అమ్మ ఉన్న ఇల్లు… కొండమీది కోవెల
ఆమె నవ్వు నిత్యదీపారాధన వెలుగు…
అమ్మ లేని ఇల్లు
అరచేతిలో ఆరిపోయిన దీపంలా
అంధకారం…గాఢాంధకారం...
అమ్మలేని బ్రతుకు
విత్తనంలేని నేలలా
ఒక శాపం…నరకకూపం...
ఆకలేసి…
అమ్మ ముద్ద కోసం కన్నీటి గిన్నెలో
ఆశల్ని కలుపుకుంటే
మేం…నిర్లక్ష్యపు రాళ్లమయ్యాం...
జబ్బు చేసి…
అమ్మ మంచాన పడితే
ఆమె శ్వాసే వేదనగా మారి
మందుల కోసం ఆరాటపడితే
మేం…చెవిటి గోడలమయ్యాం...
తన రక్తాన్ని స్వేదంగా మార్చి
కన్నీటిధారల్ని కష్టాలుగా పేర్చి
రేయింబవళ్లు నిద్రాహారాలు మాని
ఒంటరిగా ఆర్జించిన ఆస్తినంతా నిన్న
మాకు పంచిన పావనగంగ అమ్మ...
నేడు…
ఆ గంగమ్మ తల్లిపై
ఒక చుక్క దయ లేదు
చిల్లిగవ్వలేని అనాధగా
నీడకోసం ఎదురు చూసే వృక్షంలా
అమ్మ అస్తిపంజరంగా మిగిలింది...
నాడు అమ్మ
కొసరి కొసరి గోరుముద్దలు తినిపిస్తే
అది అమృతధారగా జారిపోయింది...
నిన్న మేం…
ఆ ప్రేమామృతాన్నే మరచి
ఇన్ని పచ్చడి మెతుకులైనా పెట్టలేక
పాశాణ హృదయాలమయ్యాం...
ఓ అమ్మా… మమ్మల్ని క్షమించు...
ఓ దైవమా… మమ్మల్ని శిక్షించు….
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి