దురాశ ఎక్కడో దుఃఖమక్కడ..!: - కవి రత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
ఏ రాజుకైనా ఏ పేదకైనా
ఏ బిక్షగాడికైనా ఏ బిల్ గేట్స్ కైనా
సృష్టికర్త ఇచ్చిన సమయం 24 గంటలే...

ఏ తల్లిఐనా తన గర్భాన
బిడ్డను మోసేది నవమాసాలే...

ఏ కొత్తజంట బంధాలైనా ముడిపడేది
మూడు ముళ్ళతోనే ఏడు అడుగులతోనే..

రాత్రింబవుళ్ళు రైళ్ళు నడిచేది
పరుగులు పెట్టేది రెండు పట్టాలపైనే...

పక్షులన్నీ ఎన్ని
వేలమైళ్ళ దూరం ప్రయాణించినా
వినీల గగనాన స్వేచ్ఛగా విహరించినా
కడకు తిరిగి చేరవలసింది తమ గూటికే...

కోటీశ్వరులైనా...
అపర శ్రీమంతులైనా...
రాజులైనా...చక్రవర్తులైనా...
అధాని అయినా...అంబాని అయినా...
ట్రంపైనా...పుతినైనా...నెతన్యాహుఐనా
వేలవేల ఎకరాలు లక్షలకోట్ల ఆస్తులు
విలాసవంతమైన భవనాలెన్ని ఆర్ధించినా

ఖరీదైన కారుగాని...
కళ్ళజోడు గాని...
మెళ్ళో చైనుగాని...
చేతి వాచ్ గాని...
చేతిలోని సెల్ఫోన్ గాని...
ప్రాణానికి ప్రాణమైన
పెంపుడు కుక్కపిల్లగాని...
చిల్లిగవ్వకాని..‌.
చీపురు పుల్లగాని...వెంటరాదు
అందరికీ దక్కేది ఆ ఆరడుగుల నేలే...

ఈ జీవిత నగ్నసత్యాలు బోధపడిన
సజ్జనులు...
సత్పురుషులు...
సంఘసంస్కర్తలు...
సంస్కారవంతులు...
మానవత్వమున్న మనుజులు...

పగా ప్రతికారాలతో...
అసూయా ద్వేషాలతో...
రాజ్య కాంక్షలతో రగిలిపోరు...
రక్తపాతం నరమేధం కోరుకోరు...
అందరి సొమ్ము అన్యాయంగా
అక్రమంగా దోచుకోరు దాచుకోరు...

చీమలకు సైతం ఏ హాని తలపెట్టరు...
అంతా తమకేనంటూ అత్యాశకుపోరు...
ఎవరికి ఏ ఆపదోచ్చినా ఆదుకుంటారు...
పదిమందిని ప్రేమిస్తారు సదా సేవిస్తారు...

అందరికి ఆదర్శంగా ఉంటారు...
సంపూర్ణ జీవితాన్ని అనుభవిస్తారు...
చరిత్రలో చిరంజీవులుగా మిగిలిపోతారు.. 

నింగిలో ధ్రువ తారలుగా వెలిగిపోతారు...

దురాశ ద్వేషం పగ ఎక్కడో...
దుఃఖం కన్నీళ్ళు అక్కడ...
ప్రేమ త్యాగం ఎక్కడో...
శాంతి స్వర్గం అక్కడ...!


కామెంట్‌లు