”వినరో భాగ్యము విష్ణు కథలు” (63) : - ఎం బిందుమాధవి

 “వేధా: స్వాంఙ్గో: జిత: కృష్ణో దృఢ:సంకర్షణో ఽ చ్యుత:
వరుణో వారుణో వృక్ష:పుష్కరాక్షో మహామనా:”

“నిన్న దేవుడి మాయ గురించి బాగా చెప్పావు బామ్మా! ఇవ్వాళ ఏం శ్లోకాలు చెప్పుకుందాం” అని ఉత్సాహంగా అడిగాడు శేఖర్.
“ఆ రోజు శ్లోకం అంతా పిల్లల చేత ఒకసారి చెప్పించి..’వేధా:’ అంటే లోకాలని నిర్మించి నిర్వహించే గొప్ప కార్యక్రమాన్ని నిరంతరం చేస్తూ ఉండే ఆ శ్రీమన్నారాయణుడు తాను చేసే అన్ని పనుల్లోనూ తనకి తనే సహాయంగా ఉంటాడు. అది ఎలాగో చెప్పండి” అంది బామ్మ.
“ఆ:( నేను చెబుతా” అంటూ ముందుకి వచ్చాడు హరి.
“సరే చెప్పు” అని బామ్మ అనగానే..
“నాన్న ఉద్యోగానికి వెళతారు. అక్కడ నాన్నలో ఉండేది, నాన్న చేత పని చేయించుకునే ఆఫీసు యజమానిలో ఉండేది, పని చేశాక జీతం ఇచ్చే యాజమాన్యంలో ఉండేది ఆ శ్రీమన్నారాయణుడే కదా! అలాగే అమ్మలో ఉండేది, అమ్మ చేసే ఇంటి పనుల్లో అమ్మకి సహాయంగా ఉండే పనమ్మాయిలో ఉండేది ఒకే శ్రీమన్నారాయణుడు! మన సందు చివర ఇనప వస్తువులు తయారు చేసే మల్లయ్య లో ఉండేది, అతను నిప్పుల కొలిమిలో ఇనుముని కొట్టి సాగదీస్తూ ఉండేటప్పుడు..ఆ సాగదీసే ఇనుములో, నిప్పులో, కొట్టే సుత్తిలో ఉండేది ఆ శ్రీమహా విష్ణువే కదా! అలా అన్నమాట. అలాగే మొన్న బామ్మ చెప్పినట్టు కుండలు చేసే కుమ్మరిలో, కుండ చేసే మట్టిలో, తయారు చేసే పరికరంలో(సారె), తయారైన కుండ రూపంలో ఉండేది ఆ శ్రీమన్నారాయణుడే. అవునా బామ్మా” అన్నాడు హరి.
“సరిగ్గా చెప్పావురా. అలాగే డాక్టర్, టీచర్, చాకలి..ఇలా అందరి వృత్తి నైపుణ్యాల్లో మేధస్సు రూపంగా ఉండేది, వారు వాడే పని ముట్లలో ఉండేది ఆ శ్రీమన్నారాయణుడే! అదే ‘వేధా: స్వాంఙ్గో:’.. తన పనులన్నిటికీ తానే సహకారిగా ఉండటం అంటే!”
“ఆ దేవ దేవుడు ఏ అవతారంగా జన్మించినా..ఆయనని అధిగమించేవారు, జయించేవారు అంటూ ఎవరు ఉండరు. అందుకే ఆయనని ‘అజిత:’ అంటారు. ఈ విషయం మనం నరసింహావతారం, శ్రీ రామావతారం, వామనావతారం, వరాహావతారం, శ్రీకృష్ణావతారం చెప్పుకున్నప్పుడు తెలుసుకున్నాం కదా! అంతేకాదు..వేద విభజన చేసి, పంచమ వేదంగా పిలవబడే మహా భారతం లాంటి గొప్ప గ్రంథం రచించి, అష్టాదశ పురాణాలను రచించిన వ్యాస మహర్షిని ‘కృష్ణ ద్వైపాయనుడు’ అని కూడా అంటారు. అంత గొప్ప కార్యాన్ని నిర్వహించగలిగిన వ్యక్తి స్వయంగా విష్ణ్వాంశ సంభూతుడే అని చెప్పక తప్పదు. అందుకే ఈ రోజు ఆయన గురించి కూడా చెప్పుకుంటున్నాము.”
“ఆ శ్రీమన్నారాయణుడు..తను చేసే పనులలో దృఢ సంకల్పం కలిగి ఉంటాడు. ఏ మాత్రము నీరసించిపోవటం, పట్టు తప్పిపోవడం అనేది ఉండదు. దీనికి ఉదాహరణ ఎవరైనా చెప్పగలరా” అని అడిగింది బామ్మ. “శ్రీకృష్ణుడిగా, ఏడు రోజులు గోవర్ధన పర్వతాన్ని తన చేతితో ఎత్తి పట్టుకున్నాడు. అలాగే యమునా నదిలో విషం చిమ్మే కాళీయుడితో యుద్ధం చేసి అతని పొగరు అణిచాడు. పసి బాలుడిగా ఉండగానే పూతన, తృణావర్తుడు, మధుకైటభులు, శకటాసురుడు, బకాసురుడు, అఘాసురుడు మొదలైన రాక్షసులని సంహరించాడు. శ్రీరాముడి అవతారంలో పన్నెండేళ్ల చిన్న పిల్లవాడిగా ఉండగానే తాటక, సుబాహులతో యుద్ధం చేసి వారిని సంహరించాడు” అని సరిగ్గా చెప్పానా అని బామ్మ వంక చూశాడు.
“నేను చెబుతున్నాను సరే..మీరు కూడా ఆ భగవంతుని తత్వాన్ని బాగా ఒంట పట్టించుకుంటున్నారు. చాలా సంతోషం! ఇప్పుడు ‘సంకర్షణో ఽ చ్యుత:’ అంటే ఏమిటో తెలుసుకుందాము. ‘కర్షణం’ అంటే ఆకర్షించటం, తన వైపు లాక్కోవటం. శ్రీకృష్ణుడి సోదరుడైన బలరాముడికి ‘సంకర్షణుడు’ అనే పేరు ఉంది. అంతేకాదు..సంకర్షణ అంటే విభజించి మళ్లీ ఏకం చెయ్యటం అనే అర్థం కూడా ఉన్నది. శ్రీకృష్ణుడు అవతార స్వీకారం చేసే ముందు, తన అంశాన్ని దేవకీ గర్భం నించి తీసుకెళ్లి రోహిణి గర్భంలో ప్రవేశపెడతాడు. అలా దేవకీ దేవి గర్భం నించి విచ్ఛిన్నం అయిన పిండం తిరిగి రోహిణీ దేవి గర్భం నించి శిశువుగా జన్మ తీసుకున్నది. ఆయనే బలరాముడు. ఆయన ఆయుధం నాగలి. నాగలి భూమిని దున్నటం అనే పని ద్వారా..ఉన్న స్థితి నించి విచ్ఛిన్నం చేస్తూ తిరిగి కలుపుతూ ఉంటుంది. అవతార ప్రయోజనం కొరకు, శ్రీకృష్ణుడు ఈ పనులన్నీ దృఢంగా, ఏ విధంగానూ ‘చ్యుతం’ లేకుండా చేశాడు.”
“అంతేకాకుండా..ఆ శ్రీమన్నారాయణుడు సృష్టి అంతం చెయ్యదల్చుకున్నప్పుడు.. జీవులన్నిటినీ తనవైపుకి లాక్కుని(కర్షించి) తనలో లీనం చేసుకుంటాడు. ఆ కార్య నిర్వహణలో ఏ మాత్రం తొట్రుపాటు, లోపమూ లేకుండా నిర్మొహమాటంగా, నిష్కర్షగా ఉంటాడు. సరే ఇంకొన్ని శ్లోకాలు రేపు చెప్పుకుందాము” అని బామ్మ పాఠం ముగించింది.
కామెంట్‌లు