శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 96
 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
75. మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషితా 
(షోడశాక్షరీ)
76. విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్య నందితా 
(షోడశాక్షరీ)
డెబ్బై ఆరవ నామ మంత్రము - 
  ఓం విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్య నందితాయై నమః
భండాసురుని సోదరులు అతని భుజముల నుండి, భండాసురుని ఇచ్ఛా మాత్రముచేతనే పుట్టినవారు. విషంగుడు, భండాసురుని కుడి భుజము నుంచి పుట్టిన వాడు. ఇతడు రాక్షస గురువు శుక్రాచార్యునితో సమానమైన శక్తి సామర్ధ్యాలు కలవాడు. కానీ, మంత్రిణీ దేవీ చేతిలో హతుడైనాడు. అమ్మ సేనలో ఉన్న వారాహీ దేవి హుంకారము చేస్తూ, భండాసురుని సేనలను చండాడుతూ, ఎడమ భుజము నుంచి పుట్టిన విశుక్రుని సంహరిస్తుంది. ఈ క్రమంలో, వారాహీ దేవి యొక్క వీర పరాక్రమాలను చూసిన పరమేశ్వరి, ఎంతగానో సంతోషం అనుభవించింది. ఇలా వారాహీ దేవి యొక్క వీరత్వాన్ని చూస్తూ సంతోషిస్తున్న లలితా పరాభట్టారికను చూసిన వశిన్యాది వాగ్దేవతలు అమ్మను "విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్య నందితా" అని కీర్తించారు. అటువంటి శ్రీమహారాజ్నికి నమస్కారము.
విషంగుడు, విశుక్రుడు, భండాసురుని భుజముల నుండి, భండాసురుని సంకల్పము తో పుట్టినవారు అవడం వల్ల, ఒక సందర్భంలో, వీరు భండాసురుని కుమారులు అని కూడా చెప్పబడింది. వీరిద్దరూ, భండాసురునికి భుజకీర్తుల వంటివారు. కుడి ఎడమల కాపు కాస్తూ ఉంటారు. అటువంటి ఈ మహావీరులలో ఒకడు విషంగుని, మంత్రిణీ దేవీ తుదముట్టించింది.
భండాసురుని సేనానాయకులు, 30 మంది పుత్రులు, విషంగుడు, విశుక్రుడు, అమ్మ సేనల మీదకు వచ్చే ప్రయత్నాన్ని మొగ్గలోనే తుంచేస్తున్నాయి అగ్ని స్వరూపాలైన జ్వాలామాలిని, వహ్నివాసినుల రక్షణ వలయంలో ఉన్న శక్తి సేనలు. కిరిచక్రరథారూఢ, దండనాధ అయిన వారాహీ దేవి, భండాసురుని రెండవ పుత్రుడు లేదా ఎడమ భుజము అయిన విశుక్రుని, భీకరమైన పోరులో మట్టుబెట్టుతుంది. విశుక్రుడు నేలకు ఒరిగాడు. ఈ క్రమంలో వారాహీ దేవి చూపిన యుద్ధ నైపుణ్యానికి అమ్మ పరమేశ్వరి మురిసిపోయింది. అందుకనే,  "విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్య నందితా" అని కీర్తించబడింది.
విశుక్రుడు, మానవ శరీరంలో ఉత్పన్నమయ్యే శుక్రకణం వంటి వాడు. ఈ శుక్రకణముల ఉత్పత్తి మానవశరిరంలో జరగడం వలన, మానవుడు, అరిషడ్వర్గాల వైపు నడుస్తాడు. అప్పుడు, తనకు తెలాయకుండానే, భగవద్భక్తి కీ, పరమాత్మ కు దూరం అవుతాడు.  ఇహలోక సుఖాలకు దాసోహం అంటారు. ఈ అరిషడ్వర్గాలను గెలవాలి అంటే, అమ్మ సేనలోని వారాహీ దేవి అనుగ్రహం మనకు చాలా ముఖ్యం. వారాహీ దేవి అనుగ్రహముతో, అరిషడ్వర్గాలను మనలో తొలగించుకోవడం ద్వారా, ఆత్మ శుద్ధి జరిగి, మనలో ఆత్మ జ్యోతి వెలిగి, మనలను పరమేశ్వరి సన్నిధికి చేరవేస్తుంది.
సంసారబంధనములోని, భవబంధాలు పోవాలన్నా, దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలనే కోరికతో, తనను అచంచల భక్తితో, కొలిచే సాధకులను కాపాడటానికి సంసిద్ధయైన శ్రీమాత ను పూజించేటప్పుడు 
ఓం విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్య నందితాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు