సింహావలోకనం,,,,!! 2: - యెనుముల వేణుగోపాలరావు -అమలాపురం.

 మరువగలమా,మరువతరమా,
చిన్ననాటి చిరు జ్ఞాపకాలు!
దొంగచాటుగా ఆడిన 
పేకముక్కలు,
భోగిమంటకై దొంగిలించిన 
చెక్కముక్కలు,
కుక్కలుతరుమగా నెప్పెట్టిన 
కాళ్ళపిక్కలు.....!
"మరువగలమా"
సినిమాకోసం వెళ్ళిన బస్తీ,
ఈత పళ్ళ కోసం పట్టిన కుస్తీ 
కిట్టిగాడికి చేసిన సుస్తీ,
చెంబు తో చేసిన ఇస్త్రీ,
నా బెస్ట్ ఫ్రెండ్ పక్కింటి శాస్త్రి!
"మరువగలమా"
ఊరు చివరన గంగ నుయ్యి, 
బామ్మ కాచిన కమ్మని నెయ్యి,
నీళ్ల కోసం తవ్విన గొయ్యి, 
మట్టి తో చేసిన కట్టెల పొయ్యి!
"మరువగలమా"
చింత చిగురు కి ఎక్కిన చెట్టు,
ఊరు మధ్యన కోమటి కొట్టు, 
అరువు అడిగితే బయటకు నెట్టు,
వూరు చివరన ఏటిగట్టు!
" మరువగలమా"
సెలవుల్లో ఎగరేసిన గాలి పటాలు,
అమ్మవారి సంబరానికి వచ్చిన ఘటాలు, 
సంతలో త్రాగిన గోలీ సోడా,
జామకాయ కోసం దూకిన గోడ!
మరువగలమా ,మరువతరమా,
చిన్ననాటి చిరు జ్ఞాపకాలు
తిరిగిరాని వ్యాపకాలు....!!
                 ***
కామెంట్‌లు