“మహావరాహో గోవింద: సుషేణ: కనకాంగదీ
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్ర గదాధర:”
ఆ రోజు బామ్మ శ్లోకం చెప్పటం మొదలుపెట్టగానే..వాసు “బామ్మ ఈ రోజు ఆ శ్లోకానికి కొంతవరకు నేను అర్థం చెప్పగలను” అన్నాడు.
“సరే చెప్పు” అంది బామ్మ.
“హిరణ్యాక్షుడు భూమిని చాపలా చుట్టి సముద్రంలో దాచేస్తే..శ్రీమహావిష్ణువు వరాహావతారంలో వెళ్లి హిరణ్యాక్షుడిని వధించి భూమిని ఉద్ధరించి తన కోరల మీద నిలబెట్టి పైకి తీసుకొచ్చాడు. అందుకే ఆయనని భూమికి పతి అని పిలుస్తారు కదా బామ్మా” అన్నాడు.
“అవును నీకు బాగా గుర్తు ఉంది. అంతేకాదు ఆయనని ‘యజ్ఞ వరాహ మూర్తి’ అంటారు. ఆయన అవయవాలు వేదాలుగా ఉండి యజ్ఞ ప్రక్రియని సూచిస్తాయి. ఆయన కోరలు యజ్ఞంలో ఉపయోగించే శృక్కు శ్రుమ్ము అనే యజ్ఞ పాత్రల ఆకారంలో ఉంటాయి. ఈ అవతారంలో శ్రీమహావిష్ణువు యజ్ఞాలకి అధిపతిగా వర్ణించబడ్డాడు.”
“గోవింద”..’గో’ అంటే ఆవు. ‘గో’ అనే శబ్దానికి వాక్కులు అని కూడా అర్థం ఉంది. కృష్ణావతారంలో గోవులని కాచాడు, గోవర్ధన గిరిని ఎత్తి ఏడు రోజులపాటు చేత్తో పట్టుకుని ఇంద్రుడు కురిపించిన వర్షం నించి కాపాడాడు. అలాగే మన వాక్కులకి కూడా అగ్ని రూపంగా అధిపతి ఆయనే. వాక్కు అంటే వేద వాక్కు. వేద శబ్దం కూడా ఆయనే అని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాము కదా! అంతేకాదు ఆయన వేదాధ్యయనం ద్వారా మాత్రమే తెలుసుకోబడతాడు.”
“ఒక రాజు తన రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాలంటే ఆయన దగ్గర మంచి సైన్య సంపద ఉండాలి. సైన్యం.. రాజ్య సరిహద్దులని శత్రువుల బారినుంచి రక్షించే బాధ్యత వహిస్తుంది. అంతేకాదు.. సైన్యం తమకి ఉన్న కఠోరమైన శిక్షణ వల్ల అప్పటికప్పుడు కలిగే ప్రకృతి విపత్తుల నించి కూడా దేశాన్ని, ప్రజలని కాపాడుతుంది అని మనం టీవీలో చూస్తూ ఉంటాం కదా! అలా ఆ శ్రీమన్నారాయణుడు సృష్టి రక్షణ, పోషణ అనే బాధ్యత సమర్ధవంతంగా నిర్వహించటానికి అవసరమైన సమర్థులైన సైన్యం ఆయన దగ్గర ఉంది అని చెప్పటానికి “సుషేణ:” అంటారు.
“ఆ శ్రీమన్నారాయణుడు తన అవయవాలకి బంగారు ఆభరణాలు ధరించి ఉంటాడు. బంగారం అనేది ఒక లోహంగా అనేక ఔషధ విలువలు కలిగి ఉంటుంది. మనిషి శరీరం నించి ఎప్పుడు అనేక విద్యుత్తరంగాలు ప్రసరిస్తూ ఉంటాయి. అవి ప్రకృతిలోని విద్యుత్తరంగాలతో సంఘర్షించకుండా ఉండటాన్ని బంగారం నిషేధిస్తుంది. అందుకే బంగారాన్ని ఆభరణాలుగా ధరిస్తారు. అందుకే ఆయన్ని “కనకాంగదీ” అంటారు.
“శ్రీమన్నారాయణుడు రహస్యంగా మన హృదయ కుహరంలో (గుహ) నివసిస్తాడు. అలా ఉండి మన అన్ని చర్యలనీ గమనిస్తూ ఉంటాడు. ఆయన తత్వం చాలా గంభీరమైనది, లోతైనది. అర్థం చేసుకోవటం అంత తేలిక కాదు. మనం ఈ విషయం ఇంతకు ముందు ఆయన ‘మాయ’ గురించి మాట్లాడుకున్నప్పుడు తెలుసుకున్నాం. ఆ దేవ దేవుడి తత్వం తెలుసుకోవాలంటే చాలా ఉపాసన చేయాలి. శ్రమ పడాలి. వేదాలు, ఉపనిషత్తులు అభ్యాసం చేసి వాటి అర్థాలను లోతుగా గ్రహించి, అర్థం చేసుకోవాలి. మన శరీరంలోనే ఆత్మ రూపంగా ఉండి కూడా, ఆయన చేత సృష్టించబడిన మాయ వల్ల ఆయన ఉనికిని మనం తెలుసుకోలేము. జాగృత్, స్వప్న, సుషుప్త అవస్థల్లో మన శరీరం విశ్రాంతిలో ఉంటే..మనస్సు మాత్రం అనేక రకాల అనుభవాలని పొందుతుంది. వీటన్నిటి కంటే కూడా పైన ఉండే అవస్థని తురీయావస్థ అంటారు అని చెప్పాను కదా. ఆ తురీయావస్థలో మనస్సు కూడా ఉండదు. అప్పుడు సాక్షిగా ఉండి గమనించేవాడు ఆత్మ రూపంగా ఉన్న ఆ పరమాత్మ.”
“మన మనస్సు ఎప్పుడు నిలకడగా ఉండదు. ఎక్కడో ఒక చోటికి పయనిస్తూ ఉంటుంది. అందుకే వేగం గురించి చెప్పాలంటే..వాయువేగ, మనోవేగాలని చెబుతారు. ఈ క్షణం ఇక్కడ ఉంటే..మరుక్షణం మిత్రుడి దగ్గరకి, అక్కడి నించి పార్కుకి, అక్కడి నించి సినిమా హాలుకి వెళుతుంది. తరువాత ఐస్ క్రీం గురించి ఆలోచిస్తుంది. కాబట్టి మనసుని..ఎప్పుడు తిరుగుతూ ఉండే చక్రంతో పోలుస్తారు. అలా అనుక్షణం తిరుగుతూ ఉండే మనసుని ప్రతీకాత్మకంగా ఆయన చేతిలో చక్రంగా ఉంచితే ఆయన దానిని నియమ బద్ధంగా తిప్పి మనని రక్షిస్తాడు. ఇక ఆయన తన ఇంకొక చేతిలో ‘గద’ ధరిస్తాడు. ‘గద’ ని మన బుద్ధితో పోలుస్తారు. బుద్ధి అనేది మనసులాగా కాకుండా..నిలకడగా ఉండి, మంచి చెడులను విశ్లేషిస్తుంది. యుక్తాయుక్త విచక్షణని గుర్తు చేస్తుంది. కాబట్టి ఏదైనా విషయంలో మనసుకి బుద్ధికి మధ్యన సంఘర్షణ వచ్చినప్పుడు బుద్ధి నిర్ణయానికి ప్రాధాన్యం ఇమ్మని పెద్దలు చెబుతారు.”
“క్లుప్తంగా చెప్పాలంటే అనుక్షణం తిరుగుతూ ఉండే మన మనసుని, నిలకడగా ఉండే బుద్ధిని, ఆయన చేతులలో పెడితే..మనం ధర్మబద్ధంగా, విచక్షణతో ప్రవర్తించే అవకాశం ఉంది అని ఆయన ధరించే ఆయుధాలుగా ప్రతీకాత్మకంగా చెబుతారు.”
“గుప్తంగా, గంభీరంగా, లోతుగా,వేదంలాగా ఉండే ఆయన తత్వాన్ని..ఆయనకి మనం ఇచ్చే రూపంద్వారా..శంఖు చక్రాలు, కిరీటం, ఆభరణాల ద్వారా అర్థం చేసుకుని ఉపాసిస్తే..అర్థం చేసుకోవటం తేలిక అని చెప్పచ్చు. తెలిసిందా” అన్నది బామ్మ.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి