంలో విశేషంగా సేవలు అందిస్తున్నారు. సాహిత్యం ద్వారా కూడా సామాజిక మార్పులు తీసుకురావాలనే సదుద్దేశంతో సాహిత్య సేవ చేస్తున్నారు. 'మధురిమలు' అనే నూతన తెలుగు లఘు కవితా ప్రక్రియను ప్రారంభించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని రచయితలు, కవులతోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని తెలుగు వారిచేత రచనలు చేయిస్తూ, సామాజిక మార్పుకు కోసం విశేషంగా కృషి చేస్తున్నారు. మేఘనా సాహితీ కళావేదిక ద్వారా  ఆన్లైన్లో మధుర కవిభూషణ, మధుర కవివిభూషణ, సహస్ర మధుర కవిభూషణ, సహస్ర మధుర కవి విభూషణ పురస్కారాలను అందజేస్తూ కవులు, రచయితలను ప్రోత్సహిస్తున్నారు. 'బాల వికాస తరంగిణి' ద్వారా బాల సాహిత్యానికి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. బాలల విద్యా వికాసానికి తోడ్పాటునందిస్తున్నారు.  బాల కవులను ప్రోత్సహిస్తున్నారు.
సామాజిక రంగం సేవలు
ఈర్ల సమ్మయ్య పేద ప్రజలు, నిరాశ్రయులు, ఆపదలో ఉన్న వారిని ఆదుకొంటూ పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు పండ్లు, పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. గతంలో కరోనా వ్యాధి బారిన పడిన వారికి మాస్కులు, పండ్లు, పౌష్టికాహారాన్ని ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. నిరుపేద కుటుంబంలో కుటుంబ యజమాని మరణించిన సందర్భంలో ఆ కుటుంబానికి వస్తు రూపేణా, ఆర్థికంగా సాయం చేస్తూ వారిని ఆదుకుంటున్నారు. పేద కుటుంబాలకు చెందిన పిల్లలు స్టడీ మెటీరియల్ కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉన్న వారికి స్టడీ మెటీరియల్, ఇతర విద్యాసామాగ్రిని అందజేస్తున్నారు. పేదపిల్లల  విద్యాభ్యాసం కోసం విశేషంగా కృషి చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించి పేదవారికి వివరిస్తూ, అర్హులైన వారికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నారు. తనకు 'తెలంగాణ సేవారత్న జాతీయ పురస్కారం' రావడం పట్ల ఈర్ల సమ్మయ్య మిక్కిలి ఆనందం వ్యక్తం చేశారు. తాను వివిధ రంగాల్లో చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను గుర్తించి అవార్డును అందజేసిన వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్ ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈర్ల సమ్మయ్యకు 'తెలంగాణ సేవారత్న పురస్కారం' రావడం పట్ల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తంచేశారు. ఆయనకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.

కామెంట్‌లు