“మహర్షి: కపిలాచార్య: కృతజ్ఞో మేదినీ పతి:
త్రిపదస్త్రి దశాధ్యక్షో మహాశృంగ: కృతాంతకృత్”
“ఈ రోజు మనం శ్లోకాల ద్వారా కొత్తరకం విషయం తెలుసుకుందాము. మనకి తెలిసినంత వరకు తల్లి ప్రథమ గురువుగా తన పిల్లలకి లోకాన్ని పరిచయం చేస్తుంది. మంచి చెడు నేర్పిస్తుంది. చిన్న చిన్న నీతి కథలు చెబుతుంది. తండ్రి చెయ్యి పట్టుకు నడిపిస్తాడు. అలాంటిది.. పిల్లలే తమ తల్లిదండ్రులకు జ్ఞానబోధ చెయ్యటం అనేది ఎక్కడైనా వింటామా? తల్లిదండ్రులకు వేదాంత సారాన్ని బోధించిన అలాంటి ఒక విశేషం ఈ రోజు చెప్పుకుందాం” అన్నది బామ్మ.
“నిజమా బామ్మా? అయితే చెప్పు చెప్పు” అని పిల్లలందరూ ఆసక్తిగా దగ్గరకి చేరారు.
“బ్రహ్మ దేవుడు ప్రజాపతుల ద్వారా ఈ సృష్టిలో జీవరాశిని విస్తరించాడు. వారిలో కశ్యపుడు, దక్షుడు, కర్దముడు..ఇత్యాది ప్రజాపతులు ముఖ్యులు. అందులో కర్దమ ప్రజాపతికి, మనువు యొక్క కుమార్తె అయిన దేవహూతికి పుట్టిన సంతానం కపిలుడు. శ్రీమహావిష్ణువుని తమకి కొడుకుగా పుట్టమని కర్దముడు, దేవహూతి దీర్ఘకాలం తపస్సు చేసి వరం కోరతారు. అలా ఆ వరప్రసాదంగా శ్రీమహావిష్ణువు వారికి కపిలుడుగా జన్మిస్తాడు. పుట్టిన వెంటనే ఆయన, తనకి తపస్సు చేసుకోవటానికి వెళ్ళటానికి అనుమతి ఇవ్వమని అడుగుతాడు. అలా తపస్సు చేసి ఆయన వేదంలో అంతర్భాగమైన ‘సాంఖ్య’ యోగాన్ని దర్శించాడు. సాంఖ్య యోగం అంటే ప్రకృతి మరియు పురుషుల (ఆత్మ) స్వభావాన్ని వివరించే జ్ఞానాన్ని వివరిస్తుంది. ప్రకృతి మరియు పురుషుల కలయిక వల్లనే సృష్టి కొనసాగుతుందని నిన్న మనం చెప్పుకున్నాం కదా!”
“కపిలుడు తన తల్లిదండ్రులకి భక్తి, జ్ఞాన యోగాలని బోధించాడు. ఆయన మొత్తం వేదాల సారాన్ని, అంతరార్థాన్ని దర్శించాడు కాబట్టి ఆయనని “కపిల మహర్షి” అంటారు. సాధారణంగా యోగులు తపస్సు చేసి వేదంలో కొంత భాగం మాత్రం..మంత్ర రూపంగా దర్శించగలరు. అలా కొంత మాత్రమే దర్శించగలుగుతారు కాబట్టి వారిని ఋషులు అంటారు. కపిలుడు రూపంలో శ్రీమహావిష్ణువు మొత్తం వేద, వేదాంతాలని దర్శించగలిగాడు కాబట్టి ఆయనని ‘మహర్షి’ అని విశేష గుణంతో చెబుతారు. అలాగే తన తల్లిదండ్రులకి భక్తి, జ్ఞాన యోగాలని ఆచరించి, బోధించాడు కాబట్టి ‘ఆచార్యుడు’ అయ్యాడు.”
“కృతజ్ఞో” అంటే..ఈ జగత్తుని సృష్టించినదీ, అందులో చైతన్య రూపంగా ఉన్నదీ కూడా ఆ శ్రీమహావిష్ణువే కాబట్టి ఆయనని ఆ నామంతో పిలుస్తారు. ‘మేదినీపతి’ అంటే ఆయన సృష్టిలో భాగమైన ఈ భూమిని వరాహ రూపంలో రక్షించడం వల్ల భూమికి పతి అని చెబుతాము. ‘త్రిపదస్త్రి’..మూడు అడుగులతో ఈ లోకాలన్నిటినీ ఆక్రమించి కొలిచిన త్రివిక్రముడు ఆ శ్రీమహావిష్ణువు. అంతేకాదు..ఆయన త్రిగుణాలైన “సత్త్వ రజస్తమో” గుణాలకి అతీతుడు! ఆ త్రిగుణాల మాయ వల్ల కలిగే జాగృత్, స్వప్న, సుషుప్తులనే మూడు అవస్థలకి కూడా అతీతుడు. వాటికి అధ్యక్షుడిగా ఉండి, పై నించి వాటిని గమనిస్తూ సాక్షిగా ఉంటాడు. అందుకే ‘దశాథ్యక్షో’ అని ఆయనని కీర్తిస్తారు.”
“తను సృష్టించిన ఈ జగత్తుని జలప్రళయం ద్వారా అంతం చేస్తాడు. అలా జలప్రళయ సమయంలో పునఃసృష్టి కోసం బీజాలను జాగ్రత్తపరుస్తాడు. జలప్రళయ సమయంలో.. మత్స్య రూపంలో, తనకి ఉన్న ఒక మహాశృంగానికి కట్టిన నావలో సప్తర్షులని, సత్యవ్రత మహారాజును రక్షించి పునఃసృష్టి నిర్వహించాడు. అదే “మహాశృంగ: కృతాంతకృత్” అంటే!
“క్లుప్తంగా చెప్పాలంటే ఈ రోజు మనం శ్రీమహావిష్ణువు యొక్క మత్స్య, వరాహ, వామన, కపిల అవతారాలలో ఆయన చేసిన పనుల గురించి స్మరించుకున్నాము. ఈ రోజుకి చాలు. మరికొన్ని రేపు చెప్పుకుందాము” అని బామ్మ ఆ రోజు పాఠం చాలించింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి