మా ఊరు (పక్కా పల్లెటూరు): - అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ -9640748497
స్వచ్ఛతకు మారుపేరు మా ఊరు 
ఆక్సిజన్ ఫ్రీజోన్ మా ఊరు 

అనారోగ్యం మేమెప్పుడూ చూడలే
మా ఊరి ప్రజల్లో ..
మందుమాకులు మేమెప్పుడూ వేసుకోలే

ఊరంతా ఒక కుటుంబం 
వావి వరుసలతో ముడిపడిన
ఆత్మీయతానురాగాలు
మా ఊరు పక్కా పల్లెటూరు 

నగరపు నయావంచకుల కనుసోకని మేలిమి బంగారమే మా ఊరు 

ఇక్కడ వ్యవసాయమంతా
పశువులతోనే
పంటపొలాల్లో 
సేంద్రియ ఎరువులే వాడుతాం 

మాలో భక్తిభావమెక్కువే
మాకు రేపటి గురించి భయంలేదు బాధలేదు 
ఒక్కరి కోసం అందరూ తలా
 ఓ చేయ్యేస్తారు

మాకు పెరడితోటే పెట్టని కోట 
సహజ వ్యవసాయ పద్ధతులతో కూరగాయలు పండ్లు పండించుకుంటాం
మా ఆరోగ్య రహస్యమిదే

ప్రత్యక్ష చర్యాపద్ధతుల్లో
మా ఊరి బడిలో పిల్లలు పాఠాలు నేర్చుకుంటారు 

దేశ కాలమాన పరిస్థితులను
తెలుసుకోవడానికి చదువరులకు ఒక గ్రంథాలయం ఉంది 
దినపత్రికలు మహనీయుల
జీవితచరిత్రల పుస్తకాలు చదువుకుంటాం
దాంతో ఎంతో స్ఫూర్తిని పొందుతాం

ఇంటింటా టీ, కాఫీలు బందు 
రాగి జావ, జొన్న ,సజ్జ అంబలి 
అల్పాహారంగా ప్రొద్దుటిపూటే తీసుకుంటాం
ఇంత గొప్పగా ఉన్న మా ఊరునొదిలి 
నేనెవరో తెలియని పట్నానికి 
నేను పోనేపోను
ఊరంటే నా చిరునామా 
ఊరంటే నా ఉనికి పట్టు 
ఊరే మా ఆయువుపట్టు 
పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు 
పల్లె తల్లి వంటిది 
పట్నం ప్రియురాలు వంటిది
పల్లె నీకేంకావాలంటుంది
పట్నంనాకేమిస్తావంటుంది


కామెంట్‌లు