మహారాష్ట్రలోని కొల్హాపూర్ నగరంలో వెలసిన శ్రీ మహాలక్ష్మీ ఆలయం అత్యంత ప్రాచీనమైన, పవిత్రమైన శక్తి పీఠాలలో ఒకటి. పురాణాల ప్రకారం భారత దేశంలోని 108 శక్తి పీఠాలలో ఇది ప్రముఖమైనదిగా పరిగణించబడుతుంది. ఈ క్షేత్రం పంచ గంగా నదీ తీరాన కొలువై ఉంది. ఇక్కడి అమ్మవారిని భక్తులు ఎంతో ప్రేమతో 'అంబాబాయి' అని పిలుచుకుంటారు. కాశీ క్షేత్రానికి వెళ్ళిన వారు కొల్హాపూర్ మహాలక్ష్మిని దర్శించుకోకపోతే వారి యాత్ర సంపూర్ణం కాదని భక్తుల నమ్మకం. ఈ ఆలయం క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో చాళుక్య రాజుల కాలంలో నిర్మించబడిందని చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత శిలాహార రాజులు, యాదవ రాజులు మరియు మరాఠా పాలకులు ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేశారు.
ఈ ఆలయ నిర్మాణ శైలి హేమాడ్ పంతి పద్ధతిలో ఉండి, నల్లని రాతితో నిర్మించబడింది. ఆలయ గోడలపై అద్భుతమైన శిల్పకళా ఖండాలు భక్తులను కట్టిపడేస్తాయి. గర్భాలయంలో అమ్మవారి విగ్రహం సుమారు మూడు అడుగుల ఎత్తు కలిగి, విలువైన పద్మరాగ మణి (ౠబ్య్) తో తయారు చేయబడింది. అమ్మవారు నాలుగు చేతులతో, కిరీటంపై శేషనాగును ధరించి దర్శనమిస్తారు. అమ్మవారి వాహనం సింహం. సాధారణంగా విగ్రహాలు తూర్పు లేదా ఉత్తర దిశల వైపు తిరిగి ఉంటాయి, కానీ ఇక్కడి మహాలక్ష్మి విగ్రహం పశ్చిమ దిశకు అభిముఖంగా ఉండటం ఒక ప్రత్యేకత. ఆలయంలో ఒక చిన్న కిటికీ ఉంటుంది, దీని ద్వారా సంవత్సరానికి రెండుసార్లు సూర్యకిరణాలు నేరుగా అమ్మవారి పాదాలను తాకుతాయి. ఈ అద్భుత ఘట్టాన్ని 'కిరణోత్సవం' అని పిలుస్తారు.
మహాలక్ష్మీ ఆలయ ప్రాంగణం విశాలంగా ఉండి అనేక ఉపాలయాలతో నిండి ఉంటుంది. ఇక్కడ మహాకాళి, మహాసరస్వతి దేవుళ్ళతో పాటు నవగ్రహాలు, వినాయకుడు మరియు ఇతర దేవతా మూర్తులు కొలువై ఉన్నారు. ఈ క్షేత్రంలో జరిగే నవరాత్రి ఉత్సవాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి. ఆ తొమ్మిది రోజులు అమ్మవారికి రకరకాల అలంకారాలు చేసి, ఊరేగింపులు నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుండి వస్తారు. కొల్హాపూర్ మహాలక్ష్మిని దర్శించుకుంటే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని, దారిద్ర్యం తొలగిపోతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఆలయ పరిసరాల్లో లభించే ప్రసాదాలు మరియు ఆధ్యాత్మిక వాతావరణం భక్తులకు మనశ్శాంతిని ప్రసాదిస్తాయి. ఇక్కడ ప్రతిరోజూ ఐదు సార్లు హారతి మరియు పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరుగుతాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో కుంకుమార్చనలు, అభిషేకాలు జరిపిస్తారు. ఈ క్షేత్రం ఆధ్యాత్మికతకే కాకుండా, భారతీయ సంస్కృతి మరియు శిల్పకళా వైభవానికి నిదర్శనంగా నిలుస్తోంది. కొల్హాపూర్ నగర ఆర్థిక వ్యవస్థలో కూడా ఈ ఆలయం ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు అమ్మవారి దర్శనంతో పాటు స్థానిక సంస్కృతిని కూడా ఆస్వాదిస్తారు. పురాణ కాలం నుండి నేటి వరకు తన దివ్యత్వంతో భక్తులను కాపాడుతున్న ఈ క్షేత్రం మహిమాన్వితమైనది. అంబాబాయి ఆశీస్సులు పొందిన వారికి జీవితంలో ఎటువంటి లోటు ఉండదని భక్తులు నమ్ముతారు. శక్తి స్వరూపిణి అయిన మహాలక్ష్మి కొల్హాపూర్ క్షేత్రంలో నిత్యం విరాజిల్లుతూ లోక కల్యాణం కోసం భక్తుల కోర్కెలను నెరవేరుస్తోంది. ప్రతి భక్తుడు తన జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన దివ్యధామం ఇది.
మన పుణ్య క్షేత్రాలు- 40: - సి.హెచ్.ప్రతాప్
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి