సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!

 భీష్మ పర్వము ప్రథమాశ్వాసము- 231 వ రోజు
ధర్మరాజు పితామహ గురువుల వద్ద యుద్ధానికి అనుమతి తీసుకొనుట
కృష్ణార్జునులు పాంచజన్యం, దేవదత్తాలు పూరించగా అవి పాండవ సైన్యంలో ఉత్సాహాన్ని కౌరవ సైన్యంలో కలతను కలిగించాయి. కౌరవ సైన్యాలకు ఉత్సాహం కలిగించే విధంగా మంగళ తూర్య నాధాలు మ్రోగించారు. ఆ సమయంలో ధర్మరాజు తన ఆయుధములను కవచాన్ని రథంలో వదిలి భీష్ముని వైపు పాదచారి అయి నడువ సాగాడు. అది చూసిన కృష్ణ, సాత్యకి ఇతర ధర్మరాజ సన్నిహితులు కలవర పడి రథాలు దిగి ధర్మరాజును అనుసరించారు. " ఇందరం నీ వెంట ఉండగా నీవు ఇలా పాదచారివై వెడలుట ఏమి. శత్రువులు మనది పిరికితనం అని హేళన చేయరా " అని సోదరులు తలా ఒక విధంగా అడుగుతున్నా ధర్మరాజు మౌనం వీడక చేతులు ముకుళించి నడచి పోతునే ఉన్నాడు. అది చూసిన శ్రీకృష్ణుడు " ధర్మజుని తలపు నాకు తెలుసు. అతడు భీష్మ, ద్రోణ, కృపాచార్య, శల్యులకు నమస్కరించి యుద్ధం చేయడానికి అనుమతి తీసుకోవడానికి వెళుతున్నాడు. అలా చేస్తే విజయం తధ్యం " అన్నాడు. ఆ మాటలు విని అందరూ మౌనంగా జరిగేది వీక్షించ సాగారు. కృషార్జున, నకులసహదేవ, భీమాదులతో ధర్మరాజు భీష్ముని ఎదుట నిలువగా కౌరవ ప్రముఖులు మాత్రం ధర్మరాజులోని రాకకు అంతర్యం తెలియక భీమార్జున, నకులసహదేవ, ద్రుపద, సాత్యకుల అండ ఉన్న ధర్మరాజుకు భయమేల అని కొందరు అనుకోసాగారు. ధర్మరాజు పిరికి వాడు కాదు అయినా ఈ సమయంలో ఈ రాకలోని అంతర్యం ఏమిటో అనుకున్నారు. మానధనుడైన ధర్మరాజు ఏమి మాట్లాడతాడో, భీష్ముడు ఎలా సత్కరిస్తాడో, కృష్ణార్జునుల అంతర్య మేమిటో, భీమాదులు ఏమి చెప్తారో అని పలు పలు విధాలుగా ఆలోచించసాగారు. ధర్మరాజు భీష్ముని ఎదుట నిలిచి " మహానుభావా ! మీ ఎదుట నిలిచి యుద్ధం చేయవలసిన దుస్థితికి చింతిస్తున్నాను. మీ దీవెనలకు అనుమతికి వచ్చాను నాకు యుద్ధం చేయడానికి అనుమతి ఇచ్చి నన్ను దీవించండి . మీ దీవెనలు నాకు విజయాన్ని ప్రసాదిస్తుంది " అన్నాడు. భీష్ముడు ఆనందించి " ధర్మనందనా ! ఈ సమయంలో నీ రాక సముచితమే కాక ఎంతో శ్రేయస్కరం కూడా . నీవిట్లు చేయకున్న నా శాపానికి గురికావలసి ఉండేవాడివి. ఇక నీకు జయం కలుగుతుంది. నీ పక్షాన యుద్ధం చేయడం తప్ప ఏదైనా వరం కోరుకో అనుగ్రహసిస్తాను. నీకు మేలు జరుగుతుంది " అన్నాడు. ధర్మరాజు " పితామహా ! మీరు రారాజు తరఫున యుద్ధం చేయండి కాని మాకు మేలు చేయండి " అని కోరాడు. భీష్ముడు " ధర్మరాజా ! నీ ఆంతర్యం వివరించు " అన్నాడు. ధర్మరాజు " పితామహా ! మరేమి లేదు మీతో యుద్ధం చేసి గెలవడము ఎలాగో వివరించండి " అన్నాడు. భీష్ముడు చిరునవ్వుతో " ధర్మరాజా ! నాతో రణరంగాన గెలవడం దేవతలకు కూడా సాధ్యం కాదు. అడిగావు కనుక చెప్తాను. నే చేతి ఆయుధం కింద పడిన కాని అది సాధ్యం కాదు. ఇప్పటికి ఇంతకంటే చెప్పను . ఈ సారి మన కలయిక నీ మనోరధాన్ని నెరవేర్చ గలదు " అన్నాడు. భీష్ముని వద్ద అనుమతి పొందిన ధర్మరాజు తన వారితో కలసి ద్రోణ, కృపాచార్య, శల్యులకు నమస్కరించి వారి అనుమతి పొందాడు. ద్రోణుడు " ధర్మజా ! శ్రీకృష్ణుని అండ ఉన్న నీకు విజయం తధ్యం అన్నాడు. ధర్మరాజు ద్రోణుని అతడిని గెలిచే ఉపాయాన్ని చెప్పమని ప్రార్ధించాడు. ద్రోణుడు " ధర్మరాజా ! నా చేతిలో ఆయుధమున్నంత వరకు నన్ను గెలవడం సాధ్యం కాదు కాని నేను అస్త్రసన్యాసం చేసినా ప్రాయోపవేశం చేసినా నన్ను వధించగలరు. అశుభ వార్త వినినంతనే అస్త్రసన్యాసం చేస్తాను " అన్నాడు . కృపాచార్యుని గెలిచే ఉపాయం అడుగగా అతడు " నేను ఎవరి చేత చంపబడను కాని నీకు జయం తథ్యం " అన్నాడు. శల్యుని చూసి ధర్మరాజు తనకిచ్చిన మాట గుర్తు ఉంచుకొమ్మని చెప్పగా. అతడు ధర్మరాజుతో అతడికి ఇచ్చిన మాట గుర్తు ఉన్నదని అలాగే చేస్తానని నిశ్చింతగా ఉండవచ్చని మాట ఇచ్చాడు. 
(మహాభారతయుద్ధములో కౌరవ పక్షాన పోరాడి చావ కుండా బతికి బయట పడ్డవాళు కృష్ణాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ మాత్రమే. వీళ్లనే రధిక త్రయము అన్నారు.).
శ్రీకృష్ణుడు యుద్ధాన్నికుతూహలంతో చూడవచ్చిన కర్ణుని చూసి " కర్ణా ! భీష్ముని మీద కోపంతో అతడు పడిపోయే వరకు యుద్ధం చేయనని చెప్పావట కదా ! అప్పటి వరకు పాండవ పక్షాన యుద్ధం చేస్తూ వినోదించవచ్చు కదా ! " అన్నాడు. కర్ణుడు " కృష్ణా ! నేను భీష్ముని మీద కోపంతో యుద్ధం నుండి వైతొలిగాను కాని సుయోధనునికి ఇచ్చిన మాట తప్పనని నీకు తెలియనిదా " అన్నాడు. ఆ పై ధర్మజుడు రధాన్ని అదిరోహించి కవచాన్ని ధరించి కౌరవ పక్షంవైపు కొంత ముందుకు వెళ్ళి " కౌరవ ప్రముఖులారా ! మీలో ఎవరైనా నాపై ఉన్న అభిమానంతో నా పక్షంలోకి రావచ్చు నేను వారిని నా తమ్ముల వలె చూసుకుంటాను " అన్నాడు. ఆ మాటలు విన్న యుయుత్సుడు (ధృతరాష్ట్రుని వేరే భార్య కొడుకు) ధర్మరాజు పక్షంలో చేరటానికి అంగీకరించాడు. యుయుత్సుడు సుయోధనుని దుష్కృత్యములను నిందిస్తూ పాండవులను పొగుడుతూ తన సైన్యాలతో పాండవ పక్షంలో చేరాడు. ధర్మరాజు సంతోషంగా యుయుత్సుని ఆహ్వానించాడు.*
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు