శ్రీమద్భాగవతం: భక్తి రసామృత సారము (36 వ భాగం)(ద్వితీయ స్కంధము)-డా: సి.హెచ్.ప్రతాప్

 ధ్రువ చరిత్ర
 
శ్రీమద్భాగవతములోని ద్వితీయ స్కంధమునందు భగవంతుని లీలావతారములను వివరించు క్రమములో ధ్రువుని చరిత్ర అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకొన్నది. స్వాయంభువ మనువు కుమారుడైన ఉత్తానపాదుడనే మహారాజుకు సునీతి, సురుచి అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. సునీతి పెద్ద భార్య అయినప్పటికీ, రాజుకు సురుచిపై ఉన్న మితిమీరిన వ్యామోహం వల్ల ఆమె నిరంతరం అవమానాలను భరించాల్సి వచ్చేది. సునీతి కుమారుడు ధ్రువుడు, సురుచి కుమారుడు ఉత్తముడు. ఒకనాడు ఉత్తానపాదుడు తన సింహాసనంపై కూర్చుని చిన్న కుమారుడైన ఉత్తముడిని లాలిస్తున్న సమయములో, ఐదేళ్ల బాలుడైన ధ్రువుడు కూడా తండ్రి ఒడిలో కూర్చోవాలనే కోరికతో ముందుకు వెళ్ళాడు. ఇది గమనించిన సురుచి అత్యంత అసూయతో, కఠినమైన మాటలతో ధ్రువుని వారించింది. రాజు కూడా సురుచి మాటకు ఎదురు చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. సురుచి ధ్రువుని చూసి "ఓ బాలుడా, నీకు ఈ సింహాసనమును లేదా తండ్రి ఒడిని పొందే అర్హత లేదు. నీవు రాజవంశంలో జన్మించినప్పటికీ, నా గర్భమున జన్మించలేదు. కాబట్టి పరమేశ్వరుడిని ఆరాధించి, ఆయన అనుగ్రహము పొంది, తిరిగి నా గర్భమున జన్మిస్తేనే ఈ స్థానానికి అర్హుడవుతావు" అని తూలనాడింది.
ఈ కఠినమైన మాటలకు ధ్రువుడు తీవ్రమైన మనస్తాపానికి గురై, ఏడుస్తూ తన తల్లి సునీతి వద్దకు వెళ్ళాడు. తన కుమారుడికి జరిగిన అవమానాన్ని విని సునీతి ఎంతగానో దుఃఖించింది, కానీ తన దౌర్భగ్యాన్ని తలచుకుంటూ ధ్రువునికి హితవు పలికింది. సవతి తల్లి మాటలను శాపముగా కాక, ఒక గొప్ప మార్గదర్శకత్వంగా భావించమని ఆమె బోధించింది. కేవలం ఆ జగన్నాథుడైన శ్రీమన్నారాయణుని ఆరాధన ద్వారానే ధ్రువుడు కోరుకున్న అత్యున్నత స్థానాన్ని పొందగలడని ఆమె సూచించింది. తల్లి మాటలతో ప్రభావితుడైన ఆ బాలుడు రాజ్య సుఖాలను వదిలి ఏకాంతంగా అడవికి బయలుదేరాడు. మార్గమధ్యలో నారద మహర్షి ధ్రువుని కలిసి, అతని పట్టుదలను పరీక్షించదలచారు. అంత చిన్న వయసులో అడవిలోని క్రూరమృగాల మధ్య తపస్సు చేయడం అసాధ్యమని వారించినా, ధ్రువుని దృఢ నిశ్చయం చెక్కుచెదరలేదు. ధ్రువుని అచంచలమైన విశ్వాసాన్ని చూసి మురిసిన నారదుడు, అతనికి యమునా నదీ తీరంలోని మధువనము అనే పవిత్ర ప్రదేశానికి వెళ్ళమని సూచించారు. అక్కడ జపించవలసిన "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే ద్వాదశాక్షరీ మంత్రాన్ని, భగవంతుని రూపమును ధ్యానించే విధానాన్ని నారదుడు ఉపదేశించారు.
మధువనము చేరుకున్న ధ్రువుడు అత్యంత కఠోరమైన తపస్సును ప్రారంభించాడు. మొదటి మాసములో మూడు రోజులకు ఒకసారి కాయగూరలు, పండ్లు తింటూ శరీరాన్ని నియంత్రించాడు. రెండవ మాసములో ఆరు రోజులకు ఒకసారి కేవలం ఎండిన ఆకులు ఆహారంగా తీసుకున్నాడు. మూడవ మాసము వచ్చేసరికి తొమ్మిది రోజులకు ఒకసారి నీటిని మాత్రమే తాగుతూ ప్రాణాలను నిలుపుకున్నాడు. నాలుగవ మాసములో పన్నెండు రోజులకు ఒకసారి గాలిని మాత్రమే పీలుస్తూ తన ఇంద్రియాలను పూర్తిగా జయించాడు. ఐదవ మాసములో ధ్రువుడు ఒక కాలిపై నిలబడి, పరమాత్మపై దృష్టి నిలిపి, తన ప్రాణవాయువును బిగబట్టాడు. ధ్రువుడు చేసిన ఈ ప్రాణాయామము వల్ల విశ్వవ్యాప్తంగా వాయు సంచారము నిలిచిపోయి, సకల జీవరాశులకు శ్వాస తీసుకోవడం కష్టమైపోయింది. దేవతలందరూ భయభ్రాంతులై వైకుంఠమునకు వెళ్లి విష్ణుమూర్తిని వేడుకున్నారు.
బాలుడైన ధ్రువుని ఏకాగ్రతకు, తపస్సుకు మెచ్చిన శ్రీమన్నారాయణుడు గరుడవాహనారూఢుడై, శంఖ చక్ర గదాధారియై ధ్రువునికి ప్రత్యక్షమయ్యాడు. అంతఃకరణములో వెలుగుతున్న పరమాత్మ రూపం అకస్మాత్తుగా అదృశ్యం కావడంతో కళ్లు తెరిచిన ధ్రువుడు, సాక్షాత్తు భగవంతుని తన ఎదుట చూసి పులకించిపోయాడు. ఆ స్వామిని స్తుతించాలన్న కోరిక కలిగినా, సరైన పదాలు రాక తడబడుతున్న ధ్రువుని గమనించిన పరమాత్మ, తన పాంచజన్య శంఖముతో ధ్రువుని బుగ్గపై స్పృశించాడు. ఆ దివ్య స్పర్శతో ధ్రువునికి సకల వేద సారము, జ్ఞానము లభించాయి. ధ్రువుడు అద్భుతమైన స్తోత్రాలతో స్వామిని కొనియాడాడు. భగవంతుడు ధ్రువుని అభీష్టాన్ని మన్నించి, ముప్పై ఆరు వేల సంవత్సరాల పాటు ధర్మబద్ధంగా భూమండలాన్ని పాలించిన తర్వాత, సూర్యచంద్రాదులు, నక్షత్ర మండలాలకు పైన ఉండే అత్యున్నతమైన, శాశ్వతమైన ధ్రువపదాన్ని పొందుతావని వరాన్ని ఇచ్చాడు. ధ్రువుడు తిరిగి రాజ్యానికి చేరుకోగానే ఉత్తానపాదుడు తన కుమారుని ఘనంగా ఆహ్వానించాడు. ధ్రువుడు తన తల్లి సునీతితో పాటు సవతి తల్లి సురుచి పాదాలకు కూడా నమస్కరించి తన గొప్ప సంస్కారాన్ని చాటుకున్నాడు. రాజ్యపాలన ముగిసిన తర్వాత ధ్రువుడు తన కుమారులకు బాధ్యతలు అప్పగించి, బదరికాశ్రమానికి వెళ్లి తపస్సు చేశాడు. చివరకు విష్ణుదూతలు పంపిన దివ్య విమానంలో ధ్రువుడు సశరీరంగా పరమపదాన్ని చేరుకున్నాడు. ధ్రువ చరిత్ర మానవ జీవితంలో పట్టుదల, భక్తి ఉంటే దేనినైనా సాధించవచ్చని నిరూపిస్తుంది. ఐదేళ్ల బాలుడు తన అచంచలమైన విశ్వాసంతో త్రిలోకాలను కదిలించి, శాశ్వతమైన స్థానాన్ని పొందిన తీరు భక్త కోటికి ఆదర్శప్రాయం.

కామెంట్‌లు