“అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమ కృచ్ఛివ:
శ్రీవత్స వక్షా శ్రీవాస:శ్రీపతి:శ్రీమతాంవర:”
“ధర్మాన్ని నిలబెట్టడమే ధ్యేయంగా గల ఆ శ్రీమహావిష్ణువు..దేవాసురులు, దుష్టులు-శిష్టుల మధ్య నిరంతరం జరిగే సంగ్రామంలో ఎప్పుడు దుష్ట సంహారం చేస్తూ, అసురులను నిరోధిస్తూ ఉంటాడు. అలాంటి లక్షణం గల దేవ దేవుడు తాను స్వయంగా ఏ భౌతిక లంపటాలని అంటించుకోకుండా ఉండే పవిత్రమైన ఆత్మ కలవాడు. అంటే..ఏ రాగ ద్వేషాలు లేని వాడు కాబట్టే మన లాగా ఆయనకి కర్మ ఫలాలు అనేవి ఉండవు. ఆ శ్రీమన్నారాయణుడే సృష్టి అంతంలో జీవరాశులన్నీటినీ తనవైపు ఆకర్షించి లయం చేసుకుంటాడు” అని బామ్మ ఆ రోజు పాఠం ప్రారంభించింది.
“తన వక్ష స్థలంలో శ్రీవత్సం అనే ఒక గుర్తుని కలిగి ఉంటాడు. ఆ చోటు లక్ష్మీ దేవికి చాలా ప్రీతికరమైనదని చెబుతారు. అంతేకాదు..అది మనిషి ప్రవర్తనని నియంత్రించే ఎనిమిదిరకాల మాయల సమూహమే అనికూడా కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి.” అని బామ్మ చెప్పగానే..”ఆ ఎనిమిది మాయలు ఏమిటి బామ్మా” అని అడిగారు పిల్లలందరూ కుతూహలంగా తలలు ముందుకు పెట్టి.
“మొదటిది..సృష్టి గురించిన మాయ..అంటే మన పుట్టుక మన ఇష్టమే అనుకునే మాయ అన్నమాట. రెండవది..అధికారం, అహంకారం. మన ప్రయత్నం, కృషి వల్లనే మనకి అధికారం దక్కిందనే అహంకారం మనిషిని కమ్మేస్తుంది. ఇక మూడవది.. ఒక దాని తరువాత మరొకటిగా అనుక్షణం మనుషులని వేధించే కోరికలు. నాలుగవది ఆశ..ఈ ఆశ అనేది కూడా ఒక రకమైన కోరిక లాంటిదే! ఆ ఆశ తీరకపోతే నిర్వేదం కలుగుతుంది. నిస్సహాయత ఆవరిస్తుంది. ఐదవది..భోగాలపట్ల కోరిక, ఇష్టం. ఆరవది మనిషిని భ్రమకి గురిచేసి అహంకారాన్ని పెంచేది ఐశ్వర్యం. ఏడవది..ఆశలు, కోరికలు, అధికారం, భోగాలపట్ల ఇష్టం ఉన్న వ్యక్తి..అవి తనకి దూరమైతే ఆవేశానికి, కోపానికి లోనవుతాడు. అదే ఏడవ మాయ అయిన క్రోధం. ఎనిమిదవ మాయ..ఇవన్నీ కలిసి ఉన్న ప్రత్యేకమైన మాయ. ఈ మాయలు మనిషిని ఆవహించి..తన అసలు స్వరూపాన్ని తెలుసుకోనివ్వవు. భగవంతుడికి దూరం చేస్తాయి. కాబట్టి..ఎలాగైతే మన మనసుని, బుద్ధిని తన చక్రం, గద అనే ఆయుధాలుగా ధరిస్తాడో..అలాగే మనని ఆవరించిన మాయలని కూడా ఒక చిహ్నం ద్వారా ఆ శ్రీమన్నారాయణుడు ధరించి ఉంటాడు. అందుకే దేవాలయాల్లో శ్రీమహావిష్ణువు వక్ష స్థలం మీద ఈ శ్రీవత్సాన్ని, లక్ష్మీ దేవిని ప్రత్యేకమైన గుర్తులుగా చూపిస్తూ..పూజిస్తారు.”
“క్షీర సాగర మథనంలో కల్ప వృక్షము, కామధేనువు, ఉచ్ఛైశ్రవము, ఐరావతము, చంద్రుడు, హాలాహలం, అమృతము..ఇలా చాలా ఉద్భవించాయి అని చెప్పుకున్నాం కదా. అలా అప్పుడు ఉద్భవించిన లక్ష్మీ దేవిని.. తమకే కావాలని ఇంద్రుడితో సహా దేవతలందరూ కోరుకున్నారు. కానీ ఆ దేవి ఆ శ్రీమన్నారాయణుడిని వరించింది. అందుకే ఆవిడకి తన వక్షస్థలంలో ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు. కాబట్టి ‘శ్రీవాసుడు’ అని పిలుస్తారు. అలా తన వక్షస్థలంలో నివసించే శ్రీలక్ష్మి ద్వారా.. ధర్మాన్ని అనుసరించేవారిని కాపాడి వారికి ఇహపరమైన జీవితంలో కావలసిన ఐశ్వర్యాలన్నిటినీ అందిస్తాడు.”
“మన సనాతన ధర్మం ప్రకారం ‘శ్రీ’ అంటే అన్నిరకాల విద్యలు అన్నమాట. విద్యలు అంటేనే వేదం అని అర్థం. “ఋగ్యజుస్సామ” వేదాలు నేర్చుకున్న బ్రహ్మ దేవుడు, ఇంద్రాది దేవతలు,
యజ్ఞం చేసే వాళ్ళు, యోగులు..వీరందరికీ శ్రీమహావిష్ణువు అనుగ్రహం వల్ల కలిగేది శాశ్వతమైన ఐశ్వర్యం. మన భౌతికమైన ఇంద్రియాలకు అతీతమైన విషయాలని ప్రామాణికంగా నిరూపించగలిగింది కూడా వేదం మాత్రమే! అలాంటి వేదాలు ఆయన స్వరూపం, వాక్కు, ఆయన ఉనికిని తెలియజేసే జ్ఞానం. కాబట్టి ఆయన వేదాలకి అధిపతి, మూల పురుషుడు కాబట్టి ఆ శ్రీమన్నారాయణుడిని ‘శ్రీమతాంవర:’ అంటారు” అని ముగించింది బామ్మ.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి