మా తొలి గురువు మా అమ్మే: - డా కందేపి స్వప్నిక్, కందేపి సృజన్

 ప్రతి శిశువుకూ తల్లే తొలి గురువు అంటారు. మాకు మా అమ్మే తొలి గురువూ, మలి గురువూ కూడా. వేమన పద్యాలు పాడించినా, ఎvబిసిడి లు నేర్పించినా, నీళ్ళు ఎలా ఆవిరవుతాయి? భూమి తిరగడం వల్ల రాత్రింబగళ్ళు ఎలా ఏర్పడతాయి వంటివి ప్రయోగాత్మకంగా చూపించినా, చివరకు ఎమ్‌సెట్టుకు ప్రిపేర్ చేయించినా ఏది చెప్పినా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లు చెప్పడం తనకు వెన్నతో పెట్టిన విద్య. స్కూల్లో చెప్పని ఎన్నో విషయాలు మేము మా అమ్మ దగ్గర నేర్చుకున్నాం. నేను, మా అన్నయ్య చిన్నప్పుడు ఎక్కువ సార్లు స్కూలు ఎగ్గొట్టేవాళ్ళం. ఆ లెసన్స్ అన్నీ మా అమ్మ దగ్గరే చెప్పించుకునే వాళ్ళం. అమ్మయితే బాగా అర్థమయ్యేలా చెబుతుంది మరియు మా మూడ్ ను బట్టి చెబుతుంది. చదవాలనిపిస్తే ఐదారు లెసన్స్ ఒకేసారి చెప్పించుకునే వాళ్ళం. ఒకోసారి ఒక్క పేజీకే బోర్ కొడితే వదిలేసి ఆడుకునే వాళ్ళం. ఆటల్లో మ్యాథ్స్ ను మిళితం చేసేది. వంటింట్లో కుక్కర్, గ్రైండర్ ల పనితీరు వివరించి ఫిజిక్స్ ను సులభతరం చేసేది. ప్రతి విషయాన్నీ ఎనలైజ్ చేసి చూడటం నేర్పించేది. మేము హైస్కూలు స్థాయికి రాగానే ఒకే ప్రశ్నకు ఎలాబరేట్ గా ఎలా సమాధానం రాయాలి, లేదా బ్రీఫ్ గా ఎలా సమాధానం రాయాలో నేర్పించింది. మొదట్లో కాస్త కష్టమనిపించినా తర్వాత అలవాటైపోయింది. అలా నేర్చుకోవడం వల్ల పరీక్షల్లో ఎక్కువ మార్కుల క్వశ్చన్, తక్కువ మార్కుల కడగినా, తక్కువ మార్కుల క్వశ్చన్ ఎక్కువ మార్కుల కడిగినా మేం సులభంగా ఆన్సర్స్ వ్రాసేవాళ్ళం.
అలాగే పత్రికల్లో పిల్లల కోసం పెట్టిన శీర్షికలకు రాయమని ప్రోత్సహించేది. మేం వ్రాసినవి చూపిస్తే, తప్పులు దిద్ది పేపర్లకు పంపించేది. అలా మావి ఈనాడు, వార్త, జ్యోతి లలో ఎన్నో ప్రింట్ అయినాయి. ఇలా ప్రింట్ అయిన వాటన్నింటినీ ‘లిటిల్ హార్ట్స్’, ‘మై పిక్చర్స్’ అనే పుస్తకాల రూపంలోకి తీసుకు వచ్చింది మా అమ్మ. ఇంకా మా అమ్మ వ్రాసిన ఐదారు పుస్తకాలకు కవర్ పేజీగా నేనే బొమ్మలు వేశాను. ఇవన్ని ఒక ఎత్తు అయితే ఇంటర్ మీడియట్‌ లో మా అమ్మ చేసిన వర్క్ మరువలేనిది. ఎమ్‌సెట్ బిట్సన్ని తాను ముందుగా చదువుకొని నేను టీవీ చూస్తున్నా, అన్నం తింటున్నా అవన్నీ అడుగుతుండేది. ఆన్సర్ చెప్పడానికి ఎంత టైము తీసుకుంటున్నానో చూసి ఈసారి తగ్గాలని సూచించేది. రూపంలోనూ, జవాబులోనూ దగ్గర దగ్గరగా ఉన్న ప్రశ్నలనూ, చాలా మంది ఏవి మిస్టేక్ చేస్తారో ఆ ప్రశ్నలనూ ఒక నోట్ బుక్ లో వ్రాసి వాటిని ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయించేది. ఒక లెసన్ ను తానే ముందుగా చదివి ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేయడంతో నేను ఆ లెసన్ చదువు కునేటప్పుడు ఎక్కువ శ్రమ ఉండేది కాదు. (పరీక్షల సమయంలో చదివి చదివి అలసిపోయి ఇక చదవలేను అనిపిస్తుంది. కానీ టైములో సిలబస్ కంప్లీట్ అవ్వాలి ఎలా ఆ టెన్షన్ లో నున్నప్పుడు తనే చక చకా లెసన్స్ చదివి వినిపించేది). అలా మాకన్నా తనే ఎక్కువ కష్టం పడేది. నేను ఎంసెట్లో మొదటిసారే మెడిసిన్ సీటు సాధించినా, మా అన్నయ్య బయో టెక్నాలజీ కాలేజీలో చదువుతున్నా కాబట్టి మా ఇద్దరికీ మాస్టారు, మా-స్టార్ మా అమ్మే
మా అమ్మ చెప్పిన పాఠాల వల్లే.
కామెంట్‌లు