విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారకర్త రామానుజాచార్యులు : - చౌధరి రాధాకృష్ణ, - 9441451781
 సర్వజన శ్రేయస్సు కోసం గురువాజ్ఞనే ధిక్కరించిన సమతావాది,విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారకర్త,వైష్ణవాలయాల్లో పూజా విధానము స్థిరీకరించి జీయర్ వ్యవస్థను ఏర్పాటుచేసిన భాగ్యశీలి,తిరుమల మూలవిరాట్టు విష్ణువుగా ప్రామాణికంగా నిరూపించిన భక్తుడు, 
రెండు షష్టి కాలచక్రాలు వసించిన దీర్ఘాయువు గల యోగి పుంగవులు,హైందవంలో అంటరానితనం నిర్మూలనకు నడుంకట్టి, వైదిక మత పునరుద్ధరణకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు,వైదిక సంస్కృతి, సాంప్రదాయ పునాదులపై వెలసిన శైవ, వైష్ణవ, బౌద్ధ, జైన మత విశ్వాసాలు, నమ్మకాలను ఏకీకృతంచేసి వైదిక మత పునరుద్ధరణకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు, అద్వైత సిద్ధాంత ప్రచారకర్త భగవాన్ శ్రీ రామానుజాచార్యులు.  శ్రీ రామానుజాచార్యుల 1010 వ జయంతి సందర్భంగా  హిందువులు వేడుకలు జరుపుకుంటున్న వేళ, ఆయన జీవిత విశేషాలు, ఉపదేశాలు, ఏర్పరచిన వ్యవస్థలను ఓసారి మననం చేసుకుందాం. తమిళనాడులో చెన్నై నగరానికి 25 కిలో మీటర్ల దూరంలోగల శ్రీ పెరంబుదూర్లో 1017లో వైశాఖ శుద్ధ పంచమినాడు సాంప్రదాయ కుటుంబంలో కాంతమతి, కేశవా చార్యుల దంపతులకు జన్మించిన రామానుజాచార్యులు ఆస్తిక హేతువాదిగా పేరొందారు.  పుణ్యభూమి భారతావని నలుమూలలా పర్యటించిన ఆయన, నాటి హైందవ మతంలో పెనవేసుకున్న భిన్నత్వం, అస్పృశ్యత వంటి దురాచారాలను గమనించి, వైదిక మత పునరుద్ధరణకు కంకణధారులై విశిష్ఠాద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసి, హిందూ మతములో ఐక్యత సాధించారు. అత్యంత పవిత్రమైన తిరుమంత్ర ఉపదేశం కోసం పద్దెనిమిది సార్లు తిరస్కరించబడి, చివరకు తిరుక్కోటియార్ నంబి ఈ మంత్రాన్ని ఇతరులకు తెలియజేయననే షరతుపై రామానుజాచార్యులకు ఉపదేశించారు. గురువుగారికిచ్చిన మాట తప్పడం తప్పని తెలిసినా, తాను నేర్చుకున్న తిరుమంత్రాన్ని సామాన్య హిందువుకు కూడా చేరాలని,  ఆయన వైష్ణవాలయ శిఖరం ఎక్కి బిగ్గరగా అరుస్తూ తిరుమంత్రోపదేశం చేసి, మతవిద్య సర్వజనీనం కావాలని తెలిపారు. జీవుడు పరమాత్మలో భాగమని, జీవుడు, ప్రకృతి, పరమాత్మ వేర్వేరు కాదని ఆయన విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
ప్రస్థాన త్రయంగా పేర్కొన్న బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీతలకు సరళ పదజాలంతో భాష్యం చెప్పారు. దేవుని పూజించడానికి, మోక్షసాధనకు అందరూ అర్హులేనని, సమాజ శ్రేయస్సే కీలకమని, గురువులనైనా గుడ్డిగా నమ్మరాదని ఆయన పేర్కొన్నారు. తిరుమల ఆలయంలో నిత్య కైంకర్యాలు, పూజలకు విధివిధానాలను రూపొందించి, వాటిని అమలు చేయడానికి జీయర్ వ్యవస్థను ఏర్పాటుచేసిన రామానుజాచార్యులు దేశంలోని అనేక వైష్ణవాలయాల్లో పూజా విధానాన్ని క్రమబధ్ధీకరించారు. ఆయన వేదాంత సారం, వేదాంత దీపిక, వేదాంత సంగ్రహం, శ్రీరంగ గద్యం, వైకుంఠ గద్యం, శరణాగత పద్యం వంటి అనేక గ్రంథాలు రచించారు. 121 వ ఏట మాఘశుద్ధ దశమినాడు దైవాన్ని చేరకున్న భగవాన్ రామానుజాచార్యులు నిత్య ఆరాధకులు, పూజ్యనీయులు.
==========================================================

చౌధరి రాధాకృష్ణ, -  9441451781
ఆధ్యాత్మిక విశ్లేషకులు, 
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, శ్రీకాకుళం.
కామెంట్‌లు