“త్రిసామా సామగ స్సామ నిర్వాణం భేషజం భిషక్
సన్న్యాస: కృచ్ఛమ: శాంతో నిష్ఠా శాంతి పారాయణం”
“పిల్లలూ ఇప్పటివరకు నేర్చుకున్నది ఒక సారి మననం చేస్తూ ఉండండి” అని బామ్మ కాలు ఈడ్చుకుంటూ వచ్చింది. “ఏమైంది బామ్మా” అని పిల్లలందరూ కాలు పుచ్చుకుని నొక్కి చూశారు.
“ఆ:( ఏమీ లేదు. మధ్యాహ్నం స్టూల్ మోకాలికి తగిలి కొంచెం నొప్పి పట్టింది” అని పిల్లలని ఆ రోజు శ్లోకాలకి సమాయత్తం చేసింది.
“త్రిసామా సామగ స్సామ” అంటే..బృహత్, రథంతర, వామదేవ్య అనే మూడు రకాలైన సామవేద మంత్రాలతో ఆ దేవ దేవుడిని పూజిస్తారు. వేదాలలో సామవేదం విశిష్టమైనది. వ్యాసుడు సామ వేదాన్ని వెయ్యి విధాలుగా విభజించాడు అని మనం నిన్న తెలుసుకున్నాం కదా! అంతేకాదు..ఆ జగత్ప్రభువు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి బోధించిన భగవద్గీతలో..తనేస్వయంగా వృక్షాలలో అశ్వత్థ వృక్షాన్ని అని, పక్షులలో గరుత్మంతుడిని అనీ, మాసాలలో మార్గశిర మాసాన్ని అని, శరీరంలో అగ్ని రూపంగా ఉండే జఠరాగ్నిని అని, వేదాలలో సామవేదాన్ని అని చెప్పాడు. అంతేకాదు ఆయన స్వయంగా సామవేద గానం చేస్తాడు”.
“అంత గొప్పదైన సామవేదం యొక్క స్వరూపం తనే అని చెప్పడం అంటే..కాల స్వరూపమే తాను అయిన ఆ దేవ దేవుడు..మూడు కాలాలకి అంటే ఉదయ, మధ్యాహ్న, సాయం సంధ్యలుగా పిలవబడే మూడు సంధ్యలకి..ఆధారమైన వాడు అని అర్థం.”
“వెయ్యి విభాగాలుగా విభజించిన సామవేదంలో మూడు ముఖ్యమైన మంత్రాలు..పైన చెప్పిన బృహత్, రథంతర, వామదేవ్య ఉన్నాయి. గణేశ నవరాత్రులు, దేవీ నవరాత్రులు అని మన ఊళ్లో చేస్తారు మీకు తెలుసు కదా! అలా భగవంతుడి ఆరాధన క్రమంలో నవరాత్రులు నిరాటంకంగా దీక్ష చెయ్యలేని వారు..చివరి మూడు రోజులు..సప్తమి, అష్టమి, నవమి అనే మూడు రాత్రుల దీక్షతో పూర్తి ఫలితాన్ని పొందవచ్చు అని మన సనాతన ధర్మం చెబుతున్నది. అలా ఆ మూడు ముఖ్య సామవేద మంత్రాలతో త్రిరాత్ర వ్రతం చేస్తే.. ఆయన ప్రత్యక్షం అవటమే కాక..ఇహంలో బతకటానికి కావలసిన జ్ఞానం, ఐశ్వర్యం ఇచ్చి మరణానంతర మోక్షము కూడా ఇస్తాడని వేద వాక్కు.”
“సంగీత త్రయంగా చెప్పబడే త్యాగరాజ స్వామి, ముత్తు స్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి సామవేదంలో ఆయనని స్తుతించి, ఆ దేవ దేవుడి మరియు అమ్మవారి సాక్షాత్కారం పొందారని మనకి చరిత్ర చెబుతున్నది.”
“అంతేకాదు..ఆ దేవ దేవుడు..జీవరాశుల మధ్య సామరస్యం నిలబడేట్లు చూస్తూ జీవులకి కలిగే శోకానికి, కష్టానికి ఉపశమనం కలిగిస్తాడు. జీవులకు కలిగే అనారోగ్యాలకి ఉపశమనం కలిగించే వైద్యుడు కూడా ఆయనే!” అని బామ్మ చెప్పగానే..”అయితే బామ్మా..ఈ రోజు నీ మోకాలి నొప్పికి వైద్యం కూడా ఆయనే చేస్తాడా” అని అడిగింది చిట్టి అమాయకంగా!
“ఆయనే వచ్చి వైద్యం చేస్తాడు అని కాదు. వైద్యం చేసే వ్యక్తిని పంపించి, ఆ వ్యక్తిలో ఆయనే ఉండి, సరైన ఆలోచనతో మంచి వైద్యం చేసే శక్తి కూడా ఆయనే అయి ఉంటాడు” అని బామ్మ చెబుతూ ఉండగా..”బామ్మగారూ..ఇందాక మీకు స్టూల్ తగిలి మోకాలు నొప్పి పెట్టిందట కదా! ఇదిగో ట్యాబ్లెట్..మా అమ్మ ఇచ్చి రమ్మన్నది అని రమేష్ వచ్చి ట్యాబ్లెట్, పై పూతగా ఒక ఆయింట్ మెంట్ ఇచ్చి వెళ్ళాడు. “ఇప్పుడు తెలిసిందా..ధర్మ బద్ధంగా బతికే జీవులని ఆయన కనిపెట్టుకుని ఉంటాడు అని ఇందాక మనం చెప్పుకున్న మాటకి అర్థం” అన్నది బామ్మ.
“సమ్న్యాస” అంటే..అన్ని రకాల కోరికలని, భోగాలని, రాగ ద్వేషాలను వదిలేసి మోక్ష సాధన కోసం తపస్సు చెయ్యటం. చాలా రోజుల క్రితం.. మనం ధర్మ బద్దంగా బతకటం అనే మనిషి జీవితంలో నాలుగు రకాల ఆశ్రమాలు ఉంటాయి అని చెప్పుకున్నాము..గుర్తుందా? మళ్లీ ఒక సారి చెబుతాను.. అవి బ్రహ్మ చర్యము, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సంన్న్యాసము. బ్రహ్మ చర్య ఆశ్రమంలో గురువుగారికి సేవ చెయ్యాలి, గృహస్థాశ్రమంలో దానం చెయ్యాలి, వానప్రస్థంలో నియమానుసరణ, యతులుగా (సన్యాసులు) మారిన తరువాత ‘శమము’ పాటించటం అనేవి వేదం బోధించిన నియమాలు. అలా సంన్న్యాస ఆశ్రమంలో ఇంద్రియాల ఆకర్షణకి లోనుకాకుండా..ప్రశాంతంగా భగవంతుడి మీద దృష్టి కేంద్రీకరించడం, ఆహార విహారాల మీద భౌతికమైన విషయాల మీద ధ్యాస లేకుండా మనసుని భగవంతుడి మీద లగ్నం చేసేటందుకు ఆ దేవ దేవుడు సహాయం చేస్తాడు. అలా ‘శమం’ పాటిస్తూ తపస్సు చేసుకునే యతులకు క్రమేణా భౌతిక శరీరం నశించే విధంగా అనుగ్రహిస్తాడు.”
“భౌతిక ఆకర్షణ లేకుండా..ధర్మ బద్ధంగా బ్రతికే జీవరాశులకు శాంతిని కలిగిస్తూ, వారిని తనలో లయం చేసుకుంటాడు. అలా ప్రళయ కాలంలో..జీవులన్నిటినీ తనలో లయం చేసుకోవటం అనే ప్రక్రియని నిష్టగా, నియమబద్ధంగా చేసి..పునరావృత్తి రహితంగా చేస్తాడు. తెలిసిందా” అని ఆ రోజు పాఠం ముగించింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి