వినరో భాగ్యము విష్ణు కథలు” (67)” : - ఎం బిందుమాధవి

 “శుభాఙ్గ: శాంతిదస్స్రష్టా కుముద: కువలేశయ:
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియ:”

“మనం ఇంతకు ముందు జీవుల శరీరాలు, వాటి అవయవ నిర్మాణము, శరీరంలో ఏ అవయవం ఏ రూపంగా ఉండాలి, ఎటు వైపు ఉండాలి, ఏ పరిమాణంలో ఉండాలి అనే విషయాన్ని నిర్ణయించే భగవంతుడి తత్వం పేరు ‘త్వష్ట’ అని చెప్పుకున్నాం గుర్తుందా” అని అడిగింది బామ్మ..ఆ రోజు శ్లోకాలు ప్రారంభిస్తూ!
“గుర్తు ఉన్నది బామ్మా. పక్షికి ఎగరటానికి వీలుగా రెక్కలు, ఆహారం చీల్చి తినటానికి వీలుగా పదునైన ముక్కు, రెండు కాళ్ళు..జంతువులు నాలుగు కాళ్లతో నడుస్తాయి..చేతులు ఉండవు కాబట్టి శరీరం మీద ముసిరిన క్రిమికీటకాలని తోలుకోవటానికి తోక, ప్రమాదం నించి రక్షించుకోవటానికి కొమ్ములు, కొన్ని జంతువులకి కోరల్లాంటి పళ్లు..ఇలా కదా!” అన్నది మానస.
“అవును..అలాగే కొందరికి చూడగానే మనం ‘అబ్బా ఎంత చక్కగా ఉన్నారో..తీర్చి దిద్దినట్టున్న అవయవ సౌష్టవం, పద్మపు రేకులవంటి కళ్లు..చక్కటి కనురెప్పలు, కనుబొమలు, సంపెంగ మొగ్గ లాంటి ముక్కు, దానిమ్మ గింజల లాంటి పలువరస, సరి అయిన కొలతలతో ముఖం అందాన్ని పెంచే చెవుల ఆకృతి, నల్లని తుమ్మెద రెక్కల లాంటి కేశాలు, కాంతివంతమైన పచ్చటి దేహ ఛాయ..ఇలా అనుకుంటూ ఉంటాం. అవునా? అలా ఆ శ్రీమన్నారాయణుడి అవయవ సౌష్టవం చక్కగా శుభం కలిగించేట్లు ఉంటుంది. ఆయన దేహం వర్షించే ముందు ఉండే మేఘంలాంటి వర్ణంతో ఉంటుంది. దానికి అర్థం ఏమిటంటే ఆయన జీవులన్నిటి అవసరాలు తీర్చటానికి, తనని పూజించి ధ్యానించేవారికి వరాలు వర్షంగా కురిపించటానికి వీలైన మేఘ వర్ణంగా ఉంటుందన్నమాట. అదే ‘శుభాఙ్గ:’ అంటే! అలా జీవుల అవసరాలు తీర్చి వారికి శాంతి కలిగిస్తాడు.”
“మనసులో కలిగే రాగ ద్వేషాలే మనిషికి శాంతిని దూరం చేస్తాయి. ఒకరంటే ఇష్టం, మరొకరంటే కోపం, కక్ష, ప్రతీకారం చెయ్యాలనుకునే ఆవేశం..ఇలాంటి రాగ ద్వేషాల వల్లనే మనిషికి అశాంతి కలుగుతూ ఉంటుంది. అవి దూరం చేసి శాంతిని ప్రసాదిస్తాడు. అదే ‘శాంతిద’ అంటే! ‘స్రష్టా’ అంటే..సృష్టి ఆరంభంలో అన్ని రకాల జీవ రాశులను సృష్టిస్తాడు అని చెప్పుకున్నాం కదా! అదే.”
“ఈ భూమండలం మీద అందరికీ అన్ని విధాలైన ఆనందాలని కలగజేసేవాడు ఆ శ్రీమన్నారాయణుడే! జీవరాశులకు ఆనందాన్ని, శాంతిని కలిగించి వారి కోరికలు తీర్చే వర్షం కురిపించేవాడు అయిన ఆ శ్రీమన్నారాయణుడు..భూమిని ఆవరించి ఉన్న నీటిలో సర్పం మీద శయనించి ఉంటాడన్నమాట. అదే ‘కువలేశయ:’ అంటే!”
‘కువలేశయ’ అంటే..రేగుపండులో ఉండే వాడు అని కూడా అర్థం ఉన్నది. ఇక్కడ మీకు ‘పరీక్షిన్ మహారాజు’ కథ చెబుతాను. ఆయన ఉత్తర-అభిమన్యుల పుత్రుడు. పాండవ వంశంలో ధర్మ రాజు తరువాత రాజ్యాన్ని పరిపాలించాడు. ఆయన చాలా ధర్మపరుడు, వీరుడు, శూరుడు. ప్రజలని కన్నబిడ్డల లాగా పరిపాలించాడు. ఒక సారి ఆయన వేటకి వెళ్లి చాలా మృగాలని వేటాడి..అలసటతో, దాహంతో మంచి నీటి కోసం దగ్గరలో ఉన్న ‘శమీక’ మహర్షి ఆశ్రమానికి వెళతాడు. అక్కడ ఆయన ధ్యానంలో ఉంటాడు. ఎంతసేపటికీ కళ్లు తెరిచి మహారాజుని చూసి, ఆయన ఎందుకు వచ్చాడో అడగలేదని కోపంతో..అక్కడ పడి ఉన్న పాము మృత కళేబరాన్ని ఆయన మెడలో వేసి వెళ్ళిపోతాడు. అడవిలో సమిధల కోసం వెళ్లిన శమీక మహర్షి కుమారుడు ‘శృంగి’అది చూసి కోపంతో..నా తండ్రి మెడలో మృత సర్పాన్ని వేసి ఇలాంటి అవమానం చేసిన వాడు ఏడు రోజుల్లో ఆ సర్ప జాతి వల్లనే మరణిస్తాడు అని శాపం పెడతాడు. అది తెలిసి పరీక్షిన్ మహారాజు కుమారుడైన జనమేజయుడు, ఏ జీవరాశి ప్రవేశించలేని ఒక భవనంలో తన తండ్రిని ఉంచి, సర్ప జాతి మొత్తం నశించాలని పెద్ద యాగం చేస్తాడు. అయినప్పటికీ ‘తక్షకుడు’ అనే సర్పం..మహారాజుకి ఆహారంగా అందించే రేగు ఫలంలో ప్రవేశించి గుప్తంగా ఉండి, రాజు ఆది తినటానికి కొరకగానే అందులో నించి వచ్చి ఆయనని కాటు వేసి చంపేస్తుంది. ఎన్ని పరిహారాలు చేసినా కూడా ముని శాపం వృధాగా పోదు. మనం చేసిన పాపం యొక్క ఫలం అనుభవించే తీరాలి అని తెలియచేసే చారిత్రక కథ ఇది.”
“అలా ‘కువలేశయ’ అనే విశేష నామానికి రేగు పండులో గుప్తంగా శయనించిన వాడు..ఆ శ్రీమహావిష్ణువే అని..ఆ విధంగా పరీక్షిన్ మహారాజుకి తను చేసిన కర్మఫలాన్ని అందించిన ఈ కథ కూడా చెబుతారు.”
“గోహితో గోపతి:” అంటే ఎవరు చెబుతారు” అని బామ్మ అడగగానే..”గోవర్ధన పర్వతాన్ని తన చేత్తో ఎత్తి పట్టుకుని, ఏడు రోజులు ఇంద్రుడు కురిపించిన వర్షం నించి..మొత్తం గోకులాన్ని, గోవులని కాపాడిన శ్రీకృష్ణుడిని అలా అంటారు” అని చెప్పింది పావని. అంతేకాదు బామ్మా..’గో’ అంటే భూమి అని కూడా చెప్పావు. భూమాతని వరాహ రూపంలో ఆ శ్రీమహావిష్ణువు హిరణ్యాక్షుడి నించి కాపాడాడు కాబట్టి ఆయనని ‘గోపతి’ అంటారు అన్నాడు వాసు.
“సరిగ్గా చెప్పారు. అంతేకాదు ఆయన తాను గుప్తంగా, రహస్యంగా ఉంటాడు” అని బామ్మ చెప్పగానే..అవును ఆయన చైతన్యానికి, శక్తికి ఒక రూపం, పరిమాణం అనేవి లేవు. ఉదాహరణకి వాయు శక్తి, ప్రాణ శక్తి అనేవి భౌతికంగా మనం చూడలేము కదా బామ్మా” అన్నది విద్య. అవును అలా గుప్తంగా ఉండి..జీవుల పోషణకి, రక్షణకి, నియమానుసారంగా బతకటానికి అవసరమైన అన్ని విషయాలని తన కంటి చూపు అనే కిరణాలతో (సూర్య, చంద్రులు) ఎప్పుడు వర్షం లాగా కురిపించేవాడు కాబట్టి ఆయనని ‘వృషభాక్షో’ అని చెబుతారు. అంతేకాదు.. ‘వృష’ అంటే ఆయన తను స్వయంగా ధర్మ స్వరూపంగా ఉండి..జీవులు ధర్మాచరణ చేసేట్లు గమనిస్తూ ఉంటాడు. అందుకే ఆయనని ‘వృషప్రియ:’ అంటారు” అని బామ్మ ఆ రోజు పాఠం ముగించి పిల్లలని పంపించేసింది.
కామెంట్‌లు